3 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు ఫట్
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:29 AM
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు...
భారీగా తరిగిన మార్కెట్ సంపద
సెన్సెక్స్ మరో 456 పాయింట్లు డౌన్
ముంబై: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా మంగళవారం సెన్సెక్స్ మరో 456.10 పాయింట్లు క్షీణించి 72,943.68 వద్దకు జారుకుంది. ఒకదశలో సూచీ 714.75 పాయింట్ల మేర పతనమైనప్పటికీ, చివర్లో మళ్లీ కోలుకుంది. నిఫ్టీ విషయానికొస్తే, 124.60 పాయింట్ల నష్టంతో 22,147.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 23 నష్టపోగా.. ఇన్ఫోసిస్ షేరు 3.65 శాతం పతనమై సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. బీఎ్‌సఈలోని ఐటీ, టెక్ సూచీలు రెండు శాతానికి పైగా క్షీణించాయి. కాగా, గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,094.47 పాయింట్లు (2.79 శాతం) నష్టపోయింది. దాంతో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 రోజుల్లో రూ.7.93 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.394.26 లక్షల కోట్లకు (4.75 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
ఐపీఓకు నెఫ్రో కేర్: హెచ్‌డీఎ్‌ఫసీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ సహా పలువురు కార్పొరేట్ ప్రముఖుల పెట్టుబడులు కలిగిన కిడ్నీ సంరక్షణ సేవల సంస్థ నెఫ్రో కేర్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకోసం ఎన్‌ఎ్‌సఈలోని స్మాల్, మీడియం కంపెనీ లిస్టింగ్ వేదికైన ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌కు ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓ ద్వా రా 45.84 లక్షల తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులతో కోల్‌కతాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
రికార్డు కనిష్ఠానికి రూపాయి: భారత కరెన్సీ విలువ రికార్డు కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి 83.61 వద్ద ముగిసింది. ఈ మార్చి 22న కూడా డాలర్-రూపీ మారకం రేటు ఇదే స్థాయి వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా మిగతా కరెన్సీలతోనూ పోల్చినా డాలర్ బలపడటంతోపాటు అంతర్జాతీయ ప్రతికూలతలు, మన ఈక్విటీ మార్కె ట్లో నష్టాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి.