వరదల్లోనూ వైసీపీ నీచ రాజకీయాలు
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:59 PM
విజయవాడను ముంచెత్తిన వరదలతో ప్రజలు బాధ పడుతుండగా.. వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.
డోన, సెప్టెంబరు 4: విజయవాడను ముంచెత్తిన వరదలతో ప్రజలు బాధ పడుతుండగా.. వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం డోనలో ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ వరదలతో విజయవాడ అతలాకుతలం కావడంతో బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు. అర్ధరాత్రి వేళల్లో కూడా పడవల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సహాయక చర్యలు అందేలా చూస్తున్నారన్నారు. మంత్రులు, అధికార యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించి బాధితులకు ఆహారం, నీళ్లు, వైద్యానికి సంబంధించిన మందులను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సీఎం స్థాయిలో ఉన్నప్పటికీ చంద్రబాబు స్వయంగా బాధితులతో మాట్లాడుతూ పర్యవేక్షణ చేస్తుండడం వైసీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన బాధితులకు సాయం అందడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ బురదజల్లడం మానుకుని చేతనైతే బాధితులకు సాయం అందించాలన్నారు.
వరద బాధితులను ఆదుకుందాం: ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 4: విజయవాడ వరర బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకుందామని ఎమ్మెల్యే అఖిలప్రియ పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటివల కురిసిన భారీ వర్షాలకు విజయవాడలోని బుడమేరు వాగు పొంగి పొర్లడంతో వరదలు సంభవించాయన్నారు. అక్కడి ప్రజలను తమ వంతు సహాయార్థం ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఆళ్లగడ్డకు విజయవాడలోని 43వ డివిజన సీఎం కేటాయించారని, ముందుగా కమిషనర్ వెంకటరామిరెడ్డి అక్కడ ఉన్నారని, తాను కూడా అక్కడికి వెళ్లి వరదలు తగ్గే వరకు వరద బాధితులకు భోజనం, మంచినీరు శోభా ట్రస్టు తరపున అందిస్తామన్నారు. శోభా ట్రస్టు తరపున రూ.5 లక్షలు విరాళంగా అక్కడి కలెక్టరుకు చెక్కు ఇస్తానని తెలిపారు.