అడ్డగోలు నిర్మాణాలు అడ్డుకునేదెవరు..?
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:16 PM
నగర పాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో అవినీతి పెచ్చుమీరింది. పాలన పూర్తిగా గాడి తప్పడంతో ఇక్కడి సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
మామూళ్ల మత్తులో ప్లానింగ్ విభాగం
అక్రమ వసూళ్లపైనే అధికారులు, సిబ్బంది దృష్టి
కార్పొరేషన్ ఆదాయానికి గండి
అవినీతి అక్రమాలపై కొనసాగుతున్న విచారణ
కర్నూలు న్యూసిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నగర పాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో అవినీతి పెచ్చుమీరింది. పాలన పూర్తిగా గాడి తప్పడంతో ఇక్కడి సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నగరంలో వెలుస్తున్న అనధికారిక నిర్మాణాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నగర పాలక సంస్థ పరిధిలోని 52 వార్డుల్లో అనధికార భవన నిర్మాణాలు సుమారు వెయ్యికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి భవనాలే ప్లానింగ్ విభాగంలోని అధికారులు, సిబ్బందిగా వరంగా మారాయి. ప్లానింగ్ సెక్రటరీల నుంచి ఉన్నతాధికారుల వరకు మామూళ్లు వెళుతున్న కారణంగా అనుమతి తీసుకోకుండా నిరభ్యంతరంగా నిర్మిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఫ ఆదాయానికి గండి....
నగర పాలక సంస్థలోని ప్రణాళికా విభాగంలో అంతర్లీనంగా ఉన్న ఆదాయ వనరులు పక్కదోవ పడుతున్నాయి. అధికారులు, సిబ్బందితోపాటు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు చేతివాటం ప్రదర్శించడంతో కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. ప్రధానంగా భవన నిర్మాణ అనుమతుల రుసుం, ప్రకటనల పన్ను, అక్రమ నిర్మాణాల రుసుము వసూళ్లలో నిర్లక్ష్యం, చేతివాటం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాగా 2019 నుంచి నయా పైసా రుసుం వసూలు చేయకపోవడం విభాగపు పని తీరును ప్రశ్నిస్తోంది. ఉన్నతాధికారుల అండదండలతో కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బు ఇచ్చిన వారికి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇవ్వని వారి భవనాల దగ్గరకు వెళ్లి దౌర్జన్యంగా నిర్మాణాలను కూల్చడమే కాకుండా గౌండా కార్మికులపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల ఓ వార్డులో నిర్మిస్తున్న భవనంలో పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారి పర్యవేక్షణలో సిబ్బంది సెంట్రింగ్ కార్మికులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో కార్మికులకు దెబ్బలు తగలడంతో కార్పొరేషన ఎదుట ధర్నా నిర్వహించారు.
ఫ ప్లానింగ్ సెక్రటరీల హవా..
సీఎం జగనమోహనరెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే సచివాలయంలో 11 శాఖలకు సంబంధించి సెక్రటరీలు ఉంటారు. ఇందులో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్లానింగ్ సెక్రటరీ ఉంటారు. ఈ క్రమంలో కొందరు అధికారులు ప్లానింగ్ సెక్రటరీలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 133 సచివాయాలు ఉండగా 108 మంది ప్లానింగ్ సెక్రటరీలు ఉన్నారు. వీరంతా వారి వార్డు పరిధిలో జరుగుతున్న నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు పంపాలి. సచివాలయ వ్యవస్థ రాకముందు నూతన భవన నిర్మాణానికి అనుమతులు కావాలంటే మీసేవలో దరఖాస్తు చేసుకునే వారు. ప్రస్తుతం సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తరువాత ప్లానింగ్ సెక్రటరీ అందుకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం బిల్డింగ్ ఇనస్పెక్టర్/అసిస్టెంట్ సిటీ ప్లానర్‌కు నివేదికలను పంపుతారు. ఈ తతంగమంతా పూర్తి కావాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి వారి స్థలంలో ఏవైనా లోపాలు ఉంటే అధికారులు ప్లానింగ్ సెక్రటరీల ద్వారా స్థల యజమానికి సమాచారం చేరవేస్తారు. ఎంతో ఒకంత ముట్టజెప్పాలని, లేని పక్షంలో అనుమతి నిరాకరిస్తారని భయపడిస్తారు. దీంతో కొందరు స్థల యజమానులు డబ్బులు ముట్టజెప్పి తమ పనులు చేయించుకుంటున్నారు. ప్రతి రోజూ కనీసం 10 నుంచి 20 దాకా భవనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో భవననాకి సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నారు. వీటితోపాటు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు వేసే వెంచర్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులకు సంబంధించి అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేర నెలకు కనీసం రూ.50 లక్షలు అక్రమంగా వసూలు చేస్తున్నారు.
ఫఅదుపు తప్పుతున్న ప్రణాళిక:
మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పట్టణ ప్రణాళిక విభాగం అదుపు తప్పుతోంది. ఆదాయం అనుకున్న స్థాయిలో పెరగడం లేదు. అక్రమాలు నిరోధించి పారదర్శకత పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో ఆక్రమణలు, అనుమతిలేని నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఆక్రమణలు, అనధికార నిర్మాణాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనధికార నిర్మాణాలు చేపడుతున్న స్థల యజమానులు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయానికి గండికొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వ్యాపార ప్రకటనల పన్ను వసూళ్లలో..
నగరంలో వ్యాపార వాణిజ్య ప్రకటనల పన్ను వసూళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, ఇతరత్రా ప్రకటనలు, ప్రచారాలు చూసీచూడనట్లు వదిలి వేస్తున్నారు. దీని ద్వారా సంస్థ ఆదాయానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించి అక్రమ వసూళ్లు అరికట్టడానికు కట్టుదిట్టమైన చర్యలు చేపడితే కార్పొరేషన్ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అనధికార వసూళ్లు:
లైసెన్స్‌డ్ సర్వేయర్లు స్టక్చరల్ ఇంజనీర్ల పేర్ల నమోదు వారి లైసెన్స్‌ల రెన్యువల్‌కు సంబంధించి సిబ్బంది ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. వీరు ప్రతి ఏటా తమ పేర్లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్తగా రెన్యువల్ ఫీజులు చెల్లించకుండా పాత ఏడాది అనుమతులతోనే పనులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఒక్కో లైసెన్సకు రూ.30 వేల దాకా మామూళ్లు తీసుకుంటున్నట్టు సమాచారం. సిబ్బందికి వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరుతుందే తప్ప కార్పొరేషన్‌కు మాత్రం ఆదాయం సమకూరడం లేదు.
ఫ కొనసాగుతున్న విచారణ..
నగరానికి చెందిన ఓ వ్యక్తి పట్టణ ప్రణాళికా విభాగంలో అధికారులు, ప్లానింగ్ సెక్రటరీలు చేస్తున్న అవినీతి అక్రమాలపై నేరుగా సీఎంకు లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రీజినల్ డైరెక్టర్ ఐదుగురు సభ్యులత ోకూడిన ఓ కమిటీని నియమించారు. ఇందులో చిత్తూరు మున్సిపల్ కమిషనర్ పి.నరసింహప్రసాద్, రాయదుర్గం కమిషనర్ వి.దివాకర్‌రెడ్డి, తిరుపతి డిప్యూటీ సిటీ ప్లానర్ మహపాత్రో, ఆదోని మున్సిపాలిఈ రెవెన్యూ ఆఫీసర్ కేఎండీ నాసిర్, అనంతపురం ఆర్‌డీడీటీపీలో పని చేస్తున్న టీపీఏ ఓంకార్‌లు ఉన్నారు. డిప్యూటీ సిటీ ప్లానర్ సంధ్యారాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రంగస్వామి, టౌనప్లానింగ్ సూపర్‌వైజర్లు శబరీష్, మంజులమ్మలతో పాటు వార్డు ప్లానింగ్ సెక్రటరీలో బీఎండీ రఫిక్ బాషా, వి.దివ్య, ఎన.రూప, ఎం.రంగానథ్, ఉప్పెన నవీనకుమార్‌లను కమిటీ సభ్యులు విచారిస్తున్నారు. ఇప్పటికే ప్లానింగ్ సెక్రటరీలను విచారించారు. తదుపరి అధికారులను విచారించనున్నారు. ఈ నెల 15వ తేదీలోగా విచారణ పూర్తి చేసిన నివేదికలను ఆర్‌డీఎంఏకు పంపాలని ఆదేశాలు అందాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులంతా ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు.