Share News

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ABN , Publish Date - May 14 , 2024 | 04:16 AM

పోలింగ్‌ కేంద్రాలపై వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. పోలింగ్‌ పర్యవేక్షణ చేస్తున్న ఏజెంట్లు, అభ్యర్థుల నుంచి ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చిన పౌరులు, పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షిస్తున్న పోలీసుల వరకు..

 పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు
ycp leaders attacked

పోలింగ్‌ కేంద్రాలపై పేట్రేగిన వైసీపీ గూండాలు

ఎన్డీయే అభ్యర్థులు, ఏజెంట్లపై యథేచ్ఛగా హింసాకాండ.. 50 బైకులు, 10 కార్లతో మాచర్లలో వీరంగం

టీడీపీ కార్యకర్తలను గుద్దించి, రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి.. బీభత్సం సృష్టించిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు

పల్నాడులో తెగబడిన వైసీపీ మూకలు.. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ కాన్వాయ్‌పై దాడి

రెంటాలలో జూలకంటి, నరసరావుపేటలో అరవిందబాబుపై దాష్టీకం.. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వీరంగం

ఎస్పీ కారుపై రాళ్లవాన.. వాహనాల ధ్వంసం, రాళ్లు, కట్టెలతో దాడి.. పెద్దిరెడ్డి గ్రామంలో ఏజెంట్ల కిడ్నాప్‌

చంద్రగిరిలో టీడీపీ ఏజెంట్లపై చెవిరెడ్డి మోహిత్‌ దౌర్జన్యం.. ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై దాడికి యత్నం

బాపట్లలో కోన బంధువు వెంకట్‌ దాష్టీకం.. అడ్డుకున్న దళితులు

చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్యపై దౌర్జన్యం.. పెనమలూరులో జోగి రమేశ్‌ అనుచరుల వీరంగం

పలుచోట్ల గాలిలోకి కాల్పులు.. లాఠీచార్జి

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

పోలింగ్‌ కేంద్రాలపై వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. పోలింగ్‌ పర్యవేక్షణ చేస్తున్న ఏజెంట్లు, అభ్యర్థుల నుంచి ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చిన పౌరులు, పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షిస్తున్న పోలీసుల వరకు.. అందరిపైనా అరాచకంగా విరుచుకుపడ్డారు. తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, గన్నవరం, పెనమలూరు, కాకినాడ... విజయనగరం.. ఇలా రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల వరకు వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. తాడిపత్రిలో పోలీసులు ఏకంగా ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. ఏకంగా ఎస్పీ వాహనంపైనే వైసీపీ మూకలు రాళ్లు విసిరాయి. తాడిపత్రిలో వైసీపీ మూకల రాళ్లదాడులకు నిరసనగా బైకు ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులపై మరోసారి దాడి చేయడంతో, బాలింత అయిన భార్యను ఓటేసేందుకు తీసుకెళుతున్న వ్యక్తి తలపగిలింది. ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. కడప జిల్లా కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారు. సుభాశ్‌రెడ్డి అనే టీడీపీ నాయకుడిని దారుణంగా కొట్టి ఊరిబయట పడేశారు. రైల్వే కోడూరు, మైదుకూరు, రాయచోటి నియోజక వర్గాల్లో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. టీడీపీకి చెందిన పలు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశాయి. ఖాజీపేట మండలం పుల్లూరులో టీడీపీ కార్యకర్త చెన్నయ్యపై వైసీపీ నాయకుడు నాగేశ్వర రెడ్డి దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. డోన్‌ నియోజకవర్గంలోని బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి బాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. మాచర్లలో వైసీపీ గూండాలు ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేశారు. ఈవీఎంల ధ్వంసం, టీడీపీ ఏజెంట్లపై దాడులు, దౌర్జన్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులు చేశారు. సత్తెనపల్లిలో పలుచోట్ల పరస్పర దాడులతో వాహనాలు దెబ్బతిన్నాయి. విజయవాడలో ఎన్డీయే ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని వైసీపీ గూండాలు, ఆయన వాహనాలను వెంబడించి దాడులు చేశారు. గన్నవరంలో ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావ్‌ ఒకేసారి ముస్తాబాద ప్రాంతానికి వచ్చారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.


టీడీపీ అభ్యర్థి కొండయ్యపై దౌర్జన్యం

బాపట్ల జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌, చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యపై దాడికి ప్రయత్నించారు. చీరాల మండలం గవినివారిపాలెంలో వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడ్డారు. టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య అక్కడకు చేరుకుని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న సమయంలో వైసీపీ మూకలు ఆయనపైకి దూసుకొచ్చారు. దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అనుచరుడు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మార్పు గ్రెగోరీ సోమవారం రాత్రి రక్తగాయాలతో బాపట్ల జిల్లా చీరాలలోని ప్రైవేటు వైద్యశాలలో చేరారు. డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ గన్‌ వెనక్కు తిప్పి ఆయన ముఖంపై దాడి చేసినట్లు ఆమంచి అనుచరులు ఆరోపిస్తున్నారు. సినీ నిర్మాత, రచయిత కోన వెంకట్‌ బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని పోలింగ్‌ బూత్‌ వద్ద హంగామా సృష్టించారు. చీఫ్‌ ఏజెంట్‌గా ఆయనకు ఒక్కడికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని బూత్‌ల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు.

పెద్దిరెడ్డి సొంతూరులో..

చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సదుంలోని బూరగమంద గ్రామంలో 14 మంది టీడీపీ ఏజెంట్లను వైసీపీ నాయకులు సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకే కిడ్నాప్‌ చేశారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. దీనిపై రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఉదయం ఆరు గంటలకు వారిని పీలేరు పింఛానది బ్రిడ్జి సమీపంలో విడిచి పారిపోయారు. చిత్తూరులో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు.. షర్మన్‌ స్కూల్‌, మంగసముద్రం కేంద్రాల వద్ద వైసీపీ నేత, చుడా చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి తన వాహనాన్ని అడ్డుపెట్టారు. ప్రశ్నించినందుకు టీడీపీ శ్రేణుల మీద వైసీపీ వాళ్లు దాడి చేశారు. యాదమరి మండలం 14 కండ్రిగ ముస్లింవాడ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్న వైసీపీ నాయకుల్ని టీడీపీ శ్రేణులు వీడియో తీశారు. దీంతో వారిపై 50 మంది వైసీపీ కార్యకర్తలు.. కత్తులతో, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

కుప్పంలో తలుపులేసిన వైసీపీ

చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం సింగసముద్రంలో వైసీపీ అభ్యర్థి భరత్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి తలుపులు మూసేశారు. వెంటనే టీడీపీ నాయకులు తలుపులు తెరిచారు. దీంతో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించి టీడీపీ నేతల మీద దాడి చేశారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం చిన్నగురవలూరులో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు బయటికి లాక్కొచ్చి దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం మబ్బుచింతలలో వైసీపీ నేత పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేయడంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సోమవారం రాత్రి వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు.


జోగి అనుచరుల వీరంగం

పెనమలూరు నియోజకవర్గం పోరంకి ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద మంత్రి జోగి రమేశ్‌, ఆయన కుమారులు మైలవరం, పెడన నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గన్నవరం నియోజకవర్గం పరిధిలో నున్న హైస్కూల్‌, గ్రామ సచివాలయాల వద్దకు వచ్చిన ఎన్డీయే అభ్యర్థి యార్లగడ్డపై వైసీపీ అభ్యర్థి వంశీ అనుచరులు దాడికి ప్రయత్నించారు.

కానిస్టేబుల్‌ హల్‌చల్‌..

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకులలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ పోలింగ్‌ బూత్‌లోకి దౌర్జన్యంగా వెళ్లి తలుపులు వేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. డ్యూటీలో ఉన్న బీఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ రెండు రౌండ్లు నేలపై కాల్పులు జరిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు జడ్పీ బాలికోన్నత పాఠశాలవద్ద బూత్‌లో ఉద్రిక్తత నెలకొంది. జనసేన ఏజెంట్లు కండువాలు తీసేయాలని వైసీపీ ఏజెంట్లు గొడవకు దిగారు. అయితే పోలింగ్‌ కేంద్రాల్లో ఫ్యాన్లు తీసేయాలని జనసేన ఏజెంట్లు బదులిచ్చారు.

Updated Date - May 17 , 2024 | 10:46 AM