Share News

ఏపీ పర్యాటకంపై వియత్నాం ఆసక్తి

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:18 AM

ఆంధ్రప్రదేశ్‌, వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక బదలాయింపును పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు.

ఏపీ పర్యాటకంపై వియత్నాం ఆసక్తి

విజయవాడలో ‘ఏపీ-వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్‌-2024’

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక బదలాయింపును పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో శుక్రవారం ‘ఆంధ్రప్రదేశ్‌-వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్‌-2024’ నిర్వహించారు. ఐరా ఓవర్సీస్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 200 మందికిపైగా పర్యాటక ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, వియత్నాం తరఫున ఆ దేశ రాయబారి ఎన్‌గుయెన్‌ థన్హయ్‌ పాల్గొన్నారు. స్థానిక పర్యాటకంలో బౌద్ధరామాలు, స్మారకాలపై వియత్నాం ఆసక్తి కనబరిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని మంత్రి వారికి ప్రతిపాదించారు. అలాగే ఏపీలో పర్యాటకాభివృద్ధికి గల విస్తృత అవకాశాలను వివరించారు. ఎన్‌గుయెన్‌ థన్మయ్‌ మాట్లాడుతూ.. ఏపీలో తొలిసారి పర్యటిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని చెప్పారు. కాగా, శుక్రవారం ఏపీటీడీసీ కార్యాలయంలో ఆయన పర్యాటక శాఖపై మంత్రి దుర్గేశ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులంతా ఐకమత్యంతో పనిచేసి పర్యాటక సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 04:19 AM