వర్రా కేసులో..పిటిషనర్లకు దురుద్దేశం!
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:48 AM
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్రా రవీందర్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి దాఖలైన హెబియస్‌కార్పస్ పిటిషన్‌లో పోలీసు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చాలని కోరడం వెనుక పిటిషనర్లకు దురుద్దేశం ఉందని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు.
నిర్దిష్ట ఆరోపణల్లేకుండా డీఐజీ, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చడానికి వీల్లేదు
హైకోర్టులో ఏజీ దమ్మాలపాటి వాదనలు
అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్రా రవీందర్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి దాఖలైన హెబియస్‌కార్పస్ పిటిషన్‌లో పోలీసు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చాలని కోరడం వెనుక పిటిషనర్లకు దురుద్దేశం ఉందని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. రవీందర్‌రెడ్డి భార్య కల్యాణి, ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న మూడో వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్‌లో సదరు ఉన్నతాధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. వారిని ప్రతివాదులుగా చేర్చడం ద్వారా పోలీసు వ్యవస్థను ఆందోళనలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. నిర్టిష్ట ఆరోపణలు లేకుండా ఎస్పీ, డీఐజీలను ప్రతివాదులుగా చేర్చడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది అక్రమ నిర్బంధం గురించి వాదనలు వినిపించకుండా.. కేసు పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం పట్ల కోర్టుకు దురభిప్రాయం కలిగించేలా ప్రయత్నిస్తున్నారని.. ఆయన కోర్టుకు సహాయకారి(అమికస్ క్యూరీ)గా వ్యవహరించడం లేదని, నిందితుడి తరఫున వాదనలు వినిపిస్తున్నారనే విషయాన్ని ఆయన గుర్తించాలని తెలిపారు. మూడో వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా కోర్టుపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
నిందితుడిని ఈ నెల 10న పోలీసులు అరెస్టు చేశారని.. నిబంధనల ప్రకారం 24గంటల్లో న్యాయాధికారి ముందు హాజరుపరచాల్సి ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో 11న సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టామని వెల్లడించారు. ధర్మాసనం ఉత్తర్వులను ఉల్లంఘించలేదన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషనర్ చేసేవన్నీ తప్పుడు ఆరోపణలని పేర్కొంటూ పోలీసు ఉన్నతాధికారులు అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. కర్నూలు డీఐజీ, కడప ఇన్‌చార్జి ఎస్పీ, పులివెందుల డీఎస్పీ, జమ్మలమడుగు సీఐలను ప్రతివాదులుగా చేర్చాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. నలుగురు అధికారులకూ నోటీసులు జారీ చేసింది. వర్రా రవీందర్‌రెడ్డిని 8నే అరెస్టు చేశారనేందుకు సాక్ష్యంగా పుల్లూరు టోల్‌ప్లాజా సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించామని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో.. సంబంధిత ఫుటేజ్ వాస్తవికతను తేల్చేందుకు దానిని భద్రపరచాలని జాతీయ హైవేల అథారిటీ అధికారులను ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించింది.
విచారణను 29కి వాయిదావేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశించాలని కోరుతూ రవీందర్‌రెడ్డి భార్య కల్యాణి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా.. రవీందర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రవీందర్‌రెడ్డి, మరో ఇద్దరు నిందితుల అక్రమ నిర్బంధంపై అఫిడవిట్ దాఖలు చేశామని, బాధ్యులైన పోలీసులపై చర్యలకు ఆదేశించాలని కోరారు. వ్యక్తులను అక్రమంగా నిర్బంధిస్తూ పోలీసులు చట్టనిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అలాంటివారిపై చర్యలు తీసుకునే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.
వర్రా కస్టడీపై తీర్పు రేపటికి వాయిదా
కడప రూరల్, నవంబరు 20: వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కో-కన్వీనర్ వర్రా రవీందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్‌పై తీర్పును జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు శుక్రవారాని(22వ తేదీ)కి వాయిదా వేసింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి దీనబాబు తీర్పును వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితుడైన ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణా అదే రోజుకు వాయిదాపడింది.