Share News

ఊరి బడికి ఉరి

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:40 PM

వైసీపీ ప్రభుత్వం కొలువుదీరక ముందు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాఽథమిక విద్య 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి పల్లెలోనూ, మూడు కి.మీ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు, ఐదు కి.మీ పరిధిలో ఉన్నత పాఠశాలలు నడిచేవి.

ఊరి బడికి ఉరి
రాజుపాలెం మండలంలో ఏడుగురు మాత్రమే విద్యార్థులు ఉన్న ఎంపీపీ స్కూలు

జగన్‌ ప్రభుత్వంలో అశాస్త్రీయంగా 117 జీవో

వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో 450 పాఠశాలలు విలీనం

ప్రశ్నార్థకమైన ప్రాఽథమిక పాఠశాలల మనుగడ

విలీనం కారణంగా పేదల పిల్లలు చదువుకు దూరం

వైసీపీ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయం ఊరి బడికి ఉరిగా మారింది. అశాస్ర్తీయమైన 117 జీవో 450కి పైగా ప్రాథమిక పాఠశాలల ఉసురు తీసింది. ఈ జీవో వల్ల ప్రాఽథమిక విద్యకు నష్టమని అటు ఉపాధ్యాయులు, ఇటు మేధావులు ఆందోళనలు చేసినా వైసీపీ ప్రభుత్వం ఆలకించలేదు. ప్రాఽథమిక తరగతుల విద్యార్థులు బడికి దూరమవుతారన్న తల్లిదండ్రుల గోడును కూడా పట్టించుకోలేదు. విద్యావ్యవస్థను తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అయితే ఎన్నికల ప్రచారంలో 117 జీవో రద్దుకు ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ ఓటమిపాలవడం, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో జీవో 117 రద్దుతో పాటు విద్యావ్యవస్థలోని లోటుపాట్లను సరిచేస్తారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కడప(ఎడ్యుకేషన్‌), జూన్‌ 18: వైసీపీ ప్రభుత్వం కొలువుదీరక ముందు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాఽథమిక విద్య 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి పల్లెలోనూ, మూడు కి.మీ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు, ఐదు కి.మీ పరిధిలో ఉన్నత పాఠశాలలు నడిచేవి. ఇవి పల్లెల్లోని విద్యార్థులకు చదువులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. కానీ వైసీపీ ప్రభుత్వం విద్యాసంస్కరణల పేరుతో తెచ్చిన 117 జీవో ప్రాథమిక విద్యను నిట్టనిలువుగా చీల్చింది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కూడా సబ్జెక్టు నిపుణుల బోధన ఉండాలని, ఆంగ్ల విద్యను బలోపేతం చేయాలని విలీనవిధానాన్ని తీసుకువచ్చామంటూ.. ఒక కి.మీ పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాల్లో ప్రాథమిక విద్యకు చెందిన 3, 4, 5 తరగతులు విలీనం చేశారు. ఈ ప్రక్రియను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు, నిరసనలు చేసినా ఫలితం లేకండా పోయింది. జగన్‌ మొండిపట్టుతో గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

విలీనంతో దుష్పరిణామాలు

పాఠశాలల విలీనంతో ప్రాథమిక విద్యలో దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రాఽథమిక స్థాయి విద్యార్థులకు స్కూలు అసిస్టెంటు స్థాయి ఉపాధ్యాయులు బోధించడంలో విద్యాలక్ష్యాలు సాధించడంలో విఫలమయ్యారు. దీనికితోడు చిన్న పిల్లలు తమ ఊర్లో కాకుండా వేరే గ్రామాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో డ్రాపౌట్స్‌ శాతం కూడా గణనీయంగా పెరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలను విధిలేని స్థితిలో ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది.

బోధనలో తికమక

సంస్కరణలు అంటే ఉన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి వెళ్లాలి తప్ప తిరోగమనం చెందకూడదనే విష యాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్లయింది. సదరు ఉత్తర్వుల వల్ల ఉన్నత పాఠశాలలపై కూడా ప్రభావం చూపింది. ఉపాధ్యాయులపై తీవ్రమైన పనిభారం పెరగడం వల్ల ఉన్నత తరగతుల విద్యార్థులకు కూడా న్యాయం జరగలేదు. అంతేకాకుండా విద్యార్థుల నమోదు శాతం ఆధారంగా తీసుకుని 93 కంటే విద్యార్థులు తక్కువగా ఉంటే ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేశారు. అదే మాదిరిగా 137 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న విలీన ఉన్నత పాఠశాలల్లో సైతం వ్యాయామ, ప్రధానోపాధ్యాయ పోస్టులను రద్దు చేశారు. దీంతో సదరు పాఠశాలల్లో ఉన్నత విద్య నిర్వీర్యమైందని చెప్పాలి. పీజీ, బీఈడీ స్థాయి అర్హతలున్నా స్కూలు అసిస్టెంటు ఉపాధ్యాయులు 3, 4, 5 తరగతులకు బోధించడంలో తికమకకు గురి కావడం వల్ల విద్యా ప్రమాణాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయారు.

జీవో 117 రద్దు చేయాలి

జీవో 117 రద్దు చేసి ప్రాథమిక విద్యను కాపాడాలని, ఊరి బడుల్లోనే ప్రాఽథమిక విద్య పూర్తి చేసేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేసినా, తల్లిదండ్రులు సైతం రోడ్డుమీదకు వచ్చినా గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. జీవో 117ను రద్దు చేస్తామని ప్రాథమిక విద్యను కాపాడుతామని ఎన్డీయే నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో జీవో 117 రద్దు చేసి ప్రాథమిక విద్య ఐదో తరగతి వరకు ఒకేచోట ఉండేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. దీంతో డ్రాపవుట్స్‌ సంఖ్య తగ్గడంతో పాటు విద్యార్థి సొంత ఊరి నుంచే విద్యాభ్యాసం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఊరి బడికి విద్యార్థులు దూరం

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన 117 జీవోతో జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. మరికొంత మంది విద్యార్థులు డ్రాపవుట్స్‌గా మారారు. వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులకు కోత పడింది. లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన ప్రాఽథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూత వేయాల్సిన దుస్థితి. జీవో 117తో ఊరిబడికి ఉరి వేయవద్దని ఉపాధ్యాయ సంఘాలు నెత్తీ నోరు బాదుకున్నా జగన్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. జిల్లాలో 450కి పైగా ప్రాఽథమిక పాఠశాలలు విలీనం అయ్యాయి. సాధారణంగా 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులు పదేళ్లలోపే ఉంటారు. వీరంతా సుదూరంగా ఉండే ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పిల్లలను తల్లిందండ్రులు తమకు అందుబాటులో ఉండే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. 1, 2 తరగతులున్న ప్రాఽథమిక పాఠశాలలు విద్యార్థులను చేర్పించేవారు లేక అవి క్రమంగా నిర్వీర్యమయ్యే స్థాయికి వచ్చాయి. అలాగే ఉపాధ్యాయ పోస్టులు కూడా తగ్గాయి.

Updated Date - Jun 18 , 2024 | 11:40 PM