నీటి సంఘాల ఎన్నికలు వాయిదా..!
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:17 AM
రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తరువాత సాగునీటి సంఘాల ఎన్నికలకు టీడీపీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అక్టోబరు 21న కలెక్టరు నోటిఫికేషన జారీ
ఓటర్లు జాబితాను విడుత చేయని రెవిన్యూ అధికారులు
23న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినట్లే
అసెంబ్లీ సమావేశాలు తరువాత మళ్లీ నోటిఫికేషన ఇచ్చే అవకాశం
కర్నూలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తరువాత సాగునీటి సంఘాల ఎన్నికలకు టీడీపీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబరు 21న జిల్లా కలెక్టరు నోటిఫికేషన జారీ చేశారు. షెడ్యూలు ప్రకారం 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. పదవులపై ఆసక్తి ఉన్న నాయకులు రైతులను కలసి మద్దతు కూడగడుతున్నారు. మరో పక్క అధికార యంత్రాంగం ఎన్నికల సిబ్బంది నియామకం.. ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నం అయ్యారు. అయితే 13న ఓటర్ల జాబితా ప్రకటించకపోడం వల్లే ఎన్నికలు వాయిదా పడినట్లు తెలుస్తున్నది. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు లేకుండా ఎన్నికలు జరిగితే రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉండడంతో ప్రభుత్వం వాయిదా వేసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు తరువాత మళ్లీ నోటిఫికేషన జారీ చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 285 సంఘాలకు ఎన్నికలు జరాగాల్సి ఉంది.
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కేసీ కెనాల్, కేసీ కెనాల్, తుంగభద్ర దిగువ కాలువ, రాంపురం చానెల్, గాజులదిన్నె ప్రాజెక్టు, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టు, హెచ్చెల్సీ ఆలూరు బ్రాంచి కెనాల్, చిన్ననీటి పారుదల శాఖ పరిధిలో కర్నూలు జిల్లాలో 310, నంద్యాల జిల్లాలో 320 చెరువులు ఉన్నాయి. వీటితో వంద ఎకరాలు పైబడిన చెరువులు 145 వరకు ఉన్నాయని ఇంజనీర్లు తెలిపారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మేజర్ ప్రాజెక్టుల పరిధిలో 212 సాగునీటి సంఘాలు, మీడియం ప్రాజెక్టు పరిధిలో 26 సాగునీటి సంఘాలు, మైనర్ ఇరిగేషన (చిన్ననీటి పారుదల) పరిధిలో 146 సాగునీటి సంఘాలు ఉన్నాయి. సాగునీటి ఎన్నికలు తరువాత కేసీ కెనాల్, ఎల్లెల్సీ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ కాలువ పరిధిలో డిసి్ట్రబ్యూటర్ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత 2015-16లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది. 2019 మేలో కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వంలో వీటి ఎన్నికలు నిర్వహించలేదు. వైసీపీ నాయకులు, సానుభూతి పరులకే నామినేటెడ్ పదవులు పంపకాలు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల్లో రైతులను అందులో భాగస్వామ్యం చేయాలని, కాలువలు, డిస్ర్టిబ్యూటరీలను ఆఽధునికీకరించాలనే సంకల్పంతో ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
ఫ మూడు దశల్లో ఎన్నికలు:
----------
ఫ భారీ (మేజర్), మధ్యతరహా (మీడియం) ప్రాజెక్టుల పరిధిలో ఒక్కో సాగునీటి సంఘం పరిధిలో 100-120 మంది రైతులు, మైనర్ ఇరిగేషన (ఎంఐ) పరిధిలోని నీటి సంఘాల్లో దాదాపు 30-50 మంది రైతులు సభ్యులుగా ఉంటారని అధికారులు తెలిపారు. ఒక్కో సంఘంలో ఆరుగురు ప్రాదేశిక నియోజకవర్గం(టీసీ) సభ్యులు ఉంటారు.
ఫ తొలి దశ: సాగునీటి సంఘాలు (డబ్ల్యూయూఏ) పరిధిలో రెవిన్యూ గుర్తించిన ఓటు హక్కు కలిగిన రైతులు ఆరుగురు టీసీ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ ఈ నెల 23న జరగాల్సి ఉండింది. టీసీ సభ్యుల్లో ఇద్దరిని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు.
ఫ రెండవ దశ: డిసి్ట్రబ్యూటరీల పరిధిలో ఉండే సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు సమావేశమై డిసి్ట్రబ్యూటరీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.
ఫ మూడవ దశ: ఉమ్మడి జిల్లాలో కేసీ కెనాల్, ఎల్లెల్సీ, ఎస్సార్బీస్, తెలుగుంగ ప్రాజెక్టులు కమిటీలు ఉన్నాయి. డిసి్ట్రబ్యూటరీ కమిటీ అధ్యక్షులు సమావేశమై ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లను ఎన్నుకుంటారు. సాగునీటి వ్యవస్థలో డిసి్ట్రబ్యూటరీలు, ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష పదవులకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.
ఫ కాలువలు, డిసి్ట్రబ్యూటరీలు, ప్రాజెక్టుల పరిధిలో జరిగే మరమ్మతులు, ఆధునికీకరణ పనులు ఈ కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. సాగునీటి పంపిణీలో ముఖ్యమైన బాధ్యత వీరికే ఉంటుంది..
ఫ అటు అధికారులు.. ఇటు రాజకీయ నాయకులు:
సాగునీటి సంఘాలు టీసీ సభ్యుల ఎన్నిక మొదలు ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు పూర్తి చేసే వరకు 40 రోజులు పడుతుంది. అక్టోబరు 9న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపగా.. 21న కలెక్టరు పి. రంజితబాషా ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన జారీ చేశారు. సాగునీటి సంఘాల వారిగా డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీర్లను ప్రత్యేక అధికారులను నియమించారు. వీరి పర్యవేక్షణలోనే ఎన్నికలు నిర్వహించాలి. రెండు జిల్లాల్లో ఇంజనీరింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నీటి సంఘాల ఎన్నికలు బలం చేకూరుస్తాయని, పల్లెసీమల్లో జనం నాడి ఎటువైపు ఉందో తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో అధికర టీడీపీ కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అప్పుడే గ్రామాల్లో వేడి రాజుకుంది.
ఫ ఓటర్ల జాబితా తయారు కాకపోవడమే:
ఉమ్మడి జిల్లాలో ఆయా సాగునీటి వనరులు కింద దాదాపు 9.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2015-16లో భూయాజ్యమాన్యం హక్కు కలిగిన ఆయకట్టు రైతులను ఓటర్లుగా గుర్తించి ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత తొమ్మిదేళ్లు ఎన్నికలు జరపలేదు. ఈ మధ్యకాలంలో చాలామంది భూముల అమ్మకాలు చేయడంతో పాటు అన్నదమ్ములు విభాగాలు జరిగిన రెవిన్యూ రికార్డుల్లో భూయాజమాన్యం హక్కు కలిగిన రైతులు మారిపోయారు. దీంతో సాగునీటి కాలువ పరిధిలోని ఇంజనీర్లు, రెవిన్యూ అధికారులు (తహసీల్దారులు) సమన్వయంతో ఆయకట్టు రైతులను గుర్తించి ఓటర్ల జాబితాను తయారు చేయాలి. ఇందుకు జిల్లాస్థాయి ప్రత్యేక అధీకృత రెవిన్యూ అధికారులను నియమించారు. గెజిట్ నోటిఫికేషన ప్రకారం అయితే ఈ నెల 13వ తేదినాటికే ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండేది. అయితే.. ఓటర్ల జాబితాను ప్రకటించకపోవడం, ఈ నెల 11 నుంచి 22వ తేది వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో నీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత మళ్లీ నోటిషికేషన జారీ చేయవచ్చని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
ఫ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సంఘలు:
--------------------------------------------------------------
ప్రాజెక్టు నీటి సంఘాలు
-------------------------------------------------------------
కర్నూలు జిల్లా:
----------------------
కేసీ కెనాల్ 2
తుంగభద్ర ప్రాజెక్టు ఎల్లెల్సీ 58
ఆలూరు బ్రాంచి కెనాల్ 6
హంద్రీ నీవా కాలువ 3
గాజులదిన్నె ప్రాజెక్టు 12
రాంపురం ఛానల్ కెనాల్ 1
మైనర్ ఇరిగేషన చెరువులు 41
-------------------------------------------------------------
మొత్తం 123
----------------------------------------------------------
నంద్యాల జిల్లా:
----------------------
కేసీ కాలువ 52
శ్రీశైలం కుడి కాలువ (ఎస్సార్బీసీ) 50
తెలుగుగంగ కాలువ 47
శివభాష్యం ప్రాజెక్టు 7
మైనర్ ఇరిగేషన చెరువులు 104
మైలవరం ప్రాజెక్టు 1
---------------------------------------------------------
మొత్తం 261
----------------------------------------------------------