మొన్న ఐటీ.. నేడు గ్రీన్ ఎనర్జీ!
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:38 AM
ప్రపంచంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీతో విప్లవం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికత మహాబలమైనదని..
హరిత ఇంధన విప్లవం మొదలైంది: చంద్రబాబు
క్లీన్ ఎనర్జీతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
క్లీన్ ఎనర్జీ గ్లోబల్ వర్సిటీ స్థాపిస్తాం
2030 నాటికి 72.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెస్తాం
ప్రజలకు చౌకగా కరెంటు ఇవ్వొచ్చు
పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు
నోడల్ ఏజెన్సీగా న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ
కంపెనీలకు దీని ద్వారా సహకరిస్తాం
ప్రోత్సాహకాలు, రాయితీలిస్తాం
ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడు
ప్రతి నలుగురు భారత నిపుణుల్లో ఒకరు తెలుగోడు: సీఎం
గాంధీనగర్ సదస్సులో ప్రసంగం
టెక్నాలజీ మహాశక్తిమంతమైంది. దానిని
వినియోగించుకుని ప్రజలకు చౌకగా విద్యుత్
సరఫరా చేయొచ్చు. సంప్రదాయ విధానాలను
అవలంబిస్తూ.. పెరిగిన విద్యుదుత్పత్తి వ్యయ భారాన్ని వారిపై ఎందుకు రుద్దాలి?
- సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీతో విప్లవం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికత మహాబలమైనదని.. దానితో చౌకగా విద్యుదుత్పత్తి సాధించవచ్చని తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడ్రోజులు జరిగే నాలుగో ‘ఆర్‌ఈ ఇన్వెస్ట్-2024’ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనంపై ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు.. తర్వాత ప్రసంగించారు. క్లీన్ ఎనర్జీ ద్వారా పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని ప్రకటించారు. న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని.. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఈ సంస్థ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ గ్లోబల్ విశ్వవిద్యాలయం స్థాపిస్తామన్నారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ పద్ధతులు అవలంబిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్‌ఎనర్జీ రంగంలో విప్లవం రాబోతుందని.. దీనిని దేశం అందుకోవాలని.. ఈ విప్లవానికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 2030నాటికి 72.60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అదే ఏడాది జాతీయ స్థాయిలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో పెట్టుబడుల స్థావరంగా మలుస్తామని చెప్పారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
జనంపై భారం పడకుండా..
గతంలో విద్యుత్ కోతలు గణనీయంగా ఉండేవి. ఈరోజు విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంకేతికతను జోడించడం ద్వారా విద్యుత్ చార్జీల భారం జనంపై పడకుండా తగ్గించవచ్చు. క్లీన్ ఎనర్జీలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. విద్యుత్ బిల్లుల నియంత్రణకు పునరుత్పాదక ఇంధనం(ఆర్‌ఈ )తో పాటు కటింగ్ ఎడ్జ్ సాంకేతికత వాడాలి. గ్రిడ్ నిర్వహణలో సమతూకానికి విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను మెరుగుపరచాలి. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ద్వారా నేరుగా ట్రాన్స్‌మిషన్ చేయాలి. ఆంధ్రలో ఉత్తమ పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాం. 2014లో సౌర, పవన విద్యుత్ పాలసీ ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయా ల్సి ఉంది. నెడ్‌క్యాప్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. విన్-విన్నర్ విధానంలో భూసమీకరణ జరుగుతుంది. గతంలో విద్యుత్ పంపిణీ సంస్థలు.. కరెంటు బిల్లులను ఇంటింటికీ పంపేవి. కానీ ఇప్పుడీ రంగంలో సాంకేతికత పెరిగింది. రిమోట్ ఆధారంగా విద్యుత్ సేవలు అందించడం.. ఆపేయడం వంటి సాంకేతిక విధానాన్ని అమల్లోకి తెచ్చాం. రాష్ట్రంలో ప్రస్తుతం 4,335 మెగావా ట్ల సోలార్, 3,083 మెగావాట్ల పవన, 443 మెగావాట్ల బయో, 36 మెగవాట్ల వేస్ట్ టు ఎనర్జీ ఉత్పత్తి అవుతోం ది. 40 గిగావాట్ల సౌరశక్తి, 20 గిగావాట్ల పవన శక్తి, 12 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ. 25 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, ఒక ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్, 2,500 కేఎల్‌పీడీ బయో విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యం. రాష్ట్రంలో రూఫ్‌టాప్ విద్యుదుత్పత్తి గణనీయంగా పెంచడంపై దృష్టిసారించాం. పెరిగిన సాంకేతికతతో ఈ విద్యుత్‌ను సొంత అవసరాలకే గాక.. పీక్ అవర్‌లో మళ్లీ వాడుకునేలా స్టోరేజీ వ్యవస్థ అమల్లోకి రానుంది. కొత్తగా ఇంటిగ్రేటెడ్ క్లీన్‌ఎనర్జీ పాలసీ -2024ను తీసుకొస్తాం. వీలింగ్ చార్జీలను మాఫీ చేస్తాం.
ప్రతి నలుగురిలో ఒక తెలుగోడు
ఐటీ విప్లవం వచ్చాక ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటున్నారు. ప్రతి నలుగు రు భారత ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉంటున్నారు.
దండి కుటీర్‌కు చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): గాంధీనగర్‌లో చరిత్ర ప్రసిద్ధమైన దండి కుటీర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు సూచించారు. ఆర్‌ఈ ఇన్వెస్ట్-2024 సదస్సు సందర్భంగా దండి కుటీర్ విశిష్టతను వివరించారు. దరిమిలా చంద్రబాబు దానిని సందర్శించారు. ‘దండికుటీర్ సందర్శన నా జీవితంలో మరపురాని ఘట్టంగా గుర్తుండిపోతుంది. గాంధీజీ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలు తెలుసుకునేలా ఇది ఉంది’ అని సందర్శకుల పుస్తకంలో చంద్రబాబు రాశారు. అనంతరం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఆయన నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు. భారతదేశ రాజకీయాల్లో విజనరీ లీడర్‌గా, అభివృద్ధి పాలకుడిగా చంద్రబాబు ఎప్పటి నుంచో స్ఫూర్తిగా ఉన్నారని పటేల్ కొనియాడారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రాష్ట్రంలో 10 లక్షల ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో పీపీపీ అమలు చేశాం. ఇప్పుడు ‘పీ-4’ (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్స్) అమలు చేస్తాం.
- సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి సోలార్ అవార్డు
అనంతపురంలో సోలార్ పార్కుల ఏర్పాటుకు గాను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ నుంచి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అవార్డు అందుకున్నారు. గాంధీనగర్ సదస్సులో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పునరుత్పాదక విద్యుత్ ప్రోత్సాహక సంస్థ ఎండీ కేవీ చక్రధరబాబు తదితరులు పాల్గొన్నారు.