Share News

మావాళ్లూ రెడ్‌ బుక్స్‌ రాస్తున్నారు

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:41 AM

తానొద్దని చెబుతున్నా అన్యాయం చేసేవారి పేర్లను, అధికారుల జాబితాను తన పార్టీ నేతలు రెడ్‌బుక్స్‌లో రాసుకుంటున్నారని..

మావాళ్లూ రెడ్‌ బుక్స్‌ రాస్తున్నారు

నేను గుడ్‌బుక్‌ రాస్తున్నా: జగన్‌

మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా లావణ్య స్థానంలో వేమారెడ్డి

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తానొద్దని చెబుతున్నా అన్యాయం చేసేవారి పేర్లను, అధికారుల జాబితాను తన పార్టీ నేతలు రెడ్‌బుక్స్‌లో రాసుకుంటున్నారని.. తాను మాత్రం వైసీపీ కోసం కష్టపడేవారి పేర్లతో గుడ్‌బుక్‌ రాసుకుంటున్నానని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. బుధవారమిక్కడ తాడేపల్లి ప్యాలె్‌సలో మంగళగిరి నియోజకవర్గ పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. గుడ్‌బుక్‌లో రాసుకున్నవారందరికీ భవిష్యత్‌లో అవకాశాలూ, ప్రమోషన్లు ఉంటాయని చెప్పారు. తనను 16 నెలలు జైలులో పెట్టి తీవ్రంగా వేధించారని తెలిపారు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందడుగు వేశామని, కష్టాలు ఎక్కువ కాలం ఉండవని తెలిపారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తే త్వరలోనే అధికారంలోకి వస్తామని చెప్పారు. కష్టాల నుంచే నాయకులు పుడతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన తిరోగమనంలో ఉందని ఆరోపించారు. దిశ యాప్‌ ద్వారా వైసీపీ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు భద్రత కల్పించామని, సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు గడపగడపకూ అందించామని, ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు.

మంగళగిరిలో బీసీ కార్డు పోయింది..

2014, 19 ఎన్నికల్లో మంగళగిరి టికెట్‌ను ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన జగన్‌.. 2024లో మాత్రం చేనేత సామాజికవర్గానికి చెందినదంటూ బీసీ కార్డు ప్రయోగించారు. తొలుత గంజి చిరంజీవికి టికెట్‌ ఇచ్చి తర్వాత మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించారు. చేనేత కుటుంబాలు అత్యధికంగా ఉన్నచోట టీడీపీ అభ్యర్థిగా లోకేశ్‌ ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. కానీ మంగళగిరిలో లోకేశ్‌ రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీతో గెలిచారు. కూటమి ప్రభుత్వమూ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్‌ బీసీ కార్డును పక్కనపడేశారు. లావణ్య స్థానంలో వేమారెడ్డిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు జగన్‌ పార్టీ నేతల సమక్షంలో ప్రకటించారు.

పేపర్‌ బ్యాలెట్‌తోనే ఓటర్లలో విశ్వాసం

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురుకాగానే.. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేసిన వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ పేపర్‌ బ్యాలెట్లకు మళ్లాలని సూచించారు. పేపర్‌ బ్యాలెట్‌తోనే ఓటర్లలో విశ్వాసం కలుగుతుందని బుధవారం ‘ఎక్స్‌’ లో పేర్కొన్నారు. హరియాణా ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలకు భిన్నంగా లేవన్నారు. ఏపీ ఫలితాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉ న్నాయని ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఈవీఎంలలో ఏదో మతలబు ఉ ందని ఆరోపణలు వచ్చినప్పుడు దానిని ఖండించిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Updated Date - Oct 10 , 2024 | 03:41 AM