6 నెలలు.. రూ.21,367 కోట్లు
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:15 AM
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బ్యాంకుల్లో మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఏదోలా మాయ చేసి కేటుగాళ్లు దర్జాగా బ్యాంకుల నుంచి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లోనే దేశంలోని బ్యాంకుల్లో....
2024-25 ప్రథమార్ధంలో బ్యాంకుల్లో
8 రెట్లు పెరిగిన మోసాలు.. ఆర్‌బీఐ నివేదిక వెల్లడి
ముంబై: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బ్యాంకుల్లో మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఏదోలా మాయ చేసి కేటుగాళ్లు దర్జాగా బ్యాంకుల నుంచి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లోనే దేశంలోని బ్యాంకుల్లో 18,461 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. ఈ మోసాలతో కొట్టేసిన సొమ్మూ రూ.21,367 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2023 -24) ఇదే కాలంలో నమోదైన రూ.2,623 కోట్లతో పోలిస్తే ఇది ఎనిమిదింతలు ఎక్కువ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గురువారం దీనికి సంబంధించి ‘ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2023-24’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఈ మోసాలతో బ్యాంకింగ్ వ్యవస్థ పేరు ప్రతిష్ఠలతో పాటు నిర్వహణ, వ్యాపారపరమైన ఇబ్బందులు, వాటి ఆర్థిక స్థిరత్వం, ఖాతాదారుల నమ్మకానికి సవాల్‌గా మారాయని తెలిపింది.
పీఎ్‌సబీల వాటానే ఎక్కువ
గత ఆర్థిక సంవత్సరం దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో నమోదైన ఇంటర్నెట్, కార్డు మోసాల్లో 67.1 శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో నమోదయ్యాయని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. అయితే నష్టపోయిన సొమ్ముపరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ)లే అత్యధికంగా నష్టపోయాయి. ఇటీవల కొన్ని డిజిటల్ లెండింగ్ సంస్థలు ఆర్‌బీఐ నియంత్రణలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల అనుబంధ సంస్థలమని చెప్పుకుని మోసం చేయడమూ పెరిగిపోయిందని నివేదిక పేర్కొంది. దీంతో ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ మోసాలకు పాల్పడే డిజిటల్ లెండిగ్ యాప్స్ పేర్ల తో ఒక జాబితా రూపొందించేందుకు సిద్ధమవుతోంది.
రూ.3.5 లక్షల కోట్ల నికర లాభాలు
మోసాలు పెరిగి పోతున్నా దేశంలోని వాణిజ్య బ్యాంకులు వరుసగా ఆరో సంవత్సరంలోనూ లాభాలు నమోదు చేయడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో బ్యాంకులు రూ.3.5 లక్షల కోట్ల నికర లాభాలు నమోదు చేశాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ఇది రూ.87,000 కోట్లు ఎక్కువ. మళ్లీ ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) వాటానే రూ.1.46 లక్షల కోట్లుగా ఉంది.