కళాశాలల్లో ఇదేం సంస్కృతి?!
ABN , Publish Date - Sep 29 , 2024 | 06:11 AM
విద్యార్థినుల దుస్తులపై వెకిలి జోకులు... గంజాయి కోసం ఆరాలు... మరింత కిక్ ఇచ్చే డ్రగ్స్ ఏమిటంటూ చర్చలు... యువత భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కాలేజీల్లో సాగుతున్న ఆందోళనకరమైన ట్రెండ్ ఇదీ... కళాశాలల్లో చక్కటి నైపుణ్యాలు సొంతం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన
విద్యార్థినులపై అసభ్య కామెంట్లు
గంజాయి, డ్రగ్స్‌పైనే ఎక్కువ చర్చ
కాలేజీల్లో చేయిదాటుతున్న పరిస్థితి
ప్రైవేటు వర్సిటీల్లోనూ పెడపోకడలు
అడ్డుకట్ట వేయకపోతేప్రమాదమే
గ్రీవెన్స్ కమిటీలపై పర్యవేక్షణ నిల్
ఫిర్యాదులు పట్టని యాజమాన్యాలు
ఏఐసీటీఈ, యూజీసీ నిబంధనలు గాలికి
ర్యాగింగ్‌ను మించి వికృత చేష్టలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
విద్యార్థినుల దుస్తులపై వెకిలి జోకులు... గంజాయి కోసం ఆరాలు... మరింత కిక్ ఇచ్చే డ్రగ్స్ ఏమిటంటూ చర్చలు... యువత భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కాలేజీల్లో సాగుతున్న ఆందోళనకరమైన ట్రెండ్ ఇదీ... కళాశాలల్లో చక్కటి నైపుణ్యాలు సొంతం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు పెడదారి పడుతున్నారు. పుస్తకాలు, పరీక్షలు, మార్కుల గురించి కాకుండా గంజాయి, డ్రగ్స్‌పై చర్చిస్తున్నారు. కొందరు విద్యార్థులు వాటి మాయలో చిక్కి మత్తులో చిత్తవుతున్నారు. రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇదే వ్యవహారం నడుస్తోంది. పెద్దగా పేరులేని కాలేజీల నుంచి ప్రముఖ విద్యాసంస్థల వరకూ, కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ ఈ పోకడ నానాటికీ పెరుగుతోంది. ఒకప్పటి ర్యాగింగ్ సంస్కృతి ఇప్పుడు వికృత ధోరణిగా రూపుదాల్చింది. కాలేజీల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీ, మహిళా గ్రీవెన్స్ కమిటీలు నామమాత్రంగా మారాయి. కేవలం ఉన్నాయని చూపించుకోవడానికి మినహా అవి ఎందుకూ ఉపయోగపడటం లేదు. అసలు ఫిర్యాదులు కాలేజీని దాటి యూనివర్సిటీ స్థాయికి చేరకుండా కొన్ని యాజమాన్యాలు తొక్కిపెడుతున్నాయి. కళాశాల స్థాయిలోనే పరిష్కారమైనట్లు చూపిస్తున్నా, ఎక్కడా ఫిర్యాదులను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బయటపడిన రహస్య కెమెరాల వ్యవహారంతో కాలేజీల్లో ఆకృత్యాల వ్యవహారం చర్చనీయాంశమైంది.
ఇవీ నిబంధనలు
కాలేజీల్లో కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఏఐసీటీఈ, యూజీసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ కమిటీ, మహిళలపై వేధింపుల నిరోధక కమిటీ కచ్చితంగా ఉండాలి. భౌతికంగా విద్యార్థులను వేధించినా, ఇబ్బందికరమైన కామెంట్లు చేసినా, కాలేజీల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించినా, ఎవరిపై అయినా దుష్రచారం చేసినా ఈ కమిటీలకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులతో కూడిన ఈ కమిటీల్లో కనీసం ఐదుగురు సభ్యులు ఉంటారు. అందులో కనీసం ముగ్గురు మహిళలు ఉండాలి. తొలుత కాలేజీ స్థాయిలో ఫిర్యాదులపై విచారణ చేస్తారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే, సంబంధిత యూనివర్సిటీ కమిటీకి పంపుతారు. అక్కడ రిటైర్డ్ జడ్జి స్థాయిలో విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తారు.
కాలేజీల్లో జరుగుతున్నది ఇదీ..
ఏఐసీటీఈ నిబంధనలను కాలేజీ యాజమాన్యాలు నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యార్థినులపై వేధింపులు, విద్యార్థులపై ర్యాగింగ్ చేసినా బాధితులు ఫిర్యాదు చేయడానికే భయపడుతున్నారు. కాలేజీల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో యాజమాన్యాలు ఈ కమిటీలను నామమాత్రం చేశాయి. తమ కాలేజీలో ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు లేవని చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. అడ్మిషన్లు పెంచుకోవాలని, బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి. దీంతో ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదనే భావనతో ఎవరూ ఆ దిశగా ప్రయత్నం కూడా చేయడం లేదు.
అది విజయవాడ నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ. కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొంది అందులో చేరిన ఒక విద్యార్థినికి రెండు రోజులకే చేదు అనుభవం ఎదురైంది. కొందరు విద్యార్థులు ఆ అమ్మాయిని భౌతికంగా తాకే ప్రయత్నం చేశారు. ఆమెను తరగతి వాట్సాప్ గ్రూపులో చేర్చి అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఇవన్నీ చూసి భయాందోళన చెందిన ఆ విద్యార్థిని దీనిపై అధ్యాపకులకు ఫిర్యాదు చేసింది. అయితే ‘‘కాలేజీల్లో ఇవన్నీ రొటీన్... పట్టించుకోకూడదు...’’ అని యాజమాన్యం నుంచి సమాధానం రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆ కాలేజీ నుంచి టీసీ తీసుకొని బయటపడ్డారు.
కూటమి ప్రభుత్వంపై బాధ్యత
విద్యా రంగంలో ప్రమాణాలు పెంచడంతో పాటు కాలేజీల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. గత ప్రభుత్వంలో అటు చదువులు, ఇటు ఫిర్యాదులు రెండింటినీ పట్టించుకోకపోవడం వల్ల విచ్చలవిడితనం పెరిగింది. అందువల్లే పేరున్న కాలేజీల్లో కూడా పిల్లలను చేర్పించాలంటే తల్లిండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. రోజూ కాలేజీకి వెళ్లొచ్చే వారికంటే హాస్టళ్లలో ఉండేవారు తొందరగా తప్పుదారి పడుతున్నారు. జూనియర్ కాలేజీలతో పోలిస్తే ఎక్కువ స్వేచ్ఛ ఉండటం, తల్లిదండ్రులు దూరంగా ఉండటం, కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యాసంస్థల్లో వికృత పోకడ పెరుగుతోంది. దీనిపై ఇప్పుడే కఠినంగా వ్యవరించకపోతే విద్యార్థుల చదువులతో పాటు, రాష్ట్ర ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
వైసీపీ సర్కారు పుణ్యమే
ఉన్నత విద్యాసంస్థల్లో వికృత చేష్టలు ఇప్పుడే కొత్త కాకపోయినా కొంతకాలంగా ఈ ధోరణి పెరగడానికి గంజాయి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి గ్రామస్థాయికీ చేరిపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో దీని వినియోగం బాగా పెరిగింది. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ గంజాయి ఎక్కడ దొరుకుతుందని విద్యార్థులు ఆరా తీస్తున్నారు. గంజాయి వినియోగించి తోటి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు శృతిమించిన కామెంట్లు చేస్తున్నారు. కాలేజీలకు గంజాయి, డ్రగ్స్ చేరకుండా నియంత్రిస్తే, ఇతర వేధింపులు కూడా ఆగే అవకాశం ఉంది.