Share News

గ్రామాల్లో పనులు... పట్టణంలో జియోట్యాగింగ్‌లు

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:58 PM

మండలంలోని ఏ గ్రామంలో పనులు చేస్తే ఆ గ్రామంలోనే జియోట్యాగింగ్‌లు చేయాలి.

 గ్రామాల్లో పనులు... పట్టణంలో జియోట్యాగింగ్‌లు

వైసీపీ పాలనలో అధికారుల ఆగడాలు

15వ ఆర్థిక సంఘం నిధులు గోల్‌మాల్‌ చేశారా..?

ఎమ్మిగనూరు రూరల్‌, సెప్టెంబరు 25: మండలంలోని ఏ గ్రామంలో పనులు చేస్తే ఆ గ్రామంలోనే జియోట్యాగింగ్‌లు చేయాలి. కానీ గ్రామాల్లో జరిగిన పనులకు పట్టణాల్లో కూచొని అధికారులు జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఎక్కడ అభివృద్ధి పనిచేసినా అధికారులకు అక్కడికి వెళ్లి పనుల నాణ్యతను గమనించి అన్ని సక్రమంగా ఉన్నాయా..లేదా పనులు పూర్తయ్యాయా..లేదా అన్న విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బిల్లు పెట్టే సమయంలో ఎక్కడ పని జరిగిఉంటే అక్కడే జియోట్యాగింగ్‌ చేసి బిల్లులు చేయాలి. అయితే పార్లపల్లి పంచాయతీలో మాత్రం అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారు. పార్లపల్లి గ్రామం లో పనిచేయని ఓ బోరు వేసి దానికి మోటారు ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు బిల్లు చేశారు. ఈ బోరుకు పట్టణంలోని కలుగొట్ల రోడ్డులోని ప్రధాన రహదారి పక్కలో ఉన్న పొలంలో సాగుబోరుకు జియోట్యాగింగ్‌ చేసి బిల్లు చేయడం గమనార్హం. అలాగే పార్లపల్లి, గువ్వలదొడ్డి గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలకు సైతం పట్టణంలోని ఎస్సీకాలనీలో ఉన్న సిమెంట్‌ రోడ్లుకు జియోట్యాగింగ్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లు లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను అధికారులు, ఆయా గ్రామాల సర్పంచలు కలిసి దుర్వినియోగం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Sep 25 , 2024 | 11:58 PM