Share News

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

ABN , Publish Date - May 13 , 2024 | 04:10 AM

పోలింగ్‌ ముంగిట సీఎం జగన్‌లో గెలుపు ధీమా సడలిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘వైనాట్‌ 175’ అని ఊదరగొట్టిన ఆయన..

 వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

‘వైనాట్‌ 175’ ఉత్సాహం మాయం

వీరభక్తులపై ఈసీ వేటుతో జగన్‌లో ఆకస్మిక బేలతనం

చిన్నాన్న వివేకా హత్య కేసు రివర్స్‌.. కాంగ్రె్‌సలో చేరి చెల్లెలు షర్మిల సవాల్‌

ఏకంగా కడపలో అవినాశ్‌రెడ్డిపై పోటీ.. ఆమెకు మద్దతుగా సునీత ప్రచారం

కడపలో కుమార్తెకే ఓటేయాలని అమెరికా నుంచి తల్లి విజయలక్ష్మి సందేశం

భారీగా దెబ్బతీసిన ల్యాండ్‌ యాక్టు?.. విజయం నుంచి ‘టైట్‌’కు పడ్డ అంచనాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలింగ్‌ ముంగిట సీఎం జగన్‌లో గెలుపు ధీమా సడలిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘వైనాట్‌ 175’ అని ఊదరగొట్టిన ఆయన.. గత కొన్ని రోజులుగా తన ప్రచారంలో బేలతనం ప్రదర్శిస్తూ వచ్చారు. వైసీపీని గెలిపించేందుకు కంకణం కట్టుకున్న కొందరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వేటువేయడమే దీనికి కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పలు సర్వేలు టీడీపీ కూటమికే విజయమని అంచనాలు వేయడంతో వైసీపీ నేతలు స్తబుఽ్ధగా ఉండిపోయారు. అవన్నీ తప్పుల తడకని.. మేమే గెలవబోతున్నామని ఇదమిత్థంగా ఓ అంకె కూడా చెప్పలేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నాయి. సర్వేల ప్రభావంతో క్రమంగా వైసీపీ అభ్యర్థులను నీరసం ఆవహించినట్లుగా ఉందని చెబుతున్నాయి. జగన్‌ సహా ఆ పార్టీ ముఖ్య నేతలెవరిలోనూ.. 2019 ఎన్నికలనాటి ఉత్సాహం కనిపించడం లేదని పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి సీఎం నోట ‘వైనాట్‌ 175’ వినిపించకపోవడం వైసీపీ నేతలను, శ్రేణులను కూడా విస్మయపరుస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ వర్క్‌ షాపుల్లో, అధికారిక సమీక్షల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ సీట్లూ కైవసం చేసుకుంటామని జగన్‌ దర్పంగా చెప్పేవారు. అయితే పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవని సొంత సర్వేలే తేల్చడం.. చిన్నా న్న వివేకాందరెడ్డి హత్య కేసు వెన్నాడుతుండడం.. చెల్లెళ్లు వైఎస్‌ షర్మిల, సునీత తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడం.. సిద్ధం సభలకు, బస్సు యాత్రకు స్పందన లేకపోవడం.. టీడీపీ-జనసేనతో బీజేపీ సైతం జట్టుకట్టడం.. స్వయంగా ప్రధాని మోదీ కూటమి తరఫున ప్రచారానికి రావడం వంటి పరిణామాలు ఆయనలో విశ్వాసం సన్నగిల్లడానికి కారణాలని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. జగన్‌లో ధీమా సడలినట్లు ఆయన హావభావాలు, ప్రసంగాలతో స్పష్టం కావడంతో ఆ ప్రభావం వైసీపీ శ్రేణులపైనా పడిందని అంటున్నారు. అందుకే భయపడాల్సిన పనిలేదని.. బొటాబొటీగా 100 స్థానాలతోనైనా బయటపడతామని.. జగనే మళ్లీ అధికారంలోకి వస్తారంటూ కొందరు వైసీపీ పెద్దలు ఆంతరంగికులతో చెబుతున్నట్లుగా లీకులివ్వడం విశేషం.


నాడు రాత మార్చిన హత్యే..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు 2019లో రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. ఈ హత్యను జగన్‌ తనకు సానుకూలంగా ప్రచారం చేసుకుని గెలిచి అధికారంలోకి వచ్చారు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి చరిత్ర రివర్స్‌ అవుతోందని అంటున్నారు. నాడు జగన్‌కు మద్దచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎదురుతిరిగారు. ఎన్నికల వేళ ఈ తిరుగుబాటు తీవ్రమైంది. అన్న కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్‌ షర్మిలారెడ్డి కాంగ్రె్‌సలో చేరి ఏకంగా పీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఈ హత్య కేసులో నిందితులుగా పేర్కొనడం.. ఆయన్ను సీబీఐ అరెస్టు చేయకుండా జగన్‌ చేసిన అధికార దుర్వినియోగం.. బహిరంగంగానే మద్దతివ్వడం.. మరోసారి వైసీపీ టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆమె కడప లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వివేకా హత్య వ్యవహారంలో న్యాయం కోసం ఒంటరి పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. అన్నాచెల్లెళ్ల తగవుకు దూరంగా విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. అయితే పోలింగ్‌ ముంగిట కడపలో షర్మిలను గెలిపించాలని ప్రకటన విడుదల చేయడంతో వైసీపీ శ్రేణులు డీలాపడ్డాయి.

టైటిలింగ్‌ యాక్టు దెబ్బ!

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు అనూహ్యంగా తమను దెబ్బతీసిందని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఈ ఐదేళ్లలో అధికార పార్టీ ఆక్రమణలు, భూకబ్జాలను దగ్గరగా చూసిన జనం తమ భూమిని అధికారికంగానే లాక్కుంటారన్న ఆందోళనలో పడిపోయారని.. దీనికితోడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ దీనినే ప్రధాన ప్రచారాస్త్రం చేయడం.. తాను అధికారంలోకి వస్తే జగన్‌ తెచ్చిన కబ్జా చట్టాన్ని రద్దుచేసేస్తానని.. దానిపైనే రెండో సంతకం చేస్తానని టీడీపీ అధినేత ప్రకటించడం.. తమ విజయావకాశాలను సంక్లిష్టంగా మార్చాయని వారు అంగీకరిస్తున్నారు.

Updated Date - May 13 , 2024 | 04:10 AM