Share News

TTD : స్పెషల్‌ దందా

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:37 AM

జగన్‌కు ఐదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారో రాష్ట్రం యావత్‌ కళ్లారా చూసింది. పంచభూతాలను గుప్పిటపట్టి ప్రతిదీ ఓ వ్యాపార సరుకుగా మార్చేశారు. ఇసుక వ్యాపారమే ఇందుకు నిదర్శనం. జగనే ఇలా చేస్తే, ఆయన బాబాయి, ‘సూపర్‌స్వామి’ వైవీ సుబ్బారెడ్డి ఇంకెలా చేసి ఉంటారు? అబ్బాయిని ప్రసన్నం చేసుకుని తిరుమల పుణ్యక్షేత్రాన్ని ...

TTD : స్పెషల్‌ దందా
YV Subba Reddy

  • ‘సూపర్‌ స్వామి’ వైవీ హయాంలో ప్రత్యేక దర్శనాల జాతర

  • నాలుగేళ్లలో 3.60 లక్షల మందికి స్పెషల్‌ దర్శనాలు

  • వీఐపీ సేవ పేరుతో ఆనాడు వ్యాపారం చేశారా?

  • సిఫారసు లేఖలకు ధరలు కట్టి అమ్ముకున్నారా?

  • కుటుంబం, సొంత మనుషుల్లో ఎంతమందికి ఇచ్చినా

  • రోజుకు సగటున మరీ 60 లేఖలు ఎలా ఇస్తారు?

  • చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిదీ నాడు ఇదే వరస

  • జగన్‌ ప్రభుత్వ చైర్మన్ల తీరుపై సర్వత్రా అనుమానాలు


వైసీపీ హయాంలో వెంకన్న సన్నిధిని ‘సూపర్‌ స్వామి’ వైవీ సుబ్బారెడ్డి తన జాగీరుగా మార్చుకున్నారు. కొండపై సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని అడ్డగోలు వ్యవహారాలతో చెలరేగిపోయారు. టీటీడీ చైర్మన్‌గా ఆయన అరాచకాలకు పరాకాష్ఠ వీవీఐపీ దర్శనాల వ్యవహారం! టీటీడీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ కోటా కింద రోజుకు సగటున ఆరు నుంచి 12 మందికి మాత్రమే వీవీఐపీ దర్శనం కల్పించాలి. ఒక్కో సిఫారసు లేఖపై ఆరుగురిని ఈ దర్శనాలకు అనుమతిస్తారు. వైవీ సుబ్బారెడ్డి జమానాలో మాత్రం.. రోజుకు సగటున 60 సిఫారసు లేఖలు ఇచ్చి 364 మందికి వీవీఐపీ దర్శనాలకు వీలు కల్పించారు. చైర్మన్‌గా నాలుగేళ్ల కాలంలో 3,60,338 మందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. సుబ్బారెడ్డితో పోల్చితే కొద్దికాలమే భూమన కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. కానీ, ఆ పదవిలో ఉన్న 9 నెలల కాలంలోనే ఏకంగా 43 వేల మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించారు. అంటే సగటున రోజుకు 172 మందికి దర్శనాలు చేయించారు. దీనివెనక మర్మం ఏమిటి? దర్శనాల పేరిట ఏమైనా వ్యాపారం చేశారా? సిఫారసు లేఖలకూ ధరకట్టి అమ్ముకున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌కు ఐదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారో రాష్ట్రం యావత్‌ కళ్లారా చూసింది. పంచభూతాలను గుప్పిటపట్టి ప్రతిదీ ఓ వ్యాపార సరుకుగా మార్చేశారు. ఇసుక వ్యాపారమే ఇందుకు నిదర్శనం. జగనే ఇలా చేస్తే, ఆయన బాబాయి, ‘సూపర్‌స్వామి’ వైవీ సుబ్బారెడ్డి ఇంకెలా చేసి ఉంటారు? అబ్బాయిని ప్రసన్నం చేసుకుని తిరుమల పుణ్యక్షేత్రాన్ని దక్కించుకున్న ఆయన, అంతకుమించి చేయగలను అన్నట్లుగా దందా సాగించారు. సాక్షాత్తూ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం, మొత్తంగానే తిరుమలను తన సొంత సామ్రాజ్యంగా సుబ్బారెడ్డి మార్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన సొంత జాగీరనట్లుగా వ్యహరించారు. తిరుమలేశుడి భక్తిలో తరించాల్సిన ఆయన వీవీఐపీల సేవలో రాణించారు. నిబంధనలు, పద్ధతులు అన్నవేవి ఆయనకు పట్టవన్నట్లుగా చెలరేగిపోయి, సిఫారసు లేఖలు జారీ చేశారు. అంతేనా ఆ లేఖలకు పక్కాగా దర్శనం, సేవలు దక్కేలా దగ్గరుండి చూసుకున్నారు.

tirumala.jpg


ప్రత్యేక దర్శనాలు

ఆయన చైర్మన్‌గా ఉన్న కాలంలో ఏకంగా 3.60 లక్షలమందికి వీవీఐపీ ప్రత్యేక దర్శనాలు, సేవలు కల్పించారు. దేశం అంతా కరోనాతో ఇంటికే పరిమితమైన కాలంలో కూడా ఆయన వీఐపీ సేవలు అందించారు. రోజుకు సగటున 364 మందికి ఆయన వీఐపీ భాగ్యం కల్పించారు. టీటీడీ చరిత్రలో ఇంతలా వీవీఐపీ లేఖలు ఇచ్చి తరించిన చైర్మన్‌ వైవీ తప్ప మరొకరు లేరు. ఇంతలా వీఐపీ దర్శనాలు చేయించడంలోని మర్మం ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిజంగా తిరుమలేశుడి సేవే చైర్మన్‌గా ఆయన పనితీరులో చూపించాలి. ఆధ్యాత్మికతను మరింత పెంపొందించాలి. తిరుమల ప్రతిష్ఠను మరింత పెంపొందించాలి. దానికి భిన్నంగా లక్షల మందికి వీఐపీ దర్శనాలు ఇప్పించారు. దీనివెనక ఉన్న మర్మం ఏమిటి? వీఐపీ దర్శనాల పేరిట వైవీ సుబ్బారెడ్డి ఏమైనా వ్యాపారం చేశారా? సిఫారసు లేఖలకు ధరకట్టి వ్యాపారం నిర్వహించారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ అనుమానాల వెనుక ఉన్న నిజాలేవిటో తెలిస్తే అసలు విషయం బోధపడుతుంది


వీవీఐపీల సేవలో...

2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్‌ తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత తన అవసరాలకు తగినట్లుగా బోర్డు సభ్యులను నియమించుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీకి 2019 జూన్‌ 21 నుంచి 2021 ఆగస్టు వరకు తొలిదఫా చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2021, ఆగస్టు 8 నుంచి 2023 ఆగస్టు 27 వరకు రెండో దఫా చౌర్మన్‌గా ఉన్నారు. చైర్మన్‌ హోదాలో ఆయన ప్రధాన విధి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలనా, పాలనా వ్యవహారాలు చూసుకోవడం, దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేయడం. వీటితోపాటు తిరుమలేశుడి సేవ ఎలాగూ ఉంటుంది. నిబంధనల ప్రకారం తనకు తెలిసిన వ్యక్తులు, నియోజకవర్గ ప్రజలు, ఇతరులకు చైర్మన్‌ హోదాలో వెంకన్న దర్శనం కల్పించవచ్చు.


Tirumala-1.jpg

నో లిమిట్

ఇలా రోజుకు ఎంత మందికి దర్శనం కల్పించాలన్న దానిపై కొన్ని నియమ నిబంధనలున్నాయి. చైర్మన్‌ కోటా కింద రోజుకు సగటున ఆరుగురు లేదా 12 మందికి దర్శనం కల్పించవచ్చు. ఒక్కో సిఫారసు లేఖపై ఆరుగురికి 300 రూపాయలు, లేదా వీవీఐపీ దర్శన ం ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులకు కూడా ఎంతమందికి దర్శనం లేఖలు ఇవ్వాలన్నదానిపై నిర్దిష్ట పరిమితి ఉంటుంది. వైవీ జమానాలో ఈ పరిమితికి గండికొట్టారు. రోజుకు ఎంత మందికి అంటే అంత మందికి వీవీఐపీ దర్శనభాగ్యం కల్పించారు. ఆయన రెండు దఫాలుగా చైర్మన్‌గా పనిచేసిన కాలంలో 3,60,338 మందికి వీవీఐపీ ప్రత్యేక ప్రవే శ దర్శనాలు, తిరుమలేశుడి సేవలు (కల్యాణం, నిజపాదదర్శనం, వస్త్రాలంకర ణ) కల్పించారు. రోజుకు సగటున 364 మందికి చైర్మన్‌ హోదాలో సిఫారసు లేఖలు జారీ చేశారు. సగటున ఒక్క లేఖపై ఆరుగురికి దర్శనం అంటే, రోజుకు సగటున 60 లేఖలు ఇచ్చారు.


స్పెషల్‌ దందా

2020 ఫిబ్రవరి నుంచి కరోనా ప్రభావం నెలకొంది. ఆ తర్వాత మార్చినుంచి ఆగస్టు వరకు లాక్‌డౌన్‌ కొనసాగింది. ఆ సమయంలో ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. సెప్టెంబరు నుంచి మళ్లీ ఫిబ్రవరి వరకు దర్శనాలను అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులను వెంకన్న దర్శనానికి అనుమతించారు. ఆ తర్వాత 2021 మార్చి తర్వాత మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో భౌతికదూరంతో కూడిన దర్శనాలను అనుమతించారు. ఈ సమయంలో కూడా వైవీ సిఫారసుల దర్శనాలు సాగాయి. అంటే, ఆయన రెండేళ్ల తొలి దఫా చైర్మన్‌గిరిలో సింహభాగం కరోనాకాలమే. ఆ తర్వాత రెండో దఫాలోనూ లెక్కలేని దర్శనాలు చేయించారు. కోటా, పరిమితి, నియమనిబంధనలు పట్టకుండా తోచినట్లుగా సొంత మనుషులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పించారు. అయితే ఆ జాబితాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సగటున రోజుకు 12 మందికి మిుంచి అనుమతించరాదని వైవీకి తెలియని విషయం కాదు అయినా ఆ నియమం పక్కనపెట్టి రోజుకు 364 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేక దర్శనాల పేరిట ఆయన ఏమైనా వ్యాపారం చేశారా? సిఫారసు లేఖలకు ధరకట్టి వ్యాపారం నిర్వహించారా? అన్న అనుమానాలు ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఛైర్మన్‌ కోటాలో ప్రత్యేక ప్రవేశ దర్శన ం అంటే ఖచ్చితంగా ప్రోటోకాల్‌ కిందే ఉంటుంది. సకల మర్యాదలు ఉంటాయి. సామన్యులకు ఇది సాధ్యమయ్యేది కాదు.


yv-subbareddy.jpg

నాడు జాతరలా దర్శనాలు

ధనికులు, సంపన్నవర్గాలు, రాజకీయ పలుకుబడి కలిగిన వారికే ఇలాంటివి దక్కుతాయి. లేదంటే, వైవీ కుటుంబీకులు, సన్నిహిత బంధువులకే ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. కానీ వైవీ మనుషులు మహా అంటే 50వేల మంది ఉన్నా, మిగిలిన 3.10 లక్షల మంది ఎవరన్నదే అతిపెద్ద ప్రశ్న. ఆయన లేఖల వెనుక వ్యాపార కోణం ఏమైనా ఉందా అని సందేహించడానికి ఇదీ ఓ కారణమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, చైర్మన్‌ బాటలోనే అధికారులు, సభ్యులు నడిచారు. మంత్రులయితే ఇక లెక్కేలేదు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, చంద్రగరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సిఫారసుల లేఖలకు లెక్కేలేదు. ఒక్కో మంత్రి రోజుకు సగటున 50-70 మందిపేర్లు ప్రత్యేక దర్శనాలకు సిఫారసు చేశారు. రోజా మంత్రిగా ఉండగా తిరుమల దర్శనానికి కనీసం 40-60 మందితో వెళ్లేవారు. ఆమె వచ్చారంటే కొండపై ఓ జాతరలాగనే ఉండేది.


భూమనది అదే దారి

జగన్‌కు సన్నిహితుడు, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి 2023 సెప్టెంబరు నుంచి తొమ్మిది నెలల పాటు తిరుమల దేవస్థానం చైర్మన్‌గా పనిచేశారు. దైవభక్తిని పెంపొందించేందుకు, ఆద్యాత్మికను నలుదిశలా వ్యాప్తింప చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్న ఆయన సిఫారసు లేఖలు, విఐపీ దర్శనాల విషయంలో వైవీకి ఏమాత్రం తీసిపోలేదు. తొమ్మిది నెలల కాలంలో భూమన 43 వేల మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించారు. తిరుమలపై రద్దీ ఉన్న రోజుల్లో, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆయన సగటున 172 మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించారు. ఆయన కోటాలో దర్శన భాగ్యం పొందిన వారిలో అత్యధికులు రాష్ట్రేతరులే ఉండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Sep 24 , 2024 | 09:38 AM