Vijayawada: విజయవాడలో ధర్నాకు పోలీసుల ఆంక్షలు.. ఎక్కడికక్కడ అరెస్టులు
ABN , Publish Date - Feb 07 , 2024 | 06:22 PM
డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొన్ని నెలలుగా నిరసనలు తెలుపుతున్న ఆశ వర్కర్ల ఉద్యమాన్ని జగన్(CM Jagan) ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. గురువారం విజయవాడలో మహా ధర్నా చేపట్టబోతున్నట్లుగా ఆశావర్కర్లు(Asha Workers) పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
విజయవాడ: డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొన్ని నెలలుగా నిరసనలు తెలుపుతున్న ఆశ వర్కర్ల ఉద్యమాన్ని జగన్(CM Jagan) ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. గురువారం విజయవాడలో మహా ధర్నాకు ఆశావర్కర్లు(Asha Workers) పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఐటీయూ కార్యాలయం వద్ద పోలీసులను మోహరించింది. కార్యాలయం దాటి వెళ్ల కుండా ఆశావర్కర్ల గౌరవాధ్యక్షురాలు మణికి నోటీసులు పంపింది. ప్రభుత్వ ఆంక్షలపై ప్రజా సంఘాలు, సీఐటీయూ నేతలు, ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ.. "ధర్నాకు వెళ్లనివ్వకుండా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉన్నవారినీ అరెస్టు చేయడం దారుణం. సీఎం జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఆశావర్కర్లకి కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలి. కరోనా కాలంలో ఆశావర్కర్ల సేవలను ఐక్యా రాజ్య సమితి గుర్తించినా జగన్ ప్రభుత్వం మాత్రం వారిని గుర్తించలేకపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ మర్చిపోయారు. మహిళలని చూడకుండా అధికారులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు పరాభవం తప్పదు" అని విమర్శించారు.