సవాళ్ల స్వాగతం

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:47 AM

ఏడేళ్ల విరామం అనంతరం కూటమి ప్రభుత్వం స్థిర నిర్ణయంతో ఎట్టకేల కు సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.

ఏకగ్రీవంగా సాగునీటి సంఘాల ఎన్నికలు

అన్నిచోట్లా కూటమి అనుకూలురే.. ఎక్కడా జాడలేని వైసీపీ

ఏడేళ్ల అనంతరం తిరిగి రైతు ప్రతినిధులకు బాధ్యతలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఏడేళ్ల విరామం అనంతరం కూటమి ప్రభుత్వం స్థిర నిర్ణయంతో ఎట్టకేల కు సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. అన్నింటి లోనూ తెలుగుదేశం అనుకూలురే ఆధిక్యత సాధించారు. సాగునీటి సంఘాలు, డిస్టిబ్యూటరీ కమిటీలు, ఆఖరుకి ప్రాజెక్టు కమిటీలు సైతం అన్నీ ఏకగ్రీవమే. తాజాగా సాగునీటి సంఘాలకు ఏకగ్రీవంగా గెలిచిన ప్రతి నిధులంతా సంబరాలు చేసుకుంటు న్నారు. కాని వీరి కళ్ళెదుటే అనేక సవాళ్లున్నాయి.

సాగునీటి సంఘాల ఎన్నికలు జిల్లా వ్యాప్తం గా ప్రశాంతంగా ముగిశాయి. గడిచిన 12 రోజుల వ్యవధిలోనే సాగునీటి సలహా సంఘా లు, డిస్టిబ్యూటరీ కమిటీలు, నేడు తాజాగా ప్రాజెక్టు కమిటీలకు ఎన్నిక ఏకగ్రీవంగానే ముగిసింది. ఎక్కడా ఎలాంటి వివాదాలకు తావులేకుండా పోయింది. కూటమిలో భాగ స్వామ్య పక్షాలు అనేకచోట్ల నీటి సంఘాల్లో పాతినిధ్యం దక్కించుకు న్నారు. టీడీపీ అత్య ధికంగా సంఘాల్లోను, మిగతా వాటిలోను ఆధిపత్యం ప్రదర్శించగా జనసేన, బీజేపీ ఎక్కడ వీలైతే అక్కడ సంఘాలను కైవసం చేసుకున్నా యి. రాజకీయ రహితంగా ఎన్నికలు జరిగినా వివిధ పార్టీల అనుకూలురే బరిలో నిలిచి గెలిచారు. జిల్లా వ్యాప్తంగా 356 సాగునీటి సంఘాలు ఉండగా వీటన్నింటిలోను ఎన్నిక సాఫీగా ఏకగ్రీవంగా జరిగింది. వరుసగా మూడుసార్లు వాయిదాపడి నాల్గవసారి ఎన్ని కలు జరిగి ఏకగ్రీవంగా ముగిశాయి. ఈ ఎన్నిక ల్లోను వైసీపీ అక్కడక్కడ అడ్డు తగులుతుందే మోనన్న ఊహాగానాలు సాగినా వైసీపీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుని ఉన్న పరిస్థితుల్లో తిరిగి ఈ ఎన్నికల్లో పరాభవం కొనితెచ్చుకోవడం ఎందు కని ఆ పార్టీ అనుకూలురు ఒక నిర్ణయానికి రావడంతో సాగునీటి ఎన్నికలకు దూరంగా మిగిలారు. ఎన్నికలకు ముందే ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలన్న సందిగ్ధత టీడీపీతో పాటు జనసేన, బీజేపీ అనుకూలురుకు ఉంది. అయినా ఎక్కడా తడబడకుండా.. విభేదించ కుండా కూటమి నేతలంతా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తున్న పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లోను, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరులోను ఎక్కడా ఎలాంటి అవాంతరం లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరుకి నీటి సంఘాలే కాదు 14 డిస్టిబ్యూటరీ కమిటీ ల్లోను టీడీపీ అనుకూలురే పూర్తి ఏకగ్రీవ ఆధి క్యత సాధించారు. శనివారం జరిగిన ప్రాజెక్టు కమిటీ ఎన్నికల్లోను టీడీపీ అనుకూలురు ఎన్నికయ్యారు. తమ్మిలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా యర్రా రమేష్‌, ఉపాధ్యక్షుడిగా గూండా వెంకన్న, ఎర్రకాల్వ ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షుడిగా అంజనాగ వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా వాడపల్లి రాధాకృష్ణ ఎన్నికయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు సూచించిన వారంతా ఆయా స్థానాల్లో కుదుటపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జరిగిన తొలి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో కూటమి ఆసాంతం పైచేయి సాధించగా వైసీపీ ఎక్కడా అడ్రస్సు లేకుండా పోవడం గమనార్హం.

ఇక సవాళ్ల ఎదురీత

ఎన్నికల్లో సాగునీటి సంఘాల దగ్గర నుంచి ప్రాజెక్టు కమిటీ వరకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసినా ఆయా స్థానాల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులందరికీ కళ్ళెదుట ఎన్నో సవాళ్ళు.. ఎదురీత కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం సాగునీటి కాల్వల నిర్వహణను నిర్లక్ష్యం చేసింది. ఏటా సాగాల్సిన ఆధునికీకరణ పనులను పైసా విదల్చలేదు. ఆఖరుకి కాల్వల్లో కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించడానికి నిధులు కేటాయించలేకపోయారు. కాల్వల్లో లాకుల గేట్లకు కనీస మరమ్మతులు చేసేందుకు కార్యాచరణ లేకుండా పోయింది. పూడిక తీసి చాలాకాలమైంది. దీంతో నీటి ప్రవాహ లభ్యత, వేగం రెండూ దెబ్బతిన్నాయి. ప్రధాన కాల్వలతో పాటు పిల్ల కాల్వల నిర్వహణ ఏనాడో మరిచారు. వీటన్నింటికీ మరమ్మతులు నిర్వహిస్తేనే సాగునీరు సక్రమంగా సాగడంతో పాటు రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. లాకుల గేట్లకు ఇంతకుముందు ప్రతీ రెండేళ్లకో సారి నిర్వహణ ఎలా ఉందో గమనించే వారు. గత ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వంలో అసలు నిర్వహణ అనే పదం లేకుండా చేయడంతో లాకుల గేట్లు అనేకచోట్ల మరింత దెబ్బతిన్నా యి. గేట్లను ఎత్తిందుకు, దించేందుకు అనువైన పరిస్థితులులేవు. కాల్వలు నిండా చెత్తాచెదారం తో నిండే ఉన్నాయి. గుర్రపుడెక్క కమ్మేయడంతో నీటి ప్రవాహ వేగానికి బ్రేక్‌ పడింది. ఫలితంగా శివారు ప్రాంతాలకు నీరందడం కష్టసాధ్యంగా మారింది. కృష్ణకాల్వ నిర్వహణ పనులను రెండేళ్ల క్రితం తూతూ మంత్రంగా చేపట్టారు. కాని ఇప్పుడు ఆ కాల్వ అత్యంత దారుణంగా మారింది. ఏలూరులో ఉన్న తూర్పు, పడమర లాకులు నిర్వహణ లోను అనేక సమస్యలున్నా యి. ఇలా ఒకదాని వెంట ఒకటి వైసీపీ పుణ్య మా అంటూ రెండిం తలయ్యాయి. ఇప్పుడు వీటికి నిర్వహణ చేయాలన్నా, మరమ్మతులు చేపట్టాలన్నా కోట్ల రూపాయల వ్యయం కాబోతుంది. ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టు ల్లోను ఇదే తరహా నిర్లక్ష్యం. జపాన్‌ బ్యాంకు నుంచి నిధులు ఇచ్చినా తమ్మిలేరుకు వైసీపీ హయాంలో మోక్షం లేకుండా పోయింది. ఎర్రకాల్వ ఆధునికీకరణ ఎప్పుడో మూలన పడింది. జల్లేరు గేట్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఎల్‌ఎన్‌డీ పేట రిజర్వాయరు పూడికమయమైంది. ఈ సమస్యలన్నీ అధిగ మించాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన డిస్టిబ్యూ టరీ, ప్రాజెక్టు కమిటీలు భుజాన వేసుకోవాలి. ఇది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నింటికీ సంతృప్తికర నిధులు ఇవ్వాల్సి ఉంది. ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. ఎన్నిక ఏకగ్రీవమే అయినప్పటికీ సాగునీరు దగ్గర నుంచి ప్రాజెక్టు కమిటీల ముందున్న ప్రధాన సవాళ్ళివి.

ఎర్రకాల్వ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా రమణ

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెం మండలం శ్రీకరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా మండలంలోని లక్కవరానికి చెందిన వందనపు అంజ నాగ వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌గా కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన వాడపల్లి రాధాకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో శనివారం నూజివీడు హౌసింగ్‌ ఈఈ పూలచంద్రశేఖర్‌ ఎన్నికల అధికారిగా ఎన్నికలు నిర్వహించారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కూటమి నాయకులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ లను పూలమాలలతో సత్కరించారు.

తమ్మిలేరు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడిగా రమేశ్‌

చాట్రాయి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తమ్మిలేరు ప్రాజెక్టు కమిటీ ఎన్నిక కూటమికి ఏకగ్రీవం అయ్యింది. అధ్యక్షుడిగా యర్రా రమేశ్‌ (పోలవరం), ఉపాధ్యక్షుడిగా గుండా వెంకన్న(యర్రంపల్లి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి, నూజివీడు డీఎల్పీవో సుందరి ప్రకటించారు. చాట్రాయి మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎన్నిక నిర్వహించగా, తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులు గుండా వెంకన్న, చెలికాని కృష్ణారావు, తక్కెళ్ళపాటి వెంకటేశ్వరరావు, జగ్గవరపు భక్తవత్సలరెడ్డి, యర్రా రమేశ్‌, వెల్ది అప్పారావు హాజరుకాగా ఎన్నికల అధికారి ఎన్నికల ప్రక్రియ నిర్వహించి గెలుపొందిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా అధ్యక్ష, ఉపాధ్యక్షులు రమేశ్‌, వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ తమ్మిలేరు ప్రాజెక్టుకు అధికారికంగా 12,500 ఎకరాలు ఆయకట్టు ఉందని, సరైన నీటి యాజమాన్య విధానాలు అనుసరించి శివారు భూములకు సాగునీరు అందించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. జైకా నిధులు రూ.16 కోట్లతో జరుగుతున్న తమ్మిలేరు మరమ్మతు పనులను నాణ్యతతో జరిగేలా చూస్తామన్నారు. ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులను, నీటి సంఘాల అధ్యక్షులను టీడీపీ నాయకులు సన్మానించారు. ఎంపీడీవో విజయలక్ష్మి, ఏఈఈ పరమానందం తదితరులు పాల్గొన్నారు.

Updated at - Dec 22 , 2024 | 12:47 AM