Share News

ఏంటి మీరు చేసింది?

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:41 AM

విద్యార్థిలోకం తిరగబడింది. వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై గట్టిగా నిలదీసింది.

ఏంటి మీరు చేసింది?

జగన్‌ పాలనలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?

ఐదేళ్లలో ఒక్కసారీ జాబ్‌ కేలెండర్‌ ఇవ్వలేదేం?

ధర్మవరంలో తిరగబడిన విద్యార్థిలోకం

వరుస ప్రశ్నలతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉక్కిరిబిక్కిరి

ఎమ్మెల్యే సమక్షంలోనే ప్రభుత్వంపై విమర్శలు

దాంతో దిక్కుతోచక విద్యార్థినులను

బయటకు పంపేసిన ఎమ్మెల్యే అనుచరులు

సీఎం జగన్‌, ఎమ్మెల్యే ప్లకార్డులు చింపివేత

ధర్మవరం, ఫిబ్రవరి 12: విద్యార్థిలోకం తిరగబడింది. వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై గట్టిగా నిలదీసింది. విద్యార్థినులు వరుస ప్రశ్నలు సంధించడంతో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉక్కిరిబిక్కిరయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని మారుతీ రాఘవేంద్రస్వామి కల్యాణ మండపంలో సోమవారం ‘విద్యార్థుల ప్రగతి మన జగనన్నతోనే సాధ్యం’ పేరుతో సదస్సు నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థినులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి హాజరైన సదస్సు ప్రారంభం కాగానే విద్యార్థినులు ఒక్కొక్కరుగా ప్రసంగించడం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. ‘విద్యార్థులకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నారే తప్ప.. మీరు చేసిందేముంది? నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఏటా జాబ్‌ కేలెండర్‌ ఇస్తామన్నారు.. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా ఒక్కసారైనా ఇచ్చారా?’ అని నిలదీశారు. తోటి విద్యార్థినులు సైతం చప్పట్లతో మద్దతు పలకడంతో వైసీపీ నాయకుల మొహాలు తెల్లబోయాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు.. విద్యార్థినుల ప్రసంగాలను నిలుపుదల చేయించి, వారిని బయటకు పంపించేశారు. దీంతో ఆగ్రహించిన కొందరు విద్యార్థినులు అక్కడే ప్లకార్డులు చింపివేశారు. మరికొందరు చేతిలో ఉన్న ప్లకార్డులను విసిరికొట్టి, అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో సదస్సును అర్ధంతరంగా ముగించారు. చదువుకోవడానికి కళాశాలలకు వెళ్లిన తమ పిల్లలను సదస్సుకు తీసుకెళ్లడమేంటని తల్లిదండ్రులు మండిపడ్డారు. పిల్లలను ఎర్రటి ఎండలో తిప్పుతూ ఇబ్బంది పెడతారా అంటూ కళాశాలల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 02:41 AM