రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
ABN , Publish Date - Apr 01 , 2024 | 05:24 AM
తిరుమలలో మంగళవారం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఉగాది ఆస్థానం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్
తిరుమల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మంగళవారం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఉగాది ఆస్థానం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుండటంతో వీఐపీ బ్రేక్‌ను టీటీడీ రద్దు చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటికే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ పరిధిలో స్వయంగా వచ్చే వీఐపీలకు, ట్రస్టు దాతలకు మాత్రమే బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో వీటిని కూడా రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టుకు గడిచిన 15 రోజుల్లో రూ.22.75 కోట్ల విరాళాలు అందాయి. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేల విరాళం అందించి రూ.500 బ్రేక్ దర్శన టికెట్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది.