నామినేషన్లు వేసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:18 AM
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అయినా మూడు స్థానాలకూ వైసీపీ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్లు దాఖలు చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అయినా మూడు స్థానాలకూ వైసీపీ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి ఈనెల 14 లేదా 15వ తేదీన నామినేషన్లు వేయాలని భావించారు. అయితే రెండు మూడు రోజుల ముందే ఆగమేఘాలపై వైసీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమయింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. వారికి పార్టీ తరఫున బీ ఫారాలను అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైసీపీ అభ్యర్థులు నేరుగా వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఏన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని జగన్ రాజ్యసభ మెట్టెక్కిస్తున్నారని వైవీ అన్నారు. సమసమాజ స్థాపన కోసం తమను జగన్ ఎంతవరకైనా తీసుకువెళతారని గొల్ల బాబూరావు చెప్పారు. తనను రాజ్యసభకు పంపుతున్నందుకు జగన్‌కు మేడా ధన్యవాదాలు చెప్పారు.