వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jun 26 , 2024 | 04:49 AM
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఐపీపీఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది...
2025-26లో పబ్లిక్ ఇష్యూకి..
వచ్చే ఏడాది మంత్రాలయం ప్లాంట్ విస్తరణ పూర్తి
ఎంఐపీపీఎల్ సీఈఓ అభిషేక్ అగర్వాల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఐపీపీఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మంగళవారం నాడిక్కడ కంపెనీ కొత్త ఉత్పత్తి ‘ఎంఎస్ వాయు’ విడుదల చేసిన సందర్భంగా సంస్థ సీఈఓ అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. కార్యకలాపాల విస్తరణ కోసం ఈ మొత్తాలను వెచ్చించనున్నట్లు తెలిపారు. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం,నాయుడుపేట, తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్లలో స్పాంజ్ ఐరన్, బిల్లెట్స్, టీఎంటీ బార్స్, ఎంఎస్ రౌండ్, బైండింగ్ వైర్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు.
కార్యకలాపాల విస్తరణలో భాగంగా 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న మంత్రాలయం ప్లాంట్ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరో 300 ఎకరాలను కొనుగోలు చేయటంతో పాటు కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఈ కొత్త ప్లాంట్ అందుబాటులోకి రానుందన్నారు. అంతేకాకుండా ప్లాంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.8 లక్షల టన్నుల నుంచి 2..86 లక్షల టన్నులకు పెరగనుందని చెప్పారు. ఉత్తరాది మార్కె ట్లో కార్యకలాపాలను విస్తరించేందుకు గాను నోయిడా సమీపంలోని ఘజియాబాద్, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. విస్తరణకు అవరమైన మొత్తాలను రుణాలు, అంతర్గత వనరులతో పాటు పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించనున్నట్లు ఆయన చెప్పారు.
ఐపీఓ ద్వారా రూ.400 కోట్ల సమీకరణ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుందని అగర్వాల్ వెల్లడించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇష్యూలో భాగంగా కంపెనీలో 25 శాతం వాటాలను విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాలను కార్యకలాపాల విస్తరణకు వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం టర్నోవర్ రూ.1,200 కోట్లుగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.