మాకు 2030 వరకు గడువు ఉంది
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:27 AM
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) పరిధిలోని కొరిటెపాడు కూరగాయల మార్కెట్‌లో షాపులు ఖాళీ చేయాలంటూ గతనెల 26న జీఎంసీ అధికారులు జారీచేసిన ఉత్తర్వులను చిరు వ్యాపారులు హైకోర్టులో సవాల్ చేశారు.
మార్కెట్‌లో షాపులు కొనసాగించేలా ఆదేశాలివ్వండి
జీఎంసీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టుకు వ్యాపారులు
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) పరిధిలోని కొరిటెపాడు కూరగాయల మార్కెట్‌లో షాపులు ఖాళీ చేయాలంటూ గతనెల 26న జీఎంసీ అధికారులు జారీచేసిన ఉత్తర్వులను చిరు వ్యాపారులు హైకోర్టులో సవాల్ చేశారు. తమ లీజు గడువు 2030 వరకూ ఉందని, అప్పటివరకూ షాపులు కొనసాగేలా ఉత్తుర్వులివ్వాలని కోరారు. ఈ మేరకు పలువురు చిరువ్యాపారులు, చేతివృత్తుల సంఘం అధ్యక్షుడు బీఎ్‌సఆర్ కృష్ణారెడ్డి, మరికొందరు కూరగాయల వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కార్పొరేషన్ అధికారులిచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి లీజుకిచ్చిన షాపుల్లో తమను కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ‘కార్పొరేషన్ తమకు లీజు పద్ధతిలో షాపులు కేటాయించింది. ప్రతీ షాపునకు నెలకు రూ.2,350 చెల్లించేలా.. 2004-05లో జీఎంసీ అధికారులతో ఒప్పందం కుదిరింది. లీజు గడువు 25 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో షాపులు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. 2004-05లో ఒప్పందం కుదిరినందున 2030 వరకు మాకు గడువు ఉంది. షాపులను ఖాళీచేస్తే మేం జీవనాధారం కోల్పోతాం. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తగిన ఉత్తర్వులు ఇవ్వండి’ అని పిటిషన్‌లో వారు అభ్యర్థించారు. కాగా, ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.