బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి సవిత
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:09 AM
చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు.
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు. బుధవారం ఆమె విజయవాడలోని గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణుల అవస్థలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 2014-19 నాటి పథకాలను మరోసారి అమలు చేసేలా కృషి చేస్తామన్నారు. పాత పథకాలతో కొత్త పథకాలను కూడా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అర్చకుల గౌరవ వేతనం రూ.7 వేలకు, ధూప దీపాల కోసం రూ.3 వేలకు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేశారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో ఉన్న భూములను, ఆస్తులను పరిరక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
బీసీల అభ్యున్నతే లక్ష్యం
ఏపీ సచివాలయ బీసీ ఉద్యోగుల వె ల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అమరావతి సచివాలయంలో జ్యోతిబా, సావిత్రిబాయి పూలే ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉమ్మడి జిల్లాల్లో బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెన్త్, ఇంటర్‌లో విశేష ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ప్రతిభా పురస్కారాలను మంత్రి అందజేశారు.