Share News

కేఎంసీని కాపాడుకుంటాం

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:17 AM

‘కర్నూలు మెడికల్‌ కళాశాల మాది.. ఈ కాలేజీని కాపాడుకోవడం మా హక్కు. ప్రాణాలైనా అర్పించి కేఎంసీ స్థలాన్ని కాపాడుకుంటాం..’ అంటూ జూనియర్‌ డాక్టర్లు గర్జించారు.

కేఎంసీని కాపాడుకుంటాం
ర్యాలీ చేస్తున్న వైద్య విద్యార్థులు

రోడ్డెక్కిన జూనియర్‌ డాక్టర్లు

సంఘీభావం ప్రకటించిన ఏపీజీడీఏ

కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘కర్నూలు మెడికల్‌ కళాశాల మాది.. ఈ కాలేజీని కాపాడుకోవడం మా హక్కు. ప్రాణాలైనా అర్పించి కేఎంసీ స్థలాన్ని కాపాడుకుంటాం..’ అంటూ జూనియర్‌ డాక్టర్లు గర్జించారు. కర్నూలు మెడికల్‌ కాలేజీకి సంబంధించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ)ల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు బుధవారం కాలేజీ ప్రవేశ ద్వారం ఎదుట నిరసనకు దిగారు. అనంతరం కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు 600 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్బంగా ఏపీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్‌ బ్రహ్మాజీ మాస్టర్‌, కోశాధికారి డాక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో తొలగిస్తున్న 8 షాపులకు కాలేజీలో స్థలాన్ని కేటాయించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. కళాశాల ఎదుట ఉన్న షాపులకు రైతుబజారులో స్థలాన్ని కేటాయించారనీ, అక్కడికి వెళ్లకుండా కేంఎసీ స్థలాన్ని అడగడం.. అందుకు మున్సిపల్‌ అధికారులు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జగదీష్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సాయికుమార్‌ మాట్లాడుతూ మెడికల్‌ కాలేజీలో ఆక్రమణలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణాలైన అర్పించి కాలేజీని కాపాడుకుంటామన్నారు. కాలేజీ, గ్రౌండ్స్‌ మాసొత్తు అని వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, నర్సులను కలుపుకుని తాము మరింత ఉద్యమిస్తామన్నారు. కాలేజీ ముందు అనధికారికంగా షాపులు ఉన్నాయనీ, రోడ్డు విస్తరణలో వాటిని తొలగించి మరో చోట స్థలాలు ఇవ్వాలే కానీ, విద్యాసంస్థలకు చెందిన స్థలాలను ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కళాశాల స్థలాన్ని పరులపాలు కాకుండా కాపాడుకుంటామన్నారు. అనంతరం జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన నాయకులు జగదీష్‌, సాయికుమార్‌, ఆదివిష్ణు, కుమార రాజా తదితరులు డీఆర్వో, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌ పి.రంజితబాషా మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Nov 29 , 2024 | 12:17 AM