Share News

YS Jagan : సిట్టూ అవసరంలేదు.. బిట్టూ అవసరంలేదు

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:27 AM

‘‘తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిందనేది అబద్ధం. ఈ విషయం చెప్పడానికి సిట్టూ అవసరం లేదు.. బిట్టూ అవసరం లేదు’’

YS Jagan : సిట్టూ అవసరంలేదు.. బిట్టూ అవసరంలేదు

లడ్డూ అపవిత్రం అయిందనేది అబద్ధం

సనాతన ధర్మంపై పవన్‌కు ఏం తెలుసు?: జగన్‌

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిందనేది అబద్ధం. ఈ విషయం చెప్పడానికి సిట్టూ అవసరం లేదు.. బిట్టూ అవసరం లేదు’’ అని మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్‌ వేయడంపై ఆయన ఇలా స్పందించారు. శుక్రవారం తాడేపల్లి నివాసంలో జగన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆయన వేసిన సిట్‌ను రద్దు చేసింది. లడ్డూ వ్యవహారంలో అసలేం జరగలేదని కంటికి క్లియర్‌గా కనిపిస్తోంది. అయినా, ఏదో జరిగిందని వీళ్లంద రూ ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ జరగలేద ని మేం చెబుతున్నాం. దానికి ఆధారాలూ చూపిస్తున్నాం. అయినా, ఎవరైనా వచ్చి(సీబీఐ సిట్‌ ) కొత్తగా ఇంకా ఏమి చేస్తారు?’’ అని జగన్‌ ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం వీళ్లు(సిట్‌ అధికారు లు) ఒక తప్పుడు రిపోర్టు తయారుచేసి, ప్రచారంలో పెడితే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుందన్నారు. ‘‘స్వామికి కోపం వస్తే మామూలుగా ఉండదు. అయితే, ఆయన తన కోపాన్ని చంద్రబాబు, కూటమి నేతలు, ఆయనను సమర్థిస్తూ మాట్లాడేవారిపైనా, అబద్ధాలను రెక్కలు కట్టుకుని ప్రచారం చేస్తున్నవారిపైనా మాత్రమే చూపాలి’’ అని పేర్కొన్నారు.

పవన్‌కు ఏం తెలుసు?

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సనాతన ధర్మమంటే తెలుసా అని జగన్‌ ప్రశ్నించారు. కోట్ల మంది భక్తుల్లో అనుమానాలు రేకెత్తించడంలోను, స్వామి పవిత్రతను తగ్గించడంలోను పవన్‌ భాగమయ్యారని ఆరోపించారు.

Updated Date - Oct 05 , 2024 | 04:28 AM