‘గనుల్లో’ తిమింగలం తిష్ఠ
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:24 AM
ఆ అధికారి గనుల ఘనుడు వెంకటరెడ్డిని మించిన మహా ఘనుడు. కంటికి కనిపించకుండా అక్రమాలు, అవినీతికి పాల్పడటంలో ఆయనకు ఎవరూ సాటిరారనే పేరుంది.
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కలసి అడ్డగో లుగా వ్యవహరించిన, అవినీతి, అక్రమాలకు పాల్పడిన , తీవ్ర అభియోగాలు వచ్చిన అధికారు లపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. కొందరిపై కేసులు పెట్టి విచారణకు ఆదేశించగా, మరికొందరు అధికారులను తప్పనిసరి సెలవుపై పంపిస్తోంది. అయితే గనుల శాఖలో ఎన్నో ఆరోపణలున్న ఓ అధికారి మాత్రం అక్కడే తిష్ఠ వేశారు. ఆయన్ను జూలైలోనే బయటకు పంపాలను కుంటే పెద్దలు అడ్డుపడ్డారు. రెండో జాబితాలో అయినా ఆయనపై చర్యలు తీసుకోవాలనుకుంటే మళ్లీ సేమ్ సీన్. ఇప్పుడు మూడో జాబితా సిద్ధమైంది. అందులోనూ తొలిపేరు ఆయనదే. మళ్లీ పాత కథే. ఆయన్ను సెలవుపై పంపించొద్దంటూ ఏకంగా ఇద్దరు మంత్రులు, మరో ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నారు. ఏ అండాలేని వారు సెలవుపై వెళ్లిపోతున్నారు. పెద్దల అండదండలున్న ఈ తిమింగలం మాత్రం గనుల శాఖ నుంచి కదలనంటే కదలనంటోంది.
తీవ్ర ఆరోపణలున్నా ఇంకా అక్కడే
గనుల వెంకటరెడ్డి కంటే ఘనుడు
సెలవుపై పంపడానికి గనుల శాఖ యత్నం
ససేమిరా అంటున్న ఇద్దరు అమాత్యులు
గతంలో రెండుసార్లు పైరవీలు
తాజాగా సీఎంవో నుంచి వచ్చిన జాబితాలోనూ ఆయనదే తొలిపేరు
ఇప్పుడు కూడా పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆ అధికారి గనుల ఘనుడు వెంకటరెడ్డిని మించిన మహా ఘనుడు. కంటికి కనిపించకుండా అక్రమాలు, అవినీతికి పాల్పడటంలో ఆయనకు ఎవరూ సాటిరారనే పేరుంది. ఇలాంటి వారిని వెనకేసుకొస్తుందనే పేరున్న గత జగన్ ప్రభుత్వం కూడా ఆయన దోపిడీని భరించలేక చర్యలు తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయన్ను కదల్చలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుకతో పాటు కీలకమైన మినరల్స్ విషయంలో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. గనుల శాఖ వ్యవహారాల్లో తెరమీద వెంకటరెడ్డి కనిపిస్తే, తెరవెనుక నడిపించిందంతా ఈ అధికారే. ఇటు గనుల శాఖ, అటు ఏపీఎండీసీ వ్యవహారాల్లో వేలు పెట్టారు. నాటి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఉన్న వసూల్‌రాజాతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. నాటి గనుల శాఖ మంత్రికి అత్యంత ప్రియశిష్యుడు. ఇసుక, క్వార్ట్జ్, ఇతర మినరల్స్ లీజులు, వాటిపై విజిలెన్స్ దాడులు వంటి అనేకానేక అంశాల్లో ఆయన పాత్ర కీలకమని ఆ శాఖ వర్గాలే కోడైకూశాయి. పెద్దిరెడ్డికి, వెంకటరెడ్డికి మధ్య కోల్డ్‌వార్‌కు ఆయన చర్యలే కారణమని అప్పట్లో చర్చ జరిగింది.
సర్కారు ఆదేశాలూ బేఖాతర్
ప్రభుత్వ ఆదేశాలను కూడా ఆ అధికారి ధిక్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ లీజుదారుడు తప్పులు చే శార ని, ఆయనకు రూ.240 కోట్ల మేర డిమాండ్ నోటీసు ఇవ్వాలని నాటి జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ అధికారి డిమాండ్ నోటీసు ఇవ్వకుండా 45 రోజులపైనే ఉత్తర్వును దాచిపెట్టారు. ఈ లోగా ఆ కంపెనీ ప్రతినిధి హైకోర్టుకు వెళ్లారు. అంతేగాక ఆ కంపెనీ ప్రతినిధి తరచుగా ఆ అధికారి ఆఫీసుకు రావడం, ఇంటికి వెళ్లడం, రహస్య సమావేశాలు నిర్వహించడం వంటివి జరిగాయి. గత ప్రభుత్వం నిఘా విభాగం ద్వారా ఈ విషయం గుర్తించింది. సీసీటీవీ డేటా తె ప్పించుకొని పరిశీలించింది. ఆ తర్వాత ఆ అధికారిపై చర్యలు తీసుకుంది.
ఎన్నో అక్రమాలు
గత ప్రభుత్వంలో జేపీ వెంచర్స్‌కు ఇసుక కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందు గనుల శాఖే స్వీయ పర్యవేక్షణ చేసేది. ఆ సమయంలో ఆ అధికారి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. లీజులు ఇవ్వడం, మాట వినని వారిపై సైలెంట్‌గా విజిలెన్స్ దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేయడం, ఆ తర్వాత వారిని ఇంటికి పిలిపించుకొని సెటిల్ చేయడం.. ఇదీ ఆయన వ్యవహారం.
సార్‌ను కలవలేదని...
కూటమి సర్కారు వచ్చాక అన్ని రకాల మినరల్స్ పర్మిట్లను నిలిపి వేసింది. ఇందుకు కారణం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవకతవకలే. వాటిని సమీక్షించి పరిష్కరించడానికి తాత్కాలికంగా పర్మిట్లు నిలిపివేసింది. గత ప్రభుత్వం నాటి గనుల అక్రమాలపై స్పష్టత వచ్చాక కీలకమైన ఖనిజాల పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రమంతా క్వార్ట్జ్‌కు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది జరిగి చాలా రోజులు అవుతోంది. అయితే ఇంతవరకు ప్రభుత్వ ఆదేశం కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటంటే... లీజుదారులు వచ్చి సార్‌ను కలవలేదట. విషయం తెలియని లీజుదారులు ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. పర్మిట్లు ఇవ్వకపోవడం వల్ల అటు లీజుదారులకు, ఇటు ప్రభుత్వానికి కూడా తీరని నష్టమే. పర్మిట్లు ఇస్తే ప్రభుత్వానికి, లీజుదారులకు ఆదాయం వస్తుంది. మరి తనకేం వస్తుంది? ఏదో ఒకటి రావాలి కదా? అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారు.
పెద్దిరెడ్డి అండతో...
గత ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి అండతో గనుల శాఖలో ఆ అధికారి చేయని అరాచక మంటూ లేదని చెబుతున్నారు. లీజుదారులను వేధించడంలో ఆయన ఘనాపాటి అని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఒంగోలుకు చెందిన ఓ గ్రానైట్ మైనింగ్ కంపెనీ నుంచి ఆయన గట్టిగా పిండుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరగకుండా నాటి మంత్రి మోకాలడ్డారన్న ఆరోపణలున్నాయి.
కూటమి పాలనలోనూ అండ
కూటమి సర్కారు వచ్చాక కూడా ఈ అధికారి పాత్ర, జోరు తగ్గడం లేదు. పైరవీలు చేయించుకుంటూ ఇంకా గనుల శాఖలోనే కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర ఆరోపణలున్న అధికారులను కూటమి ప్రభుత్వం తప్పనిసరి సెలవుపై పంపిస్తోంది. జూలైలోనే ఆయన్ను బయటకు పంపాలని చూడగా ఆ జాబితాలో తన పేరు లేకుండా చూసుకున్నారు. ఆ తర్వాత ఆగస్టులో రూపొందించిన 26 మంది అధికారుల జాబితాలో ఆయన పేరుంది. అప్పుడు ఓ మంత్రితో ప్రభుత్వ పెద్దలకు చెప్పించుకొని బయటపడ్డారు. ఇప్పుడు మూడో దఫా 17 మందిని సెలవుపై పంపించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో ఈయనదే తొలిపేరు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఓ ఇద్దరు అమాత్యులు, అనకాపల్లికి చెందిన మరో కీలక నేతను ఆశ్రయించారు. నేరుగా ప్రభుత్వ పెద్దల వద్ద పైరవీలు చేయించుకున్నారు. ‘ఆ అధికారి మనకు కావాల్సినవాడు. చాలా మంచివాడు, సౌమ్యుడు’ అంటూ వారితో సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. ఆయనతో తమకు పనులున్నాయని, కదిలించడానికి వీల్లేదంటూ పెద్దలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపై ఏ విచారణ వేయవద్దని, ఏ కోణంలోనూ టచ్ చేయవద్దని ఇద్దరు మంత్రులు, మరో ప్రజాప్రతినిధి ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఆయన్ను బయటకు పంపించే కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పడింది. కేవలం ఈ అధికారి కారణంగానే, మిగిలిన అధికారులపై చర్యలు తీసుకోలేకపోతున్నట్లు తెలిసింది. 17 మంది అధికారులతో కూడిన జాబితాలో నుంచి ఆయన పేరు తప్పించి మిగిలినవారిని సెలవుపై పంపిస్తారా? లేక మొత్తం ప్రక్రియనే నిలిపివేస్తారా? అన్న చర్చ జరుగుతోంది.