ఇదీ కలాం విజ్ఞత!
ABN , Publish Date - Sep 29 , 2024 | 05:38 AM
అన్యమతస్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలంటే నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డిక్లరేషన్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ నానాయాగీ చేశారు. ఇదేం దేశం.? ఇదేం హిందూయిజం.? ఎలాంటి లౌకికవాదమిది.? అంటూ గగ్గోలుపెట్టారు.
రెండుసార్లు తిరుమలకు.. రాష్ట్రపతి హోదాలోనే ఒకసారి
డిక్లరేషన్ ఇచ్చాకే స్వామి దర్శనం
జగన్‌కు మాత్రం ఎందుకు భేషజం?
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అన్యమతస్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలంటే నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డిక్లరేషన్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ నానాయాగీ చేశారు. ఇదేం దేశం.? ఇదేం హిందూయిజం.? ఎలాంటి లౌకికవాదమిది.? అంటూ గగ్గోలుపెట్టారు. అయితే గతంలో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో మహ్మదీయుడైన ఏపీజే అబ్దుల్ కలాం సైతం డిక్లరేషన్ ఇచ్చి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. దేశంలో గొప్ప మేధావిగా పేరొందిన ఆయన రాష్ట్రపతి హోదాలో ఉన్నా.. వేంకటేశ్వరుడి దర్శనం, సంప్రదాయాలు, నిబంధనల పాటింపు విషయంలో విజ్ఞత ప్రదర్శించారు. అలాంటిది డిక్లరేషన్ విషయంలో జగన్ ఎందుకు రచ్చ చేస్తున్నారనే ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి. భారతరత్న, దేశ మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాం కంటే జగన్ ఎక్కువా? ఏం గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తికి ఆ మాత్రం విజ్ఞత లేదా? అని నిలదీస్తున్నారు. కలాం తొలుత రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 20న, తర్వాత 2009 మార్చి 19వ మరోసారి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలని భావించిన కలాం.. తన కార్యాలయం అధికారిని పిలిపించి తిరుమలలో ఎలాంటి సంప్రదాయాలు పాటించాలి? ఆచార వ్యవహారాలు ఏంటి? అనే వివరాలు తెలుసుకున్నారు. సదరు అధికారి అప్పటి టీటీడీ ఈవోను సంప్రదించి, ఆయన చెప్పిన వివరాలను కలాంకు తెలియజేశారు. ముందుగా అన్యమతస్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేయాలని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్ ఫామ్‌ను ఢిల్లీకి తెప్పించుకొని, దానిపై సంతకం చేసి పంపించారు. దాన్ని టీటీడీ ఆమోదించిన తర్వాతనే కలాం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకొని వెళ్లారు. రాష్ట్రపతిగా లేనప్పుడు రెండోసారి 2009లో కూడా కలాం అదే పద్ధతి పాటించారు. ఎక్కడా టీటీడీ నిబంధనలు, తిరుమల అచార వ్యవహారాలు, సాంప్రదాయాలను ఆగౌరవపరచలేదు.
సినిమా డైలాగ్‌లు ఎందుకు?
డిక్లరేషన్‌పై సంతకం చేయడం అనేది మహా పాపమేమీ కాదు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం అంటే తాను వేరే మతానికి చెందిన వాడినని, అయినా వేంకటేశ్వరస్వామిపై నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉందని, దర్శనానికి అనుమతి కోరడం. అంతేకానీ డిక్లరేషన్‌పై సంతకం చేసినంత మాత్రాన హిందువు అయిపోరు, మతం మారిపోదు. ఏ మతం వారికి ఆయా దేవుళ్లపై విశ్వాసం ఉంటుంది. 1987లో దేవదాయ, ధర్మాదాయ శాఖ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో చట్టానికి సవరణ చేసింది. అప్పటినుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. దేవదాయశాఖ చట్టం 30/1987 ప్రకారం అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. అది కూడా 1990 నుంచి అమల్లోకి వచ్చింది. డిక్లరేషన్ అంటే కేవలం వేంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందని చెప్పడమే. కానీ దానికి కూడా జగన్ గగ్గోలు పెడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వాలా..? లేదా..? అన్నది జగన్ ఇష్టం. అంతేగానీ సినిమాలో డైలాగ్‌లు చెప్పినట్లు నా మతం మానవత్వం అంటూ జగన్ కబుర్లు చెబుతున్నారని, అబ్దుల్ కలాంతో పాటు చాలా మంది అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారన్న విషయం ఆయన తెలుసుకుంటే మంచిదని భక్తులు హితవు పలుకుతున్నారు.
హిందుత్వంపై జగన్ దాడి
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
నార్సింగ్, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): దళితులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని జగన్ చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ తిరుమల డిక్లరేషన్‌పై జగన్ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పటినుండో ఉందని, క్రిస్టియన్ అయిన జగన్ డిక్లరేషన్ ఇస్తే ఆయనకు వచ్చే ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు. జగన్ తీరు చూస్తుంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినట్లు అనిపిస్తుందని అన్నారు. ఇది ముమ్మాటికి హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే అన్నారు.