Share News

ఈబీసీలపై ఇంత ఈర్ష్యా?

ABN , Publish Date - May 11 , 2024 | 05:42 AM

‘బయట పల్లకీల మోత... ఇంట్లో ఈగల మోత’.. రాష్ట్రంలోని అగ్రవర్ణాల్లో (ఈబీసీలు) చాలా కుటుంబాల పరిస్థితి దాదాపుగా ఇంతే! మధ్యతరగతి పేరిట దారిద్య్రం అనుభవిస్తున్న వర్గాలివి.

ఈబీసీలపై ఇంత ఈర్ష్యా?

ఉద్యోగావకాశాల్లో అమలుకాని ‘ఈడబ్ల్యూఎస్‌’

ఐదేళ్లలో ఇచ్చింది సచివాలయ, వలంటీర్‌ పోస్టులే

‘ఈడబ్ల్యూఎస్‌’ ఎగవేసి అగ్రవర్ణ పేదలకు వంచన

‘బయట పల్లకీల మోత... ఇంట్లో ఈగల మోత’.. రాష్ట్రంలోని అగ్రవర్ణాల్లో (ఈబీసీలు) చాలా కుటుంబాల పరిస్థితి దాదాపుగా ఇంతే! మధ్యతరగతి పేరిట దారిద్య్రం అనుభవిస్తున్న వర్గాలివి. ఆర్థికంగా చితికిపోయిన అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అది చేతగాకపోతే ఈ వర్గాలను వాటి మానాన వాటిని వదిలేయాలి. కానీ, జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఎందుకనో ఈబీసీలంటే ఈర్ష్య పడుతోంది. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ‘ఈడబ్ల్యూఎస్‌’ రిజర్వేషన్‌ 10 శాతం అమలుచేయాలని కేంద్రప్రభుత్వం చట్టం చేసింది.

ఈ రిజర్వేషన్లను ఆయా ఓసీ కేటగీరీలకు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవచ్చని సూచించింది. ఈ ప్రకటన చేసినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమం త్రిగా ఉన్నారు. కాపులకు 5 శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతం ఇస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసింది. సుమారు 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు, మరో రెండున్నర లక్షల వలంటీర్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.

ఈ పోస్టుల భర్తీలో ఈడబ్ల్యూఎస్‌ కోటాను కావాలనే విస్మరించిందని ఈబీసీలు ఆగ్రహిస్తున్నారు. జగన్‌ వంచన వల్ల 38 వేల పోస్టులు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు.

ఆనాడు ఎన్నెన్ని పథకాలో....

బ్రాహ్మణ వర్గంలో చాలామంది కడు దారిద్య్రం అనుభవిస్తున్నారని గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌ ద్వారా 1,54,182 మంది వివిధ పథకాలను పొందారు. విద్యా రంగంలో గాయత్రి, భారతి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య పథకాలు, ఆ వర్గంలోని దివ్యాంగులు, వితంతువులు, అనాథల కోసం కశ్యప అండ్‌ అహల్య పథకం, మట్టి ఖర్చుల కోసం గరుడ పథకం అమలయ్యాయి.


కల్యాణమస్తును వీరికీ వర్తింపజేశారు. రూ.50 కోట్లతో క్రెడిట్‌ సొసైటీని ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా 45,097 మందికి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ఇచ్చారు. అప్పట్లో కార్పొరేషన్‌ బడ్జెట్‌ కూడా రూ.285 కోట్లు ఉండేది. జగన్‌ వచ్చాక తొలి ఏడాది రూ.100 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత నుంచి పైసా విదిలించలేదు.

ఆర్యవైశ్యుల సంక్షేమమేది?...

వ్యాపారమే వృత్తిగా ఉన్న ఆర్యవైశ్య కుటుంబాల్లో ఉన్నత చదువులకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. దీనిని గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, ఏటా రూ.60 కోట్లు బడ్జెట్‌ పెట్టి.. వారి ఆర్థిక ఉన్నతికి బాటలు వేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌ను రద్దుచేసింది.

ఈబీసీలపై చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు ప్రత్యేక శ్రద్థ పెట్టింది. ఈబీసీలు వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ వారికి సొంత భూమి లేదు. గ్రామాల్లో పేదరికంలో మగ్గుతుంటే, పట్టణాల్లో అసంఘటిత రంగంలో అస్థిర జీవితాలు గడుపుతున్నారు. ఈ విషయం గుర్తించిన చంద్రబాబు... ఫైనాన్స్‌ కార్పొరేషను ఏర్పాటు చేసి ఆర్థికంగా ఊతం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్‌ ఇవ్వకుండా ఈ కార్పొరేషన్‌ను ఎండబెట్టింది.

- అమరావతి,ఆంధ్రజ్యోతి

అగ్రవర్ణ పేదలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అమలుచేసిన ‘ఈడబ్ల్యూఎస్‌’ రిజర్వేషన్లను ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. కాపులు,ఇతర అగ్రకులాలకు చెందిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాల్లో ఈ కోటాను తు.చ. తప్పక పాటించింది. జగన్‌ అధికారంలోకి రాగానే కాపులకు ‘ఈడబ్ల్యూఎస్‌’ కోటాను రద్దుచేశారు.

మరోవైపు తాను ఆర్భాటంగా చెప్పుకొనే గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల్లో ‘ఈడబ్ల్యూఎస్‌’ విధానం అమలుచేయలేదు. దీనివల్ల అగ్రవర్ణ పేద వర్గాలు 38 వేల పోస్టులు కోల్పోయాయి. ఆ తర్వాత ‘ఈడబ్ల్యూఎస్‌’ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారుగానీ, మెగా డీఎస్సీ జాబ్‌ క్యాలెండరు పై ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ ఎగ్గొట్టేయడంతో.. గత ఐదేళ్లలో ఒక్క పోస్టు కూడా ఈడబ్ల్యూఎస్‌ విధానంలో అగ్రవర్ణ పేదలకు దక్కలేదు.

Updated Date - May 11 , 2024 | 05:42 AM