Share News

Vijayawada : ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రాపై అధ్యయనం

ABN , Publish Date - Jul 10 , 2024 | 04:52 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది! రాజధానిగా అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.

Vijayawada : ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రాపై అధ్యయనం

  • జోన్ల వారీగా సీఆర్‌డీఏ కసరత్తు

  • ఏజెన్సీలకు అప్పగించిన పనుల స్థితిగతుల పరిశీలన

  • జరిగిన నష్టం, చేపట్టాల్సిన పనుల అంచనాలపై కసరత్తు

  • మేఘా, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ, బీఎ్‌సఆర్‌ఐఎల్‌ సంస్థల భాగస్వామ్యం

  • ఆయా సంస్థలతో గత టీడీపీ ప్రభుత్వంలోనే ఒప్పందం

  • అన్ని జోన్లలో అభివృద్ధి చేయాల్సిన ప్లాట్లు 67,912

  • వారం పది రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది! రాజధానిగా అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా రాజధానిలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ (ఎల్‌పీఎస్‌) ఇన్‌ఫ్రా పనులకు సంబంధించిన అంశాలపై సీఆర్‌డీఏ అధికారులు దృష్టి సారించారు. జోన్ల వారీగా ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా తాజా పరిస్థితులపె అధ్యయనం చేస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా పనులకు సంబంధించి చేపట్టిన పనులు, ఆ తర్వాత వాటి పురోగతి, కిందటి వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పరిస్థితి, తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా వైపు అడుగులు వేయటానికి అవసరమైన సన్నద్ధతకు సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రాకు ప్రయారిటీ సెక్టార్స్‌గా నిర్దేశించుకున్న మొత్తం 15 జోన్లకు సంబంధించి ఏయే ఏజెన్సీలకు పనులు అప్పగించారు? వాటి ప్రాజెక్టు వ్యయం ఎంత? ఎంతవరకు పనులు చేశారు? రోడ్ల పనులు ఎంత మేర చేశారు ? వాటర్‌ సప్లై, వరద నీటి మళ్లింపు కాల్వలు (స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్స్‌), సీవరేజీ పనులకు సంబంధించి ఆయా జోన్ల వారీగా బ్యాలెన్స్‌ వర్క్స్‌ ఎంత మేర మిగిలి ఉంది? గతంలో చేపట్టినవి ఎంత మేర డ్యామేజీ అయ్యాయి? వాటి నష్టం ఎంత? బ్యాలెన్స్‌ పనుల తాజా అంచనా వ్యయం ఎంతవుతుంది? వంటి అంశాలపై సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ భాస్కర్‌ నేతృత్వంలో ఒక్కో ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారి కొన్ని జోన్ల అధ్యయన బాధ్యతలు తీసుకున్నారు.

ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా విషయానికి వస్తే .. అమరావతి రాజధానిలో భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు వారి ప్యాకేజీ కింద అప్పగించాల్సిన ప్లాట్ల లే అవుట్లను అభివృద్ధి చేయటం కోసం ప్రాధాన్యత క్రమంలో మొత్తం 15 జోన్లను నిర్దేశిచారు. జోన్‌-1 ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా కింద నెక్కల్లు, శాఖమూరు (పార్ట్‌) లలో చేపట్టాల్సిన పనులను మేఘాకు, జోన్‌-2 ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా కింద అనంతవరం,

నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు (పార్ట్‌)పనులను బీఎ్‌సఆర్‌ఐఎల్‌ సంస్థకు జోన్‌-3 కింద నేలపాడు, శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి (పార్ట్‌)లలో ఎన్‌సీసీ, జోన్‌-4 కింద పిచ్చుకలపాలెం (పార్ట్‌), తుళ్లూరు (పార్ట్‌), అనంతవరం (పార్ట్‌)లలో బీఎ్‌సఆర్‌ఐఎల్‌, జోన్‌-5ఏ, 5బీ, 5సీ, 5డీ కింద అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, తుళ్లూరు (పార్ట్‌), పిచ్చుకల పాలెం (పార్ట్‌), అమనంతరం (పార్ట్‌), రాయపూడి (పార్ట్‌) లను మేఘా సంస్థకు, జోన్‌ - 6, 7 కింద కొండమరాజు పాలెం, రాయపూడి (పార్ట్‌), లింగాయపాలెం (పార్ట్‌),


ఉద్దండ్రాయునిపాలెం (పార్ట్‌), వెలగపూడి(పార్ట్‌), మందడం (పార్ట్‌)లను ఎల్‌అండ్‌టీ సంస్థకు, జోన్‌-9, 9 ఏల కింద లింగాయపాలెం (పార్ట్‌), మల్కాపురం (పార్ట్‌), మందడం (పార్ట్‌), శాఖమూరు (పార్ట్‌), ఐనవోలు (పార్ట్‌), నేలపాడు (పార్ట్‌), కొండమరాజు పాలెం (పార్ట్‌), వెలగపూడి (పార్ట్‌) పనులను మేఘాకు, జోన్‌ -10 కింద ఐనవోలు (పార్ట్‌), క్రిష్ణాయపాలెం(పార్ట్‌), వెంకటపాలెం (పార్ట్‌), మల్కాపురం (పార్ట్‌)లలో ఎల్‌అండ్‌టీ, జోన్‌- 12 కింద కురగల్లు, నవులూరు, నిడమర్రులను ఎన్‌సీసీ, జోన్‌ - 12 ఏ కింద కురగల్లు(పార్ట్‌), నిడమర్రు (పార్ట్‌) ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా పనులను ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించారు. అన్ని జోన్లు కలిపితే మొత్తం 67,912 ప్లాట్లను అభివృద్ధి చేయాల్సి ఉంది.

ప్రాధాన్యత క్రమంలో నిర్దేశించుకున్న జోన్లకు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.16,132 కోట్ల వ్యయమవుతుందని నిర్ణయించారు. ఆయా ఏజెన్సీలతో రూ.12,629 కోట్లతో చేపట్టేలా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. టెండర్ల ప్రకారం పనులు ఎంత వరకు జరిగాయి? ఇంకా ఎంత మేర జరగాల్సి ఉంది? అంచనా వ్యయం ఎంత అవుతుంది? వంటి అంశాల మీద సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 04:53 AM