Share News

పోలింగ్‌ ఏజెంట్లుగా వలంటీర్లు!

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:36 AM

ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్‌ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ కాదని పక్కనబెట్టిన వలంటీర్లనే అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే

పోలింగ్‌ ఏజెంట్లుగా వలంటీర్లు!

వారు ఏజెంట్లుగానూ ఉండొద్దన్న ఈసీ

దీంతో రాజీనామా చేయించి మరీ బాధ్యతలు

ఎన్నికల్లో జగన్‌ తాజా తంత్రం?

పింఛన్ల పంపిణీలో విఫలం

వలంటీర్లు లేనందునే అందలేదని ప్రచారం

నిజాలు బయటపడడంతో గప్‌చుప్‌

తాజాగా మరో వంకర వ్యూహం

వైసీపీ మరో వక్రమార్గాన్ని అనుసరించబోతోందా? ఎన్నికల కమిషన్‌ కాదని పక్కనబెట్టిన వలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించిందా? అసలు వలంటీర్లు పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోడానికి కూడా వీల్లేదని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో వారిని మరెలా రంగంలోకి దించుతోంది?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్‌ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ కాదని పక్కనబెట్టిన వలంటీర్లనే అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామంటూ ఇన్నాళ్లూ వారి ద్వారానే లబ్ధిదారులను బెదిరించారు. ఇప్పుడు పోలింగ్‌ రోజున ఏకంగా పోలింగ్‌ కేంద్రాల్లోనే వారిని హెచ్చరించి ఓట్లు దండుకునే ఎత్తువేశారు. వలంటీర్లను వైసీపీ తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం.. అధికార పార్టీతో అంటకాగుతున్న వారిని తొలగిస్తుండడం.. మరోవైపు పలు సర్వేలన్నీ జగన్‌ మళ్లీ అధికారంలోకి రారని తేల్చేస్తుండడం.. తన బస్సుయాత్రకు పెద్దగా ప్రజాస్పందన లేకపోవడం వంటి పరిణామాలతో తాజా పథకం వేశారు. అయితే, వలంటీర్లుగా సేవలందిస్తూ వైసీపీ తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోడానికి నిబంధనలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో వారితో రాజీనామా చేయించి ఏజెంట్లుగా కూర్చోబెడితే అడిగేవారు ఉండరని ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి.. వలంటీర్లకు విధులను అప్పగించినప్పుడే పోలింగ్‌ ఏజెంట్లగా నియమించుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకే సంక్షేమ పథకాలన్నీ ఉద్యోగులు, అధికారుల ద్వారా కాకుండా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. సామాజిక పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డుల వంటి సేవలను వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా భారీ స్కెచ్‌ వేశారు. విద్యాదీవెన, విద్యా కానుక, రైతు భరోసా, వాహన మిత్ర, మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ, కాపు నేస్తం వంటి నగడు బదిలీ పథకాలన్నీ ఎవరెవరికి అందుతున్నాయో డేటా మొత్తం వలంటీర్ల చేతుల్లో పెట్టారు. ఈ పథకాలన్నీ జగనన్న పంపాడంటూ వారు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి 50 గడపలకు ఒక వలంటీర్‌ను నియమించారు. ఈ యాభై గడపల్లోని కుటుంబాల చరిత్రంతా వలంటీర్ల గుప్పిట్లో ఉండేలా భారీ వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతి నెలా పింఛన్లు ఇవ్వడం సహా.. గ్రామంలో ఏ పనికావాలన్నా వారిదే బాధ్యత. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను దాదాపు చెరిపివేశారు.

జనం భయం భయం..

వలంటీర్ల వ్యవస్థ ఎంతగా చొచ్చుకుపోయిందంటే.. తాము ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టినా వారికి తెలిసిపోతుందని జనం భయపడేదాకా వచ్చింది. ఇప్పుడు వారినే పోలింగ్‌ ఏజెంట్లుగా పెడితే వైసీపీకి ఓటేసేవారెవరో.. ప్రత్యర్థి పార్టీకి మీట నొక్కేదెవరో వలంటీర్‌ గుర్తించేస్తారని జగన్‌ భావించారు. వలంటీర్‌ కనుసైగను దాటి గ్రామంలో ఎవరూ మరో పార్టీకి ఓటేసే పరిస్థితే ఉండదనుకున్నారు. కానీ విపక్షాలు ఫిర్యాదు చేయడంతో వలంటీర్లపై ఈసీ కొరడా ఝళిపించింది. వారి ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీని అడ్డుకుంది. అయితే వలంటీరు వ్యవస్థ లేకపోతే.. పింఛనుదారులకు అవస్థలుంటాయని.. ఒకటో తేదీనే పెన్షన్‌ అందదన్న అపోహలను సృష్టించేందుకు జగన్‌ పెద్ద వ్యూ హాన్నే పన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదల చేయలేదు. పింఛన్లను ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని ఈసీ ఆదేశించినా.. జరుగనివ్వలేదు. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని ఆదేశాలిప్పించారు. ఖజానాలో నిధులు లేకపోవడంతో 4వ తేదీ వచ్చినా పింఛన్లు పంపిణీ చేయలేదు. దీంతో వృద్ధుల్లో ఆందోళన నెలకొంది. అనారోగ్యంగా ఉన్న వృద్ధులను మంచాలపై సచివాలయాలకు తరలిస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఇదంతా జగన్‌ ప్రభుత్వ దుర్మార్గంలో భాగమని ప్రజలకూ అర్థమైంది. దీంతో జగన్‌ రూటు మార్చారు. వారిని బెదిరించైనా ఓట్లు వేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. వలంటీర్లతో మాత్రమే అది సాధ్యమనుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే వారిని గుర్తించి అక్కడే భయపెట్టి ఓట్లు వేయించుకునేలా పథకం సిద్ధంచేశారు. వలంటీర్లతో రాజీనామా చేయించి.. బూత్‌ ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించారు. డేటా మొత్తం వారి చేతుల్లో ఉంటుంది కాబట్టి.. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లను బెదిరించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ కేడర్‌ కంటే సొంత సైన్యంపైనే నమ్మకం ఉంచారని అంటున్నాయి.

Updated Date - Apr 09 , 2024 | 04:36 AM