YS Jagan-Sharmila dispute: సరస్వతి పవర్ షేర్ల కేసు విచారణలో కీలక పరిణామం
ABN , Publish Date - Nov 08 , 2024 | 01:09 PM
సరస్వతి పవర్ షేర్ల బదిలీ అంశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేశారంటూ తల్లి, చెల్లిపై వైస్ జగన్ వేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ కోర్టులో ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది.
హైదరాబాద్: సరస్వతి పవర్ షేర్ల బదిలీ అంశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేశారంటూ తల్లి, చెల్లిపై వైస్ జగన్ కోర్టుకెళ్లారు. ఆయన వేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ కోర్టులో ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని తల్లి విజయమ్మ కోరారు. వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిల తరపున న్యాయవాది సమయం కోరారు. దీంతో కేసు విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేస్తూ ఎన్‌సీఎల్‌టీ కోర్ట్ నిర్ణయం తీసుకుంది.
కాగా తనకు తెలియకుండానే క్రమక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇవాళ విచారణ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఇక ప్రతివాదులుగా ఉన్న వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వాదనలను కూడా కోర్టు వినాల్సి ఉంటుంది. ఎంవోయూ రాసుకున్న తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా షేర్లు ఎలా వెనక్కి తీసుకుంటారంటూ వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వారి వాదనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కాగా ఎన్‌సీఎల్‌టీ కోర్టులో జగన్ వేసిన పిటిషన్‌లో పలు కీలకమైన అంశాలు ఉన్నాయి. ‘‘సోదరిపై ఉన్న ప్రేమతో 2019లో ఎంవోయూ రాసుకున్నాం. అయితే ఇటీవల కాలంలో రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నన్ను, నా భార్యను టార్గెట్ చేస్తూ షర్మిల వ్యాఖ్యలు చేసింది. అందుకే ప్రస్తుతం 51 శాతంగా ఉన్న ఆమె షేర్లను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేశాను. అందుకు నాకు అనుమతి ఇవ్వండి’’ అంటూ జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.