Share News

2 రోజుల్లో రూ.21 లక్షల కోట్లు

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:54 AM

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి తొలగిపోవడంతో పాటు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది...

2 రోజుల్లో  రూ.21 లక్షల కోట్లు

హెరిటేజ్‌ షేరు మరో 10% అప్‌

భారీగా పెరిగిన మార్కెట్‌ సంపద ..

మరో 692 పాయింట్ల లాభంతో 75,000 ఎగువకు సెన్సెక్స్‌

  • 201 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

  • అదానీ షేర్లలో కొనసాగిన ర్యాలీ

ముంబై: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి తొలగిపోవడంతో పాటు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 915.49 పాయింట్ల వరకు పెరిగి 75,297.73 వద్దకు చేరుకున్నప్పటికీ, చివర్లో 692.27 పాయింట్ల లాభంతో 75,074.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 290 పాయింట్ల మేర బలపడినప్పటికీ, 201.05 పాయింట్ల లాభంతో 22,821.40 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రెండు రోజుల్లో రూ.21.05 లక్షల కోట్లు పెరిగి రూ.415.89 లక్షల కోట్లకు చేరుకుంది. ఎన్‌డీఏలోనే కొనసాగడంతో పాటు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో బుధవారం సెన్సెక్స్‌ 2,303.19 పాయింట్లు, నిఫ్టీ 735.85 పాయింట్ల లాభపడిన విషయం తెలిసిందే. మరిన్ని ముఖ్యాంశాలు..


  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా షేరు 4.07 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.04 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. కాగా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 2.04 శాతం క్షీణించింది.

  • బ్లూచి్‌పలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 3.06 శాతం ఎగబాకగా.. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.28 శాతం పెరిగింది. బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలూ పాజిటివ్‌గా ముగిశాయి. రియల్టీ 4.85 శాతం ఎగబాకగా.. ఇండస్ట్రియల్స్‌ సూచీ 3.69 శాతం పుంజుకుంది. పవర్‌, ఐటీ, యుటిలిటీస్‌, ఎనర్జీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా వృద్ధి చెందాయి.

  • వరుసగా రెండో రోజూ అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల్లో 9 లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేరు 5.10 శాతం వృద్ధి చెందగా.. అదానీ టోటల్‌ గ్యాస్‌ 3.97 శాతం, ఎన్‌డీటీవీ 3.70 శాతం, అదానీ పవర్‌ 3.17 శాతం, అదానీ విల్మర్‌ 3.05 శాతం, ఏసీసీ 2.56 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.13 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1.99 శాతం, అంబుజా సిమెంట్స్‌ 1.77 శాతం పెరిగాయి. అదానీ పోర్ట్స్‌ మాత్రం 0.18 శాతం నష్టపోయింది. దాంతో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.14.08 లక్షల కోట్లుగా నమోదైంది.


  • రాయ్‌పూర్‌లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి అదానీ పవర్‌ నుంచి రూ.3,500 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కించుకున్న నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌ షేరు ఒక దశలో 15 శాతం వరకు ఎగబాకినప్పటికీ, చివరికి 8.97 శాతం లాభంతో రూ.278.15 వద్ద ముగిసింది.

  • ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి 83.49 వద్ద ముగియగా.. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 0.09 శాతం పెరిగి 78.43 డాలర్ల వద్ద ట్రేడైంది.

  • దేశీయంగా విలువైన లోహాల ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం రూ.680 పెరుగుదలతో రూ.73,500కు చేరుకుంది. కిలో వెండి రూ.1,400 పెరిగి రూ.93,300 ధర పలికింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు 28 డాలర్లు పెరిగి 2,360 డాలర్లకు చేరుకోగా.. సిల్వర్‌ 30.30 డాలర్ల వద్ద ట్రేడైంది.


మోదీ మూడో టర్మ్‌లో సెన్సెక్స్‌ @1,00,000

భారత స్టాక్‌ మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న బుల్‌ ర్యాలీకి ఢోకా లేదని ప్రముఖ అంతర్జాతీయ ఈక్విటీ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అన్నారు. ఎన్‌డీఏకు భారీ మెజారిటీ లభించకపోయినప్పటికీ, మోదీ మూడో టర్మ్‌ ముగియక ముందే సెన్సెక్స్‌ 1,00,000 పాయింట్ల మైలురాయికి చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. వచ్చే పదేళ్లపాటు సెన్సెక్స్‌ 14-15 శాతం చొప్పున వృద్ధి చెందవచ్చని మొబియస్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Jun 07 , 2024 | 04:54 AM