Share News

డీఎస్పీ చైతన్యను ఎవరు రప్పించారు?

ABN , Publish Date - May 23 , 2024 | 03:34 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలను అదుపు చేసే పేరిట అన్నమయ్య జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్యను ఎవరు రప్పించారనే కోణంలో ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాడిపత్రిలో విచారణ చేపట్టింది.

డీఎస్పీ చైతన్యను ఎవరు రప్పించారు?

పోలీసు అధికారులను ప్రశ్నించిన సిట్‌

ఎంత అడిగినా జవాబివ్వని వైనం

తాడిపత్రి టౌన్‌, మే 22: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలను అదుపు చేసే పేరిట అన్నమయ్య జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్యను ఎవరు రప్పించారనే కోణంలో ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాడిపత్రిలో విచారణ చేపట్టింది. సిట్‌ సభ్యులు శ్రీనివాస్‌, భూషణం, శ్రీనివాసులు ఈ విషయమై జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నా.. స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని తెలిసింది. బుధవారం కూడా కొందరు అధికారులను వారు విచారించారు. తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులతో అంటకాగిన డీఎస్పీ చైతన్యను ఎన్నికల అల్లర్ల సమయంలో ఎందుకు రమ్మన్నారని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట తాడిపత్రికి ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వచ్చిన డీఎస్పీ చైతన్య.. మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌తోపాటు టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. తాడిపత్రి గొడవలకు బాధ్యులను చేస్తూ ఎస్పీ అమిత్‌ బర్దార్‌, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి టౌన్‌ సీఐ మురళీకృష్ణను ఈసీ సస్పెండ్‌ చేసింది. కానీ డీఎస్పీ చైతన్యపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. రాజకీయ ప్రోద్బలంతోనే ఆయన్ను తాడిపత్రికి రప్పించారని ప్రచారం జరుగుతోంది. ఆయన వచ్చీరావడంతోనే టీడీపీ వాళ్లను టార్గెట్‌ చేశారని, ఆయన వెళ్లిపోయాకే పరిస్థితి అదుపులోకొచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌, ఆ మరుసటి రోజు జరిగిన గొడవలకు సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వడంలో విఫలమైనందుకు ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ ఈశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆ రెండ్రోజులూ అక్కడి పరిస్థితులను అధికారులకు ఈశ్వర్‌రెడ్డి ఎప్పటికప్పుడు చేరవేశారని, ఎవరో నిర్లక్ష్యానికి మరెవరినో బలిపశువును చేశారని పోలీసు శాఖ నుంచే విమర్శలు వస్తున్నాయి. మరికొందరిపైనా చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Updated Date - May 23 , 2024 | 03:34 AM