Share News

AP News: పేకాట శిబిరాలతో రెండు చేతులా ఆదాయం.. భారీగా క్రిమినల్‌ కేసులున్నా టీటీడీ పదవి

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:47 AM

ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 506 కింద (నేరపూరిత బెదిరింపులు) నాలుగు కేసులు, సెక్షన్‌ 384 కింద (దోపిడీకి పాల్పడే క్రమంలో వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేయడం) కింద మూడు కేసులు, సెక్షన్‌ 365 కింద (కిడ్నాప్‌) మరో మూడు కేసులు ఉన్నాయి.

AP News: పేకాట శిబిరాలతో రెండు చేతులా ఆదాయం.. భారీగా క్రిమినల్‌ కేసులున్నా టీటీడీ పదవి

కృష్ణాలో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌లో కోట్లకు పడగలు జగనన్న కాలనీ కోసం తన నియోజకవర్గ కేంద్రంలో 25 ఎకరాల భూమిని ఎకరా రూ.20 లక్షల చొప్పున ఆ ఎమ్మెల్యే కొనుగోలు చేశారు. కానీ ప్రభుత్వం చెల్లించిన ధర ఎకరాకు రూ.45 లక్షలు. ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున ఎమ్మెల్యే ఖాతాలోకి వెళ్లాయన్న ఆరోపణలున్నాయి.

చిల్లర డబ్బులను కూడా వదలకుండా దండుకుంటారని ఆ ఎమ్మెల్యే కుటుంబం గురించి చెబుతారు. నియోజకవర్గ కేంద్రంలోని రైతు బజారులో దుకాణాల నుంచి ఎమ్మెల్యే సతీమణి మామూళ్లు వసూలు చేస్తుంటారు. బహిరంగ మార్కెట్‌లో టమాటా ధరలు భగ్గుమన్న సమయంలో చిత్తూరు నుంచి వాటిని తెప్పించి సొంత మనుషులతో రైతుబజారులో అమ్మించి సొమ్ము చేసుకున్నారు. టీటీడీ సభ్యునిగా ఉన్న భర్తనుంచి తిరుమలలో దర్శనం, వసతులకు లెటర్లు ఇప్పించడానికీ డబ్బులు వసూలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఆ ఎమ్మెల్యే కన్నా ముందు ఆయన సతీమణి దర్శనం చేసుకోవాలని చెబుతారు. అధికారుల పోస్టింగ్‌లు సైతం ఆమె కనుసన్నల్లోనే నడుస్తుంటాయి.

పేకాట శిబిరాలతో రెండు చేతులా ఆదాయం

బెల్టుషాపులు నడుపుతున్న అనుచరులు

జోరుగా గంజాయి అమ్మకాలు..

భారీగా క్రిమినల్‌ కేసులున్నా టీటీడీ పదవి

మితిమీరిన కుటుంబసభ్యుల పెత్తనం

హత్యలదాకా వెళ్లిన మట్టి అక్రమ రవాణా

ఈ కేసులో ఎమ్మెల్యే వియ్యంకుడిపై ఆరోపణలు

రైతు బజార్ల నుంచి దండుకుంటున్న సతీమణి

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)

ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 506 కింద (నేరపూరిత బెదిరింపులు) నాలుగు కేసులు, సెక్షన్‌ 384 కింద (దోపిడీకి పాల్పడే క్రమంలో వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేయడం) కింద మూడు కేసులు, సెక్షన్‌ 365 కింద (కిడ్నాప్‌) మరో మూడు కేసులు ఉన్నాయి. ఇవి కాక చిన్నచితకా కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా ఆయనే చెప్పుకొన్న వివరాలివీ. ఇవన్నీ కోర్టుల్లో వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. ఏ కేసులోనూ శిక్ష పడకపోవడంతో నిబంధనల ప్రకారం ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికై పెత్తనం చెలాయిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆయనను ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా నియమించేశారు. కానీ దేవదాయ చట్టంలోని సెక్షన్‌ 18, 19కి ఇది విరుద్ధమని పేర్కొంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కృష్ణా జిల్లాలోని ఆ ఎమ్మెల్యే యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లోనూ గెలిచిన ఆయన 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 2011 మేలో కాంగ్రె్‌సను వీడి వైసీపీలో చేరారు. 2019లో గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఆయన సతీమణే ‘ఉదయభానుడి’లా వెలిగిపోతున్నారు. ఆమెతో కలిసి పెద్ద కుమారుడే నియోజకవర్గంపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఆ నేత డమ్మీగా మారిపోయారు. నియోజకవర్గంలో వివిధమార్గాల ద్వారా సమకూరే ఆదాయం మొత్తం ఎమ్మెల్యే కుటుంబానికే పరిమితం అయిపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ప్రతి గ్రామంలో అసంతృప్తి వర్గం కూడా తయారైంది. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే సామాజికవర్గానికే పెత్తనం. దీంతో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవన్నీ తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఎమ్మెల్యేది,

రేషన్‌ బియ్యం రీసైకిల్‌తో కోట్లు

పేదల బియ్యం రీసైకిల్‌ చేస్తున్నారని ఎమ్మెల్యే కుటుంబసభ్యుల పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. రీసైకిల్‌ చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తూ నెలకు సుమారు రూ.ఎనిమిది కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, కోదాడ, సూర్యాపేటతోపాటు పలు సరిహద్దు గ్రామాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఈ బియ్యాన్ని నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ముఖ్య అనుచరుల ద్వారా కాకినాడ పోర్టుకు తరలిస్తారు. నిత్యం ఐదు లారీల రేషన్‌ బియ్యం కాకినాడ పోర్టుకు తరలిపోతోంది. ఒక్కో లారీలో 400 క్వింటాళ్ల నుంచి రెండు వేల క్వింటాళ్ల వరకు రేషన్‌ బియ్యం తరలిపోతోంది.

‘పేకాట’పై రోజుకు 2 లక్షలు

నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఈ శిబిరాల నిర్వాహకులు రోజుకి రూ.2 లక్షలను ఎమ్మెల్యే కుటుంబానికి సమర్పించుకోవాలి. ఇందుకుగాను ఈ శిబిరాలకు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా ఆయన పరివారం చేసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం సెబ్‌ పోలీసులు పేకాట శిబిరాలపై దాడులు చేసి ఆ నేత అనుచరులపై కేసులు పెట్టారు. అయితే, పైస్థాయిలో ఒత్తిడి చేయించి ఆ కేసులను ఎత్తివేసేలా చేశారు. నేటికీ ఆ ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే జోరుగా పేకాట శిబిరాలు సాగుతున్నాయి.

బెదిరింపులు... దౌర్జన్యాలు

తన మాట విననివారు సొంత పార్టీ వారైనాసరే....బెదిరించో, దౌర్జన్యం చేసో తన దారికి తెచ్చుకోవడం ఎమ్మెల్యేకి అలవాటు. కొద్దిరోజుల క్రితం ఓ ఎస్టీ నేతపై తన అనుచరులతో దౌర్జన్యం చేయించారు. అప్పటికీ దారికి రాకపోవడంతో నేరుగా తానే ఫోన్‌ చేసి తీవ్ర స్థాయిలో బెదిరించారు. ఆర్థికంగా నష్టపరుస్తానని, కోలుకోలేని దెబ్బ కొడతానంటూ బెదిరింపులకు దిగారు.

అందినకాడికి దోచేయ్‌..!

నియోజకవర్గ కేంద్రం శివారు ప్రాంతాల్లో కొందరు 200 ఎకరాల్లో లేఔట్లు వేశారు. ఇవన్నీ అనధికార లేఔట్లే. వారినుంచి ఎమ్మెల్యే కోట్లలో దండుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అనధికారికంగా లేఔట్లు వేస్తున్నా, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పట్టించుకోవడం లేదంటూ సొంత పార్టీకి చెందిన వైసీపీ కౌన్సిలర్‌ 2023 మే 31న కౌన్సిల్‌ సమావేశంలో నిలదీశారు.

వైసీపీ సర్కారు వచ్చాక ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించింది. దీన్ని వైసీపీ నేతలు వరంగా మార్చుకున్నారు. ఆ ఎమ్మెల్యే ఇసుకను తెలంగాణ ప్రాంతానికి తరలించడంద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు.

నియోజకవర్గ కేంద్రం చుట్టుపక్కల చాలా పరిశ్రమలున్నాయి. వీటి నుంచి సీఎ్‌సఆర్‌ ఫండ్స్‌ వసూలు చేసి వివిధ పనుల కోసమంటూ...తనకు అనుకూల కాంట్రాక్టర్ల ఖాతాల్లో వేయిస్తారు. మళ్లీ అవే పనులను ప్రభుత్వం నుంచి ఓకే చేయించుకుని బిల్లులు చేసుకుంటారు.

ఎమ్మెల్యే అనుచరగణం ఆయన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 10 నుంచి 15 బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఆ నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు చేస్తుంటారు. ఎమ్మెల్యే వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌పై 2023 జూలైలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ - తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో హోండా యాక్టివాలో తరలిస్తున్న 127 మద్యం బాటిల్స్‌ పట్టుకున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌పై కేసు నమోదయింది.

నియోజకవర్గ వ్యాప్తంగా గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వీటివెనుక ఆ ఎమ్మెల్యే కుటుంబం ఉంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉండటంతో గంజాయిని రాష్ట్రాలు దాటించడంలోనూ ఎమ్మెల్యే అనుచరులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఆ ఎమ్మెల్యే పరివారం అక్రమాలు హద్దులు దాటాయి. చివరకు హత్యలు చేసేవరకు వెళ్లాయి. ఆయన నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్‌ భూముల్లో కొండలు, గుట్టల్లో ఎమ్మెల్యే వియ్యంకుడు, అల్లుడు, కుమారుడు వందలాది లారీల మట్టిని తవ్వి తరలిస్తూ కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మట్టి రవాణాను ప్రశ్నించిన బీజేపీ నాయకుడు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలో ఎమ్మెల్యే వియ్యంకుడి పాత్రపై ఆరోపణలు వచ్చాయి.

Updated Date - Feb 01 , 2024 | 07:19 AM