విశాఖ టు దుబాయ్
ABN , Publish Date - Aug 02 , 2024 | 04:21 AM
దుబాయ్ నుంచి విశాఖకు విమాన సర్వీసును పునరుద్ధరించాలని యూఏఈలోని ప్రవాసాంధ్ర ప్రముఖుడు, విశాఖ నివాసి యలమర్తి శరత్ విజ్ఞప్తి చేశారు.
విమానాలను పునరుద్ధరించండి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎన్‌ఆర్‌ఐ విజ్ఞప్తి
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయ్ నుంచి విశాఖకు విమాన సర్వీసును పునరుద్ధరించాలని యూఏఈలోని ప్రవాసాంధ్ర ప్రముఖుడు, విశాఖ నివాసి యలమర్తి శరత్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఆయన ఈమేరకు వినతిపత్రాన్ని అందించారు. ‘ఉత్తరాంధ్ర వాసులు భారీ సంఖ్యలో అరబ్ దేశాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. దుబాయి నుండి హైదరాబాద్ మీదుగా విశాఖకు గతంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ఉండేది. 2021 కరోనా సంక్షోభంలో దాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన మీరు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో విశాఖకు విమాన సర్వీసు పునరద్ధరణఫై ఆశలు చిగురించాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విశాఖకు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్నా ఎయిర్ ఇండియా మాత్రం వెనుకంజ వేస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని విమాన సర్వీసును పునరుద్ధరించాలి’ అని కేంద్ర మంత్రికి శరత్ విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు ప్రవాసీ ప్రముఖుడు తెలిపారు.