Share News

YS Jagan : కుటుంబ కలహాలు మామూలే!

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:44 AM

తల్లీ చెల్లితో ఆస్తి వివాదాలను ‘సాధారణమైన అంశం’గా వైఎస్‌ జగన్‌ తేల్చేశారు. వారిద్దరిపై ట్రైబ్యునల్‌లో కేసు వేయడాన్ని కూడా ‘మామూలు విషయం’గానే లెక్కకట్టారు. తాను డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తున్నానని...

YS Jagan : కుటుంబ కలహాలు మామూలే!

  • గొడవలు ఏ ఇంట్లో ఉండవు?

  • నేను గుర్ల వస్తున్నాననే మా తగాదాలు తెరపైకి తెచ్చారు

  • షర్మిలతో వివాదాలపై జగన్‌ వ్యాఖ్యలు

  • సీఎం చంద్రబాబుపై విమర్శలు

  • డయేరియా బాధితులకు పరామర్శ

విజయనగరం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తల్లీ చెల్లితో ఆస్తి వివాదాలను ‘సాధారణమైన అంశం’గా వైఎస్‌ జగన్‌ తేల్చేశారు. వారిద్దరిపై ట్రైబ్యునల్‌లో కేసు వేయడాన్ని కూడా ‘మామూలు విషయం’గానే లెక్కకట్టారు. తాను డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తున్నానని... జనం దృష్టిని మళ్లించేందుకే ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ చేస్తున్నారని ఆరోపించారు. మీడియాలో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా వార్తలు రాయిస్తున్నారని ఆక్రోశించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గురువారం విజయనగరం జిల్లాలో డయేరియా ప్రభావిత గ్రామమైన గుర్లలో పర్యటించారు. బాధితులను పరామర్శించిన అనంతరం ‘‘రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాటర్‌ ట్యాంకులు సకాలంలో శుభ్రం చేయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. డయేరియా ఘటన నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకు అనుకూల పత్రికలు, మీడియాలో నాకు, నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి తగాదాను తెరపైకి తెచ్చారు. కుటుంబ కలహాలు ఏ ఇంట్లో ఉండవు? అవి మామూలే’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

  • మైకు వదిలేసి...: జగన్‌ మీడియా ముందుకు చేరుకోగానే.. వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో.. ‘మాట్లాడమంటారా.. వెళ్లిపొమ్మంటారా?’ అని జగన్‌ ఆసహనం వ్యక్తం చేశారు. చివరకు మైకు వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను, ఇతర నేతలు బతిమాలి జగన్‌ను మళ్లీ తీసుకొచ్చారు. జగన్‌ పరామర్శించేందుకు వీలుగా జనాన్ని, డయేరియా బాధితులను తీసుకొచ్చారు. కనీసం ఫ్యాను ఏర్పాటు చేయలేదు. ఒక దశలో టెంట్‌ కూడా కూలిపోయింది. వైసీపీ కార్యకర్తలు రచ్చ చేయగా... వారిని అదుపు చేయడంతో విఫలమయ్యారంటూ జగన్‌ పోలీసులపై చిర్రుబుర్రులాడడం గమనార్హం. మీడియా సమావేశం పెట్టడానికీ కూడా సహకరించరా అని చిందులు తొక్కారు. మరోవైపు... జగన్‌ కాన్వాయ్‌ కారు టైర్లు ఓ కానిస్టేబుల్‌ కాలుపైగా వెళ్లడంతో ఆయనకు గాయాలయ్యాయి.


  • బొత్స గైర్హాజరు..

చీపురుపల్లి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం అన్న సంగతి తెలిసిందే. స్వయంగా పార్టీ అధినేతే అక్కడ పర్యటనకు వస్తే బొత్స హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన విదేశాలకు వెళ్లారు. నాలుగైదు రోజుల్లో తిరిగి వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంకోవైపు.. విజయసాయిరెడ్డికి తిరిగి పార్టీ విశాఖ పగ్గాలు అప్పగించడం వల్లే ఆయన జగన్‌ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే గుసగుసలు కూడా వినిపించాయి.

Updated Date - Oct 25 , 2024 | 03:44 AM