పేలవంగా ‘పోరుబాట’
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:39 AM
విద్యుత్ ట్రూ అప్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన ‘పోరుబాట’ పేలవంగా ముగిసింది. చాలా చోట్ల జనస్పందన లేదు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయాల వద్ద జరిగిన ఈ ఆందోళనల్లో వైసీపీ శ్రేణులు, నేతలు మొక్కుబడిగా పాల్గొన్నారు.
ఉమ్మడి కడపలోనే కాస్త మెరుగు..
గట్టి నేతలున్న చోట్ల జనసమీకరణ
జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరుల్లో పర్వాలేదు
పుంగనూరు, తిరుపతి, కోవూరులో కూడా..
చాలాచోట్ల 100-200 లోపే హాజరు
పోరుబాటకు కదలిరాని నేతలు, శ్రేణులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
విద్యుత్ ట్రూ అప్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన ‘పోరుబాట’ పేలవంగా ముగిసింది. చాలా చోట్ల జనస్పందన లేదు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయాల వద్ద జరిగిన ఈ ఆందోళనల్లో వైసీపీ శ్రేణులు, నేతలు మొక్కుబడిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పలువురు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బలమైన నేతలు ఉన్న చోట్ల మాత్రం జనసమీకరణ జరిగింది. ముఖ్యంగా మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఉమ్మడి జిల్లా కడపలో 4-5 నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, రాయచోటిల్లో స్థానిక వైసీపీ నేతలు తమ ఆందోళనలకు బాగానే జనాలను తరలించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిఽధున్‌రెడ్డి ఆధ్వర్యంలో, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో భారీగానే నిరసనలు జరిగాయి. ఏలూరు జిల్లాలో ఎక్కడా 50 మంది కూడా కనబడలేదు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో తప్ప ఎక్కడా స్పందన లేదు. నంద్యాల, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ధర్నాలకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు కూడా హాజరు కాలేదు. ఒక్క నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలోనే మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో ఆందోళన జరిగింది.
మిగతా చోట్ల ద్వితీయ శ్రేణి నేతలే నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, పార్వతీపురంలో వైసీపీ కేడర్ హాజరు ఫర్వాలేదు. కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట జరిగింది. వైసీపీ కార్యాలయానికి 300 మీటర్ల దూరాన ఉన్న విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి నేతలు ర్యాలీగా వెళ్లారు. ఇద్దరు నేతలు కలసి ఆందోళన చేపడితే వెంట 150 మంది మించి రాలేదు. తునిలో మాజీ మంత్రిు దాడిశెట్టి రాజా, పిఠాపురంలో వంగా గీత, పెద్దాపురంలో దవులూరి దొరబాబు, జగ్గంపేటలో తోట నరసింహం, విశాఖలో వాసుపల్లి గణేశ్, ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన ధర్నాల్లో జనమెవరూ పాల్గొనలేదు. వీటితో పాటు అనేక నియోజకవర్గాల్లో పోరుబాట జరిగినా స్పందన కనిపించలేదు. కాగా.. ధాన్యం కొనుగోళ్ల కోసం ఈ నెల రెండో వారంలో వైసీపీ చేపట్టిన రైతు పోరుబాట కూడా చప్పగా సాగిన సంగతి తెలిసిందే.