ఉచిత బస్సుపై ప్రభుత్వానికి నిబద్ధత లేదు: షర్మిల
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:10 AM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కూటమి ప్రభుత్వానికి నిబద్ధత లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి విమర్శించారు.
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కూటమి ప్రభుత్వానికి నిబద్ధత లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి విమర్శించారు. కాలయాపన తప్ప ఇచ్చిన హామీని నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని శనివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని దాటవేశారని అన్నారు. బస్సులు కొంటున్నామని చెప్పుకొచ్చారని.. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం పేరుతో మరికొన్ని రోజుల సాగతీతకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటకల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశాయని షర్మిల చెప్పారు. జీరో టికెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి చెల్లించడానికి నిధులు లేవా? అని ప్రశ్నించారు. నూతన సంవత్సర కానుకగానైనా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారా? లేదా? అని నిలదీశారు.