అబద్ధాల అల్లికలో జగన్ సిద్ధహస్తుడు
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:32 AM
అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిద్ధహస్తుడు.
అదానీ కలవడమూ, సీఎంకు నేరుగా ముడుపులు ఇవ్వడమూ చరిత్రే
అసత్య ఆరోపణలు అయితే బైబిల్‌పై ప్రమాణం చేయండి: షర్మిల
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిద్ధహస్తుడు. ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె ఎక్స్‌లో స్పందిస్తూ, జగన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. శాలువలు కప్పాలని, సన్మానాలు చేయాలని, అవార్డులు ఇవ్వాలని కోరుకునే ముందు తన ప్రశ్నలకు సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘2021, మేలో సెకీ వేసిన వేలంలో యూనిట్ గరిష్ఠ ధర రూ.2.14 ఉంటే... తమరు రూ.2.49కు కొన్నందుకు శాలువాలు కప్పాలా? అదానీ వద్ద యూనిట్ రూ.1.99 చొప్పున గుజరాత్ కొనుగోలు చేస్తే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువకు కొన్నందుకు సన్మానాలు చేయాలా? ట్రాన్స్‌మిషన్ చార్జీల భారం అక్కడ ఎక్కడా లేకుంటే గుజరాత్‌కు ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ.1.99కే అదానీ ఎందుకు ఇవ్వలేదు? ట్రాన్సిమిషన్ చార్జీలు గరిష్ఠంగా యూనిట్‌కు రూ.1.70 పడతాయంటూ వైసీపీ సర్కారు జమానాలోని ఇంధన శాఖ అఽధికారులే చెబుతుంటే..
ఎటువంటి చార్జీలూ లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా? ఒక సీఎంని పారిశ్రామికవేత్త, అధికారికంగా కలిస్తే గోప్యత ఎందుకు పాటించారు? నిజమే... అదానీ కలవడం ఒక చరిత్ర. రూ.1,750 కోట్లు నేరుగా సీఎంకి ముడుపులు ఇవ్వడమూ చరిత్రే. ఎవరూ కొనని విద్యుత్తును కొన్నాక బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్ర. గంటల్లోనే కేబినెట్ ముందు పెట్టడమూ చరిత్రే. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆరోజు తమరు కాదా? జగన్ అవినీతి చేశారని చెప్పింది మేం కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ వెల్లడించాయి. ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నాయి. గంగవరం పోర్టును అదానీకి రూ.640 కోట్లకు అమ్మేసినప్పుడే తమరి ముడుపుల భాగోతం తెలిసిపోయింది. అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకపోతే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే... ‘నేను దానివల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు’ అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ ఈ సవాల్‌ను స్వీకరించాలి’’ అని షర్మిల అన్నారు.