Amaravati : పవన్‌కు వినతుల వెల్లువ
ABN , Publish Date - Jun 29 , 2024 | 05:42 AM
రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితులు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఓ వైపు ఉపముఖ్యమంత్రి తన శాఖలకు సంబంధించిన అధికారులతో ....
ఓపికగా విన్న జనసేన అధినేత.. మరోవైపు అధికారులతో సమీక్ష
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితులు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఓ వైపు ఉపముఖ్యమంత్రి తన శాఖలకు సంబంధించిన అధికారులతో మంగళగిరి జనసేన కార్యాలయంలో తెరిపి లేకుండా నిర్వహిస్తున్న సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. మరో వైపు ప్రజల వినతి పత్రాలను శుక్రవారం స్వీకరించారు. ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నుంచి 1,143 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకు ల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కోరారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో తాము బోధనలో ఉన్నామని తెలిపారు. 2022 పీఆర్పీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థకు కాంట్రాక్ట్, రెసిడెన్షియల్ టీచర్స్ అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్, క్రాప్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాప్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. పలువురు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరి నుంచి పవన్ కల్యాణ్ వినతిపత్రాలు స్వీకరించారు.