విశాఖ డెయిరీ చైర్మన్ ఆనంద్ బీజేపీలో చేరిక
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:58 AM
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి బీజేపీలో చేరారు.
ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్ రమాకుమారి
సహా తొమ్మిది మంది డెయిరీ డైరెక్టర్లు కూడా...
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి బీజేపీలో చేరారు. ఇరువురూ రాజమండ్రిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బుధవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు విశాఖ డెయిరీలో డైరెక్టర్లుగా కొనసాగుతున్న ఎస్‌వీవీ శంకరరావు, ఎస్.సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, దాడి పవన్‌కుమార్, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, రెడ్డి రామకృష్ణ, సుందరపు ఈశ్వర్, పరదేశి గంగాధర్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ విధానాలు నచ్చాయని, బీజేపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని భావించి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి పార్టీలో చేరానన్నారు. పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తానన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ, ‘పార్టీలో చేరిన తర్వాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ పార్టీ పురోభివృద్ధికి, బలోపేతానికి కృషి చేయాలి’ అని అన్నారు.
ఏపీలో బీజేపీకి 25 లక్షల సభ్యత్వాలు
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నిర్వహించిన బహిరంగ సభలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు సుమారు 10 వేల మందితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాల సంఖ్య సుమారు 25 లక్షలకు చేరుకుందని అన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, మారుమూల గ్రామంలో పెద్ద ఎత్తున చేరికలు ఆనందాన్ని కలిగించాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీ సూర్యనారాయణరాజు, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.