Share News

వైసీపీ నేతల సిఫారసు లేఖలతో భక్తులకు ఐటీబీపీ కానిస్టేబుల్‌ టోకరా

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:29 AM

వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసు లేఖలతో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్‌ బెంగళూరుకు చెందిన భక్తులను మోసగించాడు.

వైసీపీ నేతల సిఫారసు లేఖలతో భక్తులకు ఐటీబీపీ కానిస్టేబుల్‌ టోకరా

పది రూ.300 దర్శన టికెట్లు రూ.70 వేలకు విక్రయం

తిరుమల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసు లేఖలతో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్‌ బెంగళూరుకు చెందిన భక్తులను మోసగించాడు. వీఐపీ బ్రేక్‌ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి పది రూ.300 టికెట్లను రూ.70 వేలకు విక్రయించాడు. భక్తులు విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు చెందిన జగదీశ్‌ అనే భక్తుడు తనకు నాలుగు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు కావాలని ఐటీబీపీ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ను సంప్రదించారు. చంద్రశేఖర్‌ అతని వద్ద నుంచి నాలుగు వీఐపీ బ్రేక్‌ టికెట్లకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు వసూలు చేశాడు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే సిఫారసు లేఖపై రూ.300 టికెట్లు తీసుకుని భక్తులకు అందజేశాడు. చిత్తూరుకు చెందిన హరిబాబు అనే మరో భక్తుడి నుంచి కూడా ఇలాగే 6 శ్రీవాణి టికెట్ల కోసం రూ.50 వేలు తీసుకుని రూ.300 విలువైన టికెట్లు ఇచ్చాడు. ఈ టికెట్లను అనంతపురానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ సిఫారసు లేఖ ద్వారా పొందినట్టు తెలిసింది. మోసపోయామని గుర్తించిన భక్తులు గురువారం విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమల టూ టౌన్‌ సీఐ శ్రీరాముడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్‌ వింగ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


అభిషేకం టికెట్లు ఇప్పిస్తానని రూ. 1.05 లక్షలు వసూలు

తిరుమల శ్రీవారి అభిషేకం, మేల్‌ఛాట్‌ వస్త్రం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి భక్తుల నుంచి ఓ దళారీ రూ.1.05 లక్షలు వసూలు చేసి మోసగించాడు. ఓ భక్తుడి ఫిర్యాదు మేరకు తిరుమల టూటౌన్‌ పోలీసులు శుక్రవారం ఆ దళారీని అరెస్ట్‌ చేశారు. చీరాలకు చెందిన లలిత్‌కుమార్‌ గతంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, పరకామణిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేసేవాడు. శ్రీవారి సేవా టికెట్లు ఇస్తానని నమ్మించి భక్తులను మోసం చేసిన ఘటనతో 2015లో అతన్ని విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత దళారీగా మారిన లలిత్‌కుమార్‌.. తాజాగా నిజామాబాద్‌కు చెందిన సాయిచంద్‌ అనే భక్తుడికి ఐదు అభిషేకం, ఒక మేల్‌ఛాట్‌ వస్త్రం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి ఆన్‌లైన్‌ ద్వారా రూ.1.05 లక్షలు తీసుకున్నాడు. మేల్‌ఛాట్‌ వస్త్రం టికెట్‌ బుక్‌ అయినట్టు నకిలీ మెసేజీ పంపాడు. దీనిపై భక్తుడికి అనమానం రావడంతో టీటీడీ హెల్ప్‌లైన్‌ ద్వారా పరిశీలించగా అది ఫేక్‌ అని తేలింది. దీంతో భక్తుడు తిరుమల టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించగా.. లలిత్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. లలిత్‌ బ్యాంక్‌ ఖాతాను తనిఖీ చేయగా 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

Updated Date - Dec 21 , 2024 | 04:29 AM