వైసీపీకి వేమిరెడ్డి రాజీనామా
ABN , Publish Date - Feb 22 , 2024 | 03:44 AM
అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.
రాజ్యసభ సభ్యత్వానికి కూడా..
త్వరగా ఆమోదించాలని సీఎం జగన్‌కు లేఖ
వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు అవుట్
అదే దారిలో మరో ఇద్దరు!
నెల్లూరు/అమరావతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో ఇప్పటికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంపీల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మరో ఇద్దరు కూడా గుడ్‌బై చెబుతారని విశ్వసనీయంగా తెలిసింది. వేమిరెడ్డి బుధవారం నెల్లూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వ్యక్తిగత కారణాలతో జిల్లా అధ్యక్ష పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్‌రెడ్డికి పంపిన లేఖ పంపినట్లు తెలిపారు. వెంటనే ఆమోదించాలని కోరానన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే అన్ని విషయాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఆయన నిర్ణయం తెలిసి ఉమ్మడి నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. మరికొందరు నెల్లూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వీరందరితో ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తామంతా ఆయన వెంటే నడుస్తామని వారు భరోసా ఇచ్చారు. కాగా.. వేమిరెడ్డి దంపతులు టీడీపీలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కుట్రలు, కుతంత్రాలు తెలియని ఆయన వైసీపీలో ఇమడలేకనే బయటకొచ్చారని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పునర్నిర్మాణానికి టీడీపీతో చేతులు కలపాలని కోరారు. ‘మంచివాళ్లకు వైసీపీలో స్థానం లేదని వేమిరెడ్డి రాజీనామాతో తేలిపోయింది. ఆయన ఆ పార్టీలో ఇమడలేకపోయారంటే అక్కడ జగన్, మంత్రుల పోకడలు ఎలా ఉన్నాయో అందరికీ అర్థమవుతోం’ అని పేర్కొన్నారు.
ముగ్గురు టీడీపీ.. ఒకరు జనసేనకు
వేమిరెడ్డి రాజీనామాతో వైసీపీ ఎంపీల్లో ఇప్పటికి నలుగురు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లయింది. వీరిలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. మిగిలిన ముగ్గురిలో వేమిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కాగా.. రఘురామకృష్ణంరాజు (నరసాపురం), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట) లోక్‌సభ సభ్యులు. వీరు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రఘురామరాజు చాలా కాలం కిందటే వైసీపీకి దూరమయ్యారు. నరసాపురం టికెట్ టీడీపీ కూటమిలో ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు కొద్ది రోజుల్లోనే టీడీపీలో చేరబోతున్నారు. వేమిరెడ్డి కూడా త్వరలోనే తన సతీమణి ప్రశాంతితో కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ నలుగురు ఎంపీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇవ్వనుంది. వేమిరెడ్డి నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైంది. మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా ఆ పార్టీకి రాజీనామా ప్రకటించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో వీరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.