2023-24లో పన్ను రాబడి రూ.19.58 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 22 , 2024 | 04:17 AM
దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 సంవత్సరంలో అంచనాలను మించి భారీగా వసూలయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 17.7 శాతం వృద్ధితో రూ.19.58 లక్షల కోట్లుగా నమోదయ్యాయి...
న్యూఢిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 సంవత్సరంలో అంచనాలను మించి భారీగా వసూలయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 17.7 శాతం వృద్ధితో రూ.19.58 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల (ఆదాయపు పన్ను+కార్పొరేట్ పన్ను) ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది బడ్జెట్ అంచనాల కన్నా రూ.1.35 లక్షల కోట్లు, సవరించిన అంచనాల కన్నా రూ.13,000 కోట్లు అధికంగా ఉంది. తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.19.45 లక్షల కోట్లకు పెంచింది. కాగా ఆర్థిక సంవత్సరం మొత్తానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం రూ.18.48 లక్షల కోట్లు కాగా వాస్తవంగా వసూలైనది రూ.23.37 లక్షల కోట్లు, రిఫండ్లు (రూ.3.79 లక్షల కోట్లు) పోను నికర వసూళ్లు 17.7 శాతం వృద్ధితో రూ.19.58 లక్షల కోట్లున్నాయి. ఆర్థిక రంగంలో అంతర్గత శక్తికి, వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధికి ఇది దర్పణం పడుతున్నదని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇదే సంవత్సరానికి స్థూల పన్ను వసూళ్లు (రిఫండ్లు సద్దుబాటు చేయడానికి ముందు) రూ.23.37 లక్షల కోట్లుంది. 2022-23 సంవత్సరంలో వసూలైన రూ.19.72 లక్షల కోట్లతో పోల్చితే ఇది 18.48 శాతం అధికం. మరిన్ని వివరాలు...
స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు (అంచనా) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13.06 శాతం వృద్ధితో రూ.11.32 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది వసూళ్లు రూ.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు ముందు ఏడాదితో పోల్చితే 10.26 శాతం పెరిగి రూ.8.26 లక్షల కోట్ల నుంచి రూ.9.11 లక్షల కోట్లకు చేరాయి.
సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) సహా స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 24.26 శాతం వృద్ధితో రూ.9.67 లక్షల కోట్ల నుంచి రూ.12.01 లక్షల కోట్లకు పెరిగాయి. నికర వసూళ్లు కూడా 25.23 శాతం వృద్ధితో రూ.8.33 లక్షల కోట్ల నుంచి రూ.10.44 లక్షల కోట్లకు పెరిగాయి.
పన్ను రిఫండ్స్ మొత్తం రూ.3.79 లక్షల కోట్లుంది. అంటే ముందు ఏడాదిలో నమోదైన రూ.3.09 లక్షల కోట్ల కన్నా 22.74 శాతం పెరిగింది.
రికార్డు స్థాయిలో జీఎ్‌సటీ వసూళ్ల సహాయంతో పరోక్ష పన్ను వసూళ్లు కూడా సవరించిన అంచనాల కన్నా భారీగా పెరిగి రూ.14.84 లక్షల కోట్లకు చేరాయి.