వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:35 PM
ఉమ్మడి జిల్లాలో శనివారం రహదారులకు రక్తం అంటుకున్నది.
ఉమ్మడి జిల్లాలో శనివారం రహదారులకు రక్తం అంటుకున్నది. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, నంద్యాల జిల్లాలో ఒకరు చనిపోయారు. వారి కుటుంబాలు కన్నీటి సాగరంలో మునిగిపోయాయి.
నందవరం, నవంబరు 30(ఆంధజ్యోతి): మండలంలోని ముగతి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం కారు- మోటర్ బైకును ఢీకొన్న ప్రమాదంలో బలిజ పెద్ద రంగస్వామి(25) అనే యువకుడు మృతి చెందాడు. మంత్రాలయం మండలంలోని సుంకేసుల గ్రామానికి చెందిన పెద్దరంగస్వామి ఎమ్మిగనూరులో తమ పని ముగించుకుని మంత్రాలయం మీదగా తమ స్వగ్రామమైన సుంకేసులకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ముగతి సమీపంలో మంత్రాలయం నుంచి ఇనవో కారు ఎమ్మిగనూరు వైపు అతి వేగంగా వస్తు బైక్‌ను ఢీ కొట్టింది. రంగస్వామికి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న ముగతి టీడీపీ నాయకుడు తులసీరామ్‌యాదవ్, డ్రైవర్ వలి తదితరులు స్పందించి వెంటనే ఆంబులెన్సలో ఎక్కించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే యువకుడు మృతి చెందాడు. ఢీకొట్టిన కారు కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వాసులదని, వారు మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం ముగించుకుని తిరిగి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. వెంటనే డీఎస్పీ ఉపేంద్రబాబు, ఏఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్యాలకుర్తి యూసుఫ్..
గోనెగండ్ల, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాలకుర్తికి చెందిన యూసుఫ్ (52) మృతి చెందాడు. గ్రామానికి చెందిన యూసుఫ్ శనివారంఉదయం తన ద్విచక్రవాహనంలో ఎమ్మిగనూరుకు బయలు దేరాడు. ఎమ్మిగనూరు పట్టణంలో మృతి చెందిన తన సమీప బంధువు అంత్యక్రియలకు వెళుతూ వేముగోడు గ్రామం శివార్ల దగ్గరకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడటంతో చుట్టపక్కల పొలాల వారు అక్కడికి వచ్చేలోగా మృతి చెందాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్టు సీఐ గంగాధర్ తెలిపారు.
కోవెలకుంట్లలో...
కోవెలకుంట్ల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వివరాల మేరకు.. కోవెలకుంట్ల పట్టణంలోని రంగరాజుపేటకు చెందిన గణపతి అలియాస్ రమణారావు (43) అనే వ్యక్తి ఆర్టీసీ బస్టాండులో మెకానికల్‌గా పని చేస్తుండేవాడు. ఉదయం ఆర్టీసీ బస్సును డ్రైవరు అశోక్ రివర్స్ పోవడంతో బస్సు వెనుక కింద చక్రాల కింద రమణారావు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిపిన వెంటనే ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.