Share News

ఎన్నికల్లో, పాదయాత్రలో ఇచ్చిన.. ప్రతి హామీ అమలు చేస్తాం

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:36 AM

యువగళం పాదయాత్రలో తాను, ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు.

ఎన్నికల్లో, పాదయాత్రలో ఇచ్చిన.. ప్రతి హామీ అమలు చేస్తాం

జగన్‌రెడ్డివి ఫేక్‌ ప్రచారాలు: లోకేశ్‌

పాదయాత్ర తొలి హామీ అమలు కార్యక్రమంలో విద్యామంత్రి ధ్వజం

బంగారుపాళ్యంలో డయాలసిస్‌ కేంద్రానికి శ్రీకారం

బంగారుపాళ్యం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్రలో తాను, ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. 30పడకల ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభించి, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం అదే మండలంలోని ఎన్‌.కోటూరులో ప్రజావేదిక కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్థులతో ముచ్చటించారు. ఆయా సందర్భాల్లో మాట్లాడారు. ‘మెగా డీఎస్సీ, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి హామీలు అమలు చేయకుండా జగన్‌ మాట తప్పారు. మేం పద్ధతి ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం. పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచడానికి జగన్‌రెడ్డికి ఐదేళ్లు పడితే.. చంద్రబాబు ఒక్క సంతకంతో రూ.4 వేలకు పెంచేశారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఇప్పటికే పలు పరిశ్రమలు తెచ్చారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచారు. గతంలో తిరుమలలో పింక్‌ డైమండ్‌ మాయమైందంటూ మాపై దుష్ప్రచారం చేశారు. తిరుమల లడ్డూలో నాణ్యత లేకుండా చేస్తే.. చంద్రబాబు వచ్చిన వెంటనే టీటీడీ ప్రక్షాళన మొదలుపెట్టారు. దేవుడితో పెట్టుకున్నారు కాబట్టే 11 సీట్లకు పరిమితమయ్యారు’ అన్నారు. పాదయాత్ర సమయంలో ఇదే బంగారుపాళ్యంలో జగన్‌ ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో అంతా చూశారని, జీవో 1తో ప్రచార రథాన్ని అడ్డుకున్నారని గుర్తు చేశారు. లోకేశ్‌ వెంట చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, పులివర్తి నాని, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, గురజాల జగన్మోహన్‌, గాలి భానుప్రకాశ్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కిలారు రాజేశ్‌, బీవీ రాముడు ఉన్నారు.

ఉపాధ్యాయుల్ని గౌరవించడమంటే ఇదీ!

బంగారుపాళ్యంలో పర్యటన ముగించుకుని వెనుదిరిగిన లోకేశ్‌ మార్గమధ్యంలో పూతలపట్టు మండలంలోని ఆకనంబట్టు జడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. లోటుపాట్ల గురించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రధానోపాధ్యయురాలితో చర్చించారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన ఆమె సీటులో కూర్చునే అవకాశమున్నా.. ఉపాధ్యాయులను గౌరవించడం ఎలాగో ఆయన చూపించారని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

Updated Date - Sep 21 , 2024 | 04:36 AM