Share News

ఆ షాపులు భలే కిక్కు!

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:15 AM

నూతన మద్యం పాలసీలో షాపులు కేటాయించక ముందే కొన్ని దుకాణాలు భలే కిక్కిస్తున్నాయి! కొన్ని జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వస్తుంటే విజయవాడలో మాత్రం భారీ పోటీ నెలకొంది.

ఆ షాపులు భలే కిక్కు!

విజయవాడలో రెండు షాపులకు ఫుల్‌ డిమాండ్‌

96, 97వ నంబరు దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ

96కు 87 దరఖాస్తులు.. 97కు 75 మంది పోటీ

96వ షాపునకు వచ్చిన దరఖాస్తు ఫీజే 1.74 కోట్లు

41 వేలు దాటిన దరఖాస్తులు.. గడువు మరో 2 రోజులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

నూతన మద్యం పాలసీలో షాపులు కేటాయించక ముందే కొన్ని దుకాణాలు భలే కిక్కిస్తున్నాయి! కొన్ని జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వస్తుంటే విజయవాడలో మాత్రం భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా 96, 97వ నంబ రు షాపులకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఈ షాపులు ఒక్కోదానికి లైసెన్స్‌ ఫీజు ఏడాది రూ.85 లక్షలు. రెండేళ్లకు రూ.1.70 కోట్లు. అయితే 96వ షాపు కోసం ఇప్పటికే 87 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు కాబట్టి.. ఈ రూపంలోనే రూ.1.74 కోట్లు వచ్చినట్టయింది. అంటే.. వ్యాపారం మొదలుపెట్టాక రెండేళ్లపాటు వ్యాపారి చెల్లించే లైసెన్స్‌ ఫీజు ఈ దరఖాస్తుల ద్వారానే వచ్చేసిందన్నమాట! ఇక 97వ నంబరు దుకాణానికి 75 దరఖాస్తులొచ్చాయి. తద్వారా ఇప్పటికే 1.5 కోట్ల ఆదాయం వచ్చిపడింది. వాస్తవానికి ఎక్సైజ్‌ శాఖ ప్రతి షాపునకు ఒక నంబరు కేటాయించినా.. లైసెన్స్‌ వస్తే విజయవాడ పరిధిలో ఎక్కడైనా షాపు పెట్టుకోవచ్చు. అయినా దరఖాస్తుదారులు ఈ 2 షాపులకు పోటీపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఒక్కరోజులోనే 20వేల దరఖాస్తులు..

మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 41,348 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపునకు సగటున 12 అం దాయి. మంగళవారం ఒక్కరోజే 20వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సమర్పణకు బుధవారం చివరిరోజు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. అయితే దరఖాస్తుల గడువును ఈ నెల 11 వరకు దరఖాస్తులు సమర్పించేందు కు అవకాశం కల్పించారు. అలాగే 14న లాటరీ నిర్వహించి, 16 నుంచి షాపులు ప్రారంభించేలా ఎక్సైజ్‌ శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఈ నెల 15 వరకు ప్రభుత్వ మద్యం షాపులు కొనసాగున్నాయి.

ఆ జిల్లాల్లో మారని నేతల తీరు

ప్రభుత్వ స్థాయిలో హెచ్చరించినా కొన్ని జిల్లాల్లో నేతల తీరు మారట్లేదు. కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గా ల పరిధిలో షాపులకు ఇతరులను దరఖాస్తులు వేయనివ్వ డం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేద్దామన్నా ఎమ్మెల్యేల బెదిరింపులతో దరఖాస్తుదారులు వెనక్కి తగ్గుతున్నారు. ఎక్సైజ్‌ అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. బాపట్ల జిల్లా, భట్టిప్రోలులో ఐదు షాపులుంటే మంగళవా రం సాయంత్రానికి ఐదు షాపులకు కలిపి రెండే దరఖాస్తు లు పడ్డాయి. మూడు షాపులకు ఎవరూ దరఖాస్తు చేయలేదంటే ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ చ్చు. విశాఖ జిల్లాలో అనేక షాపులకు రెండంకెల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు కాలేదు. ఓ ఎమ్మెల్యే ఒత్తిడితో ఇతరులెవరూ దరఖాస్తు చేయట్లేదు. కాకినాడలో ఎక్కువ షాపు లు రెండు మూడు దరఖాస్తులకే పరిమితమయ్యాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 171 షాపులుంటే 1,326 దరఖాస్తులే అందాయి. నెల్లూరులో 182 షాపులకు 1,531, కాకినాడలో 155 షాపులకు 1,145 దరఖాస్తులే వచ్చాయి.

వెబ్‌సైట్‌లో దరఖాస్తుల సంఖ్య..

ఎమ్మెల్యేలు, నేతలు, సిండికేట్లను నియంత్రించేందుకు ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తుల సంఖ్యను పబ్లిక్‌ డొమైన్‌లోకి తీసుకొచ్చింది. సోమవారం వరకు ఏ షాపునకు ఎన్ని దరఖాస్తు లు వచ్చాయి అనేది తెలుసుకోవడం సాధారణ వ్యక్తులకు కష్టంగా మారింది. దీంతో సాధారణ వ్యక్తులు సరైన సమాచారం అందక దరఖాస్తుల విషయంలో వెనక్కి తగ్గారు. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ప్రతి షాపునకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే లైవ్‌ డేటాను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చారు.

నష్టం వస్తుందని ప్రచారం

కొన్ని ప్రాంతాల్లో వ్యాపారుల తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోటీని తగ్గించడం కోసం ఈ వ్యాపారంతో పెద్దగా లాభం ఉండదని, నష్టం కూడా వస్తుందని ప్రచారం చేస్తున్నారు. తద్వారా కొత్తవారు దరఖాస్తులు చేయకుండా నియంత్రిస్తున్నారు. దరఖాస్తుల సంఖ్య పెరిగితే పోటీలో తమకు లైసెన్స్‌ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని ఈ తరహా ప్రచారం చేస్తున్నా రు. కొత్తవారికి సరైన అవగాహన లేకపోవడం తో వ్యాపారం లాభసాటి కాదని భావించి వెనకడుగు వేస్తున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 04:18 AM