Share News

రికార్డుల ర్యాలీకి విరామం

ABN , Publish Date - Sep 04 , 2024 | 02:36 AM

వరుసగా పది రోజులు పరుగు తీసిన సెన్సెక్స్‌ మంగళవారం కాస్త విరామం తీసుకుంది. ఇంట్రాడేలో 159 పాయింట్ల వరకు క్షీణించిన సూచీ.. చివరికి 4.40 పాయింట్ల నష్టంతో 82,555.44 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల...

రికార్డుల ర్యాలీకి విరామం

మిశ్రమంగా ముగిసిన సూచీలు

బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ఐపీఓ ధరల శ్రేణి రూ.66-70

ముంబై: వరుసగా పది రోజులు పరుగు తీసిన సెన్సెక్స్‌ మంగళవారం కాస్త విరామం తీసుకుంది. ఇంట్రాడేలో 159 పాయింట్ల వరకు క్షీణించిన సూచీ.. చివరికి 4.40 పాయింట్ల నష్టంతో 82,555.44 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో మదుపరులు ఐటీ, మెటల్‌, ఆయిల్‌ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది. కాగా, నిఫ్టీ వరుసగా 14వ రోజూ పాజిటివ్‌గా ముగిసింది. 1.15 పాయింట్ల పెరుగుదలతో 25,279.85 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌ నష్టపోయిన షేర్లలో ఉన్నాయి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 0.54 శాతం వరకు పెరిగాయి. రంగాలవారీ సూచీల్లో యుటిలిటీస్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియల్టీ, టెక్‌ అర శాతానికి పైగా నష్టపోయాయి. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి రూ.83.96 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 3.75 శాతం తగ్గి 74.62 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.


ఈ నెల 9న ఇష్యూ ప్రారంభం

బజాజ్‌ ఫైనాన్స్‌ అనుబంధ విభాగమైన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ఈ నెల 9న ప్రారంభమై 11న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణిని కంపెనీ రూ.66-77గా నిర్ణయించింది. బజాజ్‌ గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,560 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోంది. అందులో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ.3,560 కోట్లు, మాతృసంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ వాటాకు చెందిన రూ.3,000 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. కాగా, వాహన విడిభాగాల తయారీదారు క్రాస్‌ లిమిటెడ్‌తో పాటు టోలిన్స్‌ టైర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓలు సైతం ఈ నెల 9న ప్రారంభమై 11న ముగియనున్నాయి. ఐపీఓ ద్వారా క్రాస్‌ లిమిటెడ్‌ రూ.500 కోట్లు, టోలిన్స్‌ టైర్స్‌ రూ.230 కోట్ల వరకు సమీకరించాలనుకుంటున్నాయి. ఈ రెండు కంపెనీలు తమ ఇష్యూ ధరల శ్రేణిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


జీఐసీలో 6.78 శాతం వాటా విక్రయం

ప్రభుత్వ రంగ బీమా సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (జీఐసీ ఆర్‌ఈ)లో కేంద్ర ప్రభుత్వం 6.78 శాతం వాటాకు సమానమైన 11.90 కోట్ల షేర్లను బుధవారం విక్రయించనుంది. షేరు కనీస ధరను రూ.395గా నిర్ణయించింది. తద్వారా కేంద్రానికి రూ.4,700 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. బీఎ్‌సఈలో జీఐసీ షేరు ధర మంగళవారం 0.13 శాతం తగ్గి రూ.421.25 వద్ద ముగిసింది. ఈ లెక్కన, కేంద్రం కంపెనీ షేరును 6.23 శాతం తక్కువకు విక్రయించనుంది. ప్రస్తుతం జీఐసీలో కేంద్ర ప్రభుత్వం 85.78 శాతం వాటా కలిగి ఉంది.


ప్రీమియర్‌ ఎనర్జీస్‌

బంపర్‌ లిస్టింగ్‌

తొలిరోజే 87% ఎగబాకిన షేరు

హైదరాబాద్‌కు చెందిన సోలార్‌ సెల్‌, మాడ్యూల్స్‌ తయారీ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ లిస్టింగ్‌కు మార్కెట్‌ వర్గాల నుంచి అపూర్వ స్పందన లభించింది. గత వారంలో ఐపీఓ పూర్తి చేసుకున్న ఈ కంపెనీ.. మంగళవారం షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.450తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు ఏకంగా 120.22 శాతం ప్రీమియంతో రూ.991 వద్ద లిస్టయింది. ఆ తర్వాత 120.76 శాతం వృద్ధిని కనబర్చింది. తర్వాత మళ్లీ తగ్గుతూ వచ్చింది. తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి ప్రీమియర్‌ ఎనర్జీస్‌ షేరు 86.58 శాతం లాభంతో రూ.839.65 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.37,849.27 కోట్లుగా నమోదైంది. బీఎ్‌సఈలో కంపెనీకి చెందిన 50.30 లక్షల షేర్లు చేతులు మారాయి. కాగా, గత గురువారంతో ముగిసిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఐపీఓకు సైతం ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఇష్యూ సైజుకు ఏకంగా 74.09 రెట్ల బిడ్లు లభించాయి. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సంస్థ రూ.2,830 కోట్లు సమీకరించింది.

Updated Date - Sep 04 , 2024 | 02:36 AM