Gold Rates: దీపావళి నాటికి బంగారం 78000?
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:18 AM
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీరేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో రాబోయే కాలంలో బంగారం ధరలు చుక్కలనంటవచ్చునని విశ్లేషకులంటున్నారు. అమెరికన్ ఫెడరల్ బుధవారం వడ్డీరేటును 0.50 శాతం పెంచడంతో పాటు...
ఫెడ్ రేటు కోత ప్రభావం
మున్ముందు మరింత ప్రియం!
న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీరేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో రాబోయే కాలంలో బంగారం ధరలు చుక్కలనంటవచ్చునని విశ్లేషకులంటున్నారు. అమెరికన్ ఫెడరల్ బుధవారం వడ్డీరేటును 0.50 శాతం పెంచడంతో పాటు ఈ ఏడాది చివరినాటికి మరో అర శాతం, 2025లో ఒక శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఆల్‌టైం గరిష్ఠాల వద్ద ట్రేడవుతోంది. ఇది స్వల్పకాలికంగా దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలున్నప్పటికీ.. రాబోయే కాలంలో మాత్రం ధరలు మరింత ఎగబాకనున్నాయని బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దీపావళి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2,650 డాలర్ల స్థాయికి, దేశీయంగా తులం బంగారం రూ.78,000 స్థాయికి చేరుకోవచ్చని కామ జువెలర్స్ ఎండీ కోలిన్ షా అంటున్నారు.
ఫెడ్ రేటు తగ్గితే బంగారం పైకే...
సాధారణంగా ఫెడ్ రేట్లు, బులియన్ ధరలది విలోమ సంబంధం. ఫెడ్ రేట్లు పెరుగుతున్నప్పుడు విలువైన లోహాల ధరలు తగ్గుతాయి. ఫెడ్ రేట్ల తగ్గుదల సమయంలో బులియన్ ధరలు ఎగబాకుతాయి. ఫెడ్ దూకుడుగా వడ్డీరేట్లను తగ్గిస్తే గనుక, వచ్చే ఏడాది జూన్ నాటికి ఔన్స్ గోల్డ్ 3,000 డాలర్ల స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
వెండి @: రూ.91,000
ఇదిలా ఉండగా దేశీయ మార్కెట్లో గురువారం బులియన్ రేట్లు మరింత ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరుగుదలతో రూ.75,650కి చేరుకుంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.91,000 ధర పలికింది. ఫెడ్‌రేట్లు తగ్గడంతో అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ఇందుకు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు వీటి కొనుగోళ్లు పెంచడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. అయితే, రూపాయి బలోపేతం దేశీయంగా బులియన్ ర్యాలీని పరిమితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర ఒకదశలో 0.45 శాతం పెరిగి ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 2,610.20 డాలర్ల వద్ద ట్రేడైంది. వెండి సైతం 2.58 శాతం వృద్ధితో 31.48 డాలర్లకు చేరుకుంది.