Tirupati : ‘సిట్’ విచారణ ముమ్మరం
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:27 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది.
ఏఆర్, వైష్ణవి ట్యాంకర్ల డ్రైవర్ల వాంగ్మూలాలు నమోదు
తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. నాలుగో రోజు బుధవారం కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డెయిరీలకు సంబంధించిన సిబ్బందిని విచారించింది. తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ, తిరుపతి జిల్లాలోని వైష్ణవి డెయిరీలకు సంబంధించిన ట్యాంకర్ల డ్రైవర్లను సిట్ కార్యాలయానికి పిలిపించిన అధికారులు వారిని లోతుగా విచారించారు. రెండు డెయిరీలకు చెందిన సుమారు 15 మంది డ్రైవర్లను ప్రశ్నించి వివరాలు రాబట్టిన అధికారులు వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. కాగా, సిట్ బృందం చెన్నై ఎస్‌ఎంఎస్ ల్యాబ్ నెయ్యి నాణ్యతపై ఇచ్చిన సర్టిఫికెట్లను, ఇతర పత్రాలను పరిశీలించింది. అధికారులు చేపట్టిన విచారణలో మరో వారం, పదిరోజుల్లో సరికొత్త అంశాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలిసింది.